తెలంగాణలో వాతావరణం యూటర్న్ తీసుకోబోతోంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే సమయంలో హీట్‌వేవ్ ముప్పు కూడా పెరుగుతుండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం వాటి పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం (cyclonic circulation) నెలకొని ఉందని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మరాఠ్వాడా నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉందని ఆమె తెలిపారు. ద్రోషి ప్రభావం వల్ల ఏప్రిల్ 5వతేదీ నుంచి 9వతేదీ వరకు ఐదు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరత్న వెల్లడించారు. 5రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐఎండీ అధికారులు ఎల్లోఅలెర్ట్ జారీ చేశారు.
చెదురుమదురుగా మోస్తరు వర్షాలు
ఆదివారం ఉదయం మేడ్చల్, ఘట్‌కేసర్, యాదాద్రి - భువనగిరి, సిద్దిపేట, జనగాం, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, హన్మకొండలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ పోస్టులో తెలిపారు. ఈశాన్య హైద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వివరించారు.శనివారం రాత్రి సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు కురిశాయి.హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయని తెలంగాాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఈశాన్య హైద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వివరించారు.
నేడు ఉరుములతో కూడిన వర్షాలు
ఆదివారం నాడు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతవాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్తలు వెల్లడించారు. గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
ఆదివారం నాడు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతవాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈదురుగాలులు వీచే అవకాశం
సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.ఆదివారం నుంచి ఏప్రిల్ 9వతేదీ వరకు అయిదు రోజుల పాటు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ వివరించింది.
ఏప్రిల్ 7వతేదీన...
ఏప్రిల్ 7వతేదీన ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నగరంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీల సెల్సియస్, 25 డిగ్రీల సెల్సియస్ గా ఉండే అవకాశం ఉంది.
తెలంగాణలో హీట్ వేవ్
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల వేసవి కాలంలో తూర్పు ఆగ్నేయ జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్పారు. పశ్చిమ జిల్లాల్లోనూ వేడిగాలులు వీచే అవకాశం ఉంది.తెలంగాణలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో హీట్ వేవ్ రోజుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజారోగ్యం, నీటివనరులు, విద్యుత్ డిమాండుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎండ వేడిమి బారిన పడకుండా వృద్ధులు, పిల్లలు, కార్మికులు, రోగులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.ఏప్రిల్ నెలలో ఒక వైపు వేడిగాలులు వీయడంతోపాటు అన్ని జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
దిగుబడి తగ్గే అవకాశం
ఏప్రిల్ నెలలో అకాల వర్షాల ప్రభావం వల్ల మొక్కజొన్న, పప్పులు, టమోటా, మిర్చి, వంకాయ లాంటి కూరగాయల తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పారు. గోదుమ, శనగల, మినుముల దిగుబడి తగ్గే అవకాశముందని వారు తెలిపారు. మామిడిపంట పండ్ల రాలి కింద పడటంతో పాటు దిగుబడి తగ్గడం వల్ల రైతులకు తీరని నష్టం జరగనుందని హార్టికల్చర్ అధికారులు చెప్పారు.
మొత్తానికి వర్షాలు, వేడిగాలులు కలిసి ప్రభావం చూపనున్న ఈ అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. రైతులు పంటల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, సాధారణ ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలి. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశముండటంతో అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించడం మంచిది.