తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
x
తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

ఎండలకు బ్రేక్.. తెలంగాణలో ఉరుములు, వడగళ్ల వర్షాలు


తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రతకు స్వల్ప విరామం లభించనుంది. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం నుంచి రాగల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగింది. పశ్చిమ విదర్భ నుంచి మరాట్వాడ, అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని ఐఎండీ అధికారులు చెప్పారు.
సోమవారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మార్చి 31వతేదీ మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.

వర్షాలతో ఉపశమనం

మూడు రోజుల తీవ్రమైన ఎండల తర్వాత, సోమవారం తెలంగాణ అంతటా ఉపశమనం లభించిందని హైదరాబాద్ రెయిన్స్ నిపుణులు చెప్పారు. సోమవారం ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎక్స్ పోస్టులో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పులు ఆశించవచ్చునన్నారు. వేడి కారణంగా అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పశ్చిమ , దక్షిణ,ఉత్తర తెలంగాణ ప్రాంతాలు వర్షాలతో హోరెత్తనున్నాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు బలంగా ఉన్నాయని నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ నిపుణులు సూచించారు.

11 జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో సోమవారం ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో...

హెైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తదుపరి 24 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి లేదా ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 37.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ నమోదైందని ఐఎండీ వివరించింది. మలక్ పేట, నాంపల్లి, ఆబిడ్స్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, యాప్రాల్, అల్వాల్, దమ్మాయిగూడ, పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.

ఏప్రిల్ 1,2 వతేదీల్లో...

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏప్రిల్ 1,2 వతేదీల్లో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిలాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 4వరోజు ఏప్రిల్ 2వతేదీన ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయి. (గాలి వేగం గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్,కొమురంభం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.

మూడురోజులుగా మండుతున్న ఎండలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించనున్నాయి. అయితే ఉరుములు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.


Read More
Next Story