
తెలంగాణలో వర్షాలు : వాతావరణ నిపుణుల హెచ్చరిక
తెలంగాణలో ఆరు రోజులపాటు వర్షాలు : ఎల్లో అలెర్ట్ జారీ
జిల్లాల్లో వాతావరణం మార్పు..పలు జిల్లాల్లో వడగళ్ల వానలు, ఈదురు గాలులు
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. సోమవారం నుంచి ఆరు రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు, వడగళ్ల వానలు కూడా కురిసే అవకాశముందని హెచ్చరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం నుంచి ఆరు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. ఈ నెల 16వతేదీ నుంచి 21వతేదీ వరకు హైదరాబాద్, నల్గొండ,యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్,కామారెడ్డి, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్,సంగారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల రాజన్న జిల్లాల్లో సోమవారం నుంచి వర్షాలు మొదలై మరికొన్ని జిల్లాలకు వర్షాలు విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలో వర్షాలు (తెలంగాణ వెదర్ మ్యాన్ విడుదల చేసిన చిత్రం)
రాష్ట్రంలో ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో ఆరు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నందున వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరాట్వాడ ప్రాంతం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతున్నందున కురిసే వర్షాల వల్ల ఈ నెల 21వతేదీ వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో, మరాఠ్వాడా నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు విస్తరించి ఉన్నట్లు ఐఎండీ వెదర్ బులెటిన్ వెల్లడించింది.తెలంగాణ రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్చి 16న అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
2023లో కురిసిన వడగళ్ల వర్షం : ఈ వారంలో మళ్లీ రిపీట్ కానుందా?
వడగళ్ల వర్షం కురిసే అవకాశం
పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న శక్తివంతమైన గాలుల ప్రభావం వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వెదర్ మ్యాన్ తెలిపారు. భారీ ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ రెయిన్స్ ఎక్స్ పోస్టులో వెల్లడించింది. 2023 మార్చి 16 నుంచి 19వతేదీ వరకు తెలంగాణలో భారీ వడగళ్ల వర్షాలు కురిశాయి. మూడేళ్ల తర్వాత అవే తేదీల్లో మళ్లీ వడగళ్ల వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వెదర్ మ్యాన్ తెలిపారు. పశ్చిమ నుంచి వీచే గాలుల అలజడి కారణంగా తెలంగాణ అంతటా విస్తృతంగా ఉరుములతో కూడిన తుపానులు సంభవించే అవకాశం ఉంది.తీవ్రమైన ఉరుములు,మెరుపులు, వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ తీవ్ర స్థాయిలో ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి.
అకాల వర్షాల హెచ్చరిక : తెలంగాణ వెదర్ మ్యాన్
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.ఇదే సమయంలో కరీంనగర్, హన్మకొండ, వరంగల్, పెద్దపల్లిలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ మధ్యస్థం నుండి తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వివరించారు.గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల వడగళ్ల వర్షాలు కురిసే అవకాశముందని వెదర్ మ్యాన్ వివరించారు.
తీవ్రమైన ఉరుములతో కూడిన వర్ష హెచ్చరిక
తెలంగాణలో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. రెండు దశల వారీగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మొదటి దశ జిల్లాల్లో 40 నుంచి 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో తీవ్రమైన పిడుగులు, వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు. హైదరాబాద్‌లో మార్చి 16-17 తేదీల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో వడగళ్లు, ఈదురు గాలులతో కూడిన ఒకటి లేదా రెండు విడతల తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.రెండో దశలో మార్చి 18 నుంచి 19 తేదీల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
ఈ అకాల వర్షాల వల్ల తెలంగాణలో వ్యవసాయ పంటలకు నష్టం కలిగించే అవకాశముంది. గాలులు, వడగళ్ల వానల వల్ల పంటలు దెబ్బతినవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. పిడుగులు పడటం వల్ల ప్రాణనష్టం సంభవించే అవకాశాలున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లకు నష్టం వాటిల్లడం, ప్రమాదాలు జరిగే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు సూచించారు.
Next Story

