
మంత్రి పదవిపై రాజగోపాల్ యూటర్న్.. టోన్ మార్పు ఎందుకు?
మంత్రి పదవి హామీలు, గత వ్యాఖ్యలు, తాజా మార్పు వెనుక రాజకీయ వ్యూహంపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల విశ్లేషణ.
మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి పట్టు సడలినట్లుంది. మొన్నటి వరకు మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రి అవుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ ఒక్కసారిగా యూటర్న్ లీసుకున్నారు. తాను మంత్రి పదవి అవసరం లేదని, కానీ ఇస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజగోపాల్ ఒక్కసారిగా మార్చిన మాటతో మునుగోడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టోన్ ఒక్కసారిగా ఎందుకు మారింది? మొన్నటి వరకు పట్టువదలని విక్రమార్కుడిలా మాట్లాడిన రాజగోపాల్ ఇప్పుడు సాఫ్ట్ వైఖరిని అవలంబించడం వెనక ఎవరి హస్తం ఉంది? అనే అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన, గతంలో కాంగ్రెస్ అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదని తెలిపారు. తాను మంత్రి పదవి కోసం ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేశారు. పదవి లేకపోయినా ప్రజల్లో తనకు గౌరవం ఉంటుందని చెప్పారు. అయితే, తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు అవసరమని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేకంగా భేటీ కాలేదని, ఎదురుపడినప్పుడు పలకరించుకున్నామని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్‌తో కూడా సాధారణ విషయాలపై చర్చ జరిగినట్లు వివరించారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు 88 సీట్లు వచ్చినప్పటికీ, 12 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం సరైంది కాదని అప్పట్లో చెప్పినట్లు గుర్తుచేశారు.
గతంలో మంత్రి పదవి రాకపోతే సీఎం అవుతానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు టోన్ మార్చారన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదొక్కటనే కాదు.. అనేక సందర్భాల్లో రేవంత్ వ్యాఖ్యాలపై రాజగోపాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పుబట్టారు కూడా. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను కూడా వ్యతిరేకించారు. లిక్కర్ షాపుల టెండర్ల సమయంలో కూడా రాజగోపాల్ చాలా మొండిగా వ్యవహరించారు. రాష్ట్రమంతా ఎలా జరిగినా తనకు సంబంధం లేదని, తన నియోజకవర్గంలో మాత్రం తాను చెప్పినట్లే లిక్కర్ షాపులు నడుస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తన రాజకీయ బలం చూపించే ప్రయత్నంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, పార్టీ అంతర్గత సమతౌల్యం ముఖ్యమైంది. ఈ నేపథ్యంలో హైకమాండ్‌పై ఒత్తిడి పెంచకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన సాఫ్ట్ స్టాండ్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. “అడగను.. ఇస్తే మంచిదే” అనే వ్యాఖ్యల ద్వారా, ఒకవైపు తనకు అవకాశమివ్వాలని సూచిస్తూ, మరోవైపు పార్టీ నిర్ణయాలను గౌరవిస్తున్నట్లు సంకేతం ఇచ్చారు. మొత్తంగా చూస్తే, ఇది మాట మార్చడం కంటే పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం మార్చుకున్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

