కవిత పార్టీ పెడితే మాకు నష్టమే లేదు: రామచందర్
x

కవిత పార్టీ పెడితే మాకు నష్టమే లేదు: రామచందర్


కవిత పార్టీ పెడితే తమకు ఎటువంటి నష్టం జరగదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు వ్యాఖ్యానించారు. కొందరు అపోహల్లో ఉన్నారని, కవిత పార్టీ పెడితే బీజేపీపై ప్రభావం చూపుతుందని కలల్లో బతుకుతున్నారని చురకలంటించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని, కవిత పార్టీ పెట్టడం వల్ల మారేదీ ఏదీ లేదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం అవినీతిలో కవిత అంటకాగిందని, ఇప్పుడు పంపకాల్లో తేడా రావడం వల్లే గోల చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా కవిత చేసిన ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, తన దగ్గర ఉన్న ఆధారాలకు కవిత కమిటీకి అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

లిక్కర్ వ్యాపారం చేసి కవిత జైలుకు వెళ్లారని విమర్శించారాయన. లిక్కర్ కేసులో కవిత భారీగా డబ్బులు సంపాదించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే కవిత జైలుకు వెళ్తే బీజేపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ‘‘తప్పుచేసిన వారిని పార్టీలు జైలులో వేయవు. దర్యాప్తు సంస్థలు వేస్తాయి. కవితకు మాత్రమే ఆత్మగౌరవం ఉందా? తెలంగాణ ప్రజలకు లేదా? ఆమె ఆత్మగౌరవం ఎలా దెబ్బతింది అనేది వాళ్ల కుటుంబ వ్యవహారం. ఇన్నాళ్లూ వాళ్లతో ఉన్నప్పుడు కవిత నోరెందుకు మెదపలేదు? ఉద్యమ ద్రోహులు బీఆర్ఎస్‌లో చేరారని మేము మొదటి నుంచి చెప్తున్నాం’’ అని రామచందర్ రావు వ్యాఖ్యానించారు.

Read More
Next Story