రామేశ్వరం కేఫే నిందితుడు దేశం వీడాడా?
x

రామేశ్వరం కేఫే నిందితుడు దేశం వీడాడా?

బెంగళూరులోని రామేశ్వరం కేఫే పేలుడు కేసులో నిందితుడి కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముమ్మరంగా గాలిస్తోంది.


బెంగళూరులోని రామేశ్వరం కేఫే పేలుడు కేసులో నిందితుడి కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముమ్మరంగా గాలిస్తోంది. తీరప్రాంతాల నుంచి దేశం దాటే అవకాశం ఉండడంతో భారత కోస్ట్‌గార్డ్‌ సాయాన్ని కోరింది.

బెంగళూరులోని రామేశ్వరం కేఫే లో మార్చి 1న తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన ఐటీ నగరాన్ని కుదిపేసింది. నిందితుడిని పట్టుకునేందుకు అనేక దర్యాప్తు బృందాలు పనిచేస్తున్నారు. NIA కూడా రంగంలోకి దిగింది. అయినా బాంబర్ జాడ దొరకలేదు. వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి అతని వెళ్లిన మార్గాన్ని మాత్రమే ట్రేస్ చేయగలిగారు.

తీరప్రాంతం నుంచి పరారయ్యాడా?

అనుమానితుడు అరేబియా సముద్రం గుండా తప్పించుకోవడానికి ఏదైనా ఫిషింగ్ బోట్ లేదా ఓడను ఉపయోగించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది కేరళ నుంచి కర్నాటకలోని కార్వార్ వరకు గాలిస్తున్నారు. బైపూర్ నుంచి ఉడిపి వరకు ఉన్న ప్రాంతంలోని పోలీసులు అనుమానితుడి సమాచారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిన్నపాటి ఫిషింగ్ పోర్టులను కూడా తనిఖీ చేస్తున్నారు.

“మేము ఇప్పటికే మత్స్యకారులను అప్రమత్తం చేసాం. అనుమానాస్పద వ్యక్తి లేదా పడవ గురించి తెలియజేయాలని కోరాం. నిందితుడు ఇప్పటికే దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంది. "అతను భూగర్భంలో ఉండవచ్చు లేదా పడవలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు" అని పోలీసు ఉన్నతాధికారి చెప్పాడు.

"మేం మంగుళూరుతో సహా ముఖ్యమైన ఓడరేవుల క్రూయిజ్‌ రికార్డులను కూడా తనిఖీ చేస్తున్నాము. ఆ ఓడల నుంచి సిసి టివి ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని" అని చెప్పారు.

దేశం వీడాడా?

అనుమానితుడు రాష్ట్ర సరిహద్దులు దాటడమే కాకుండా దేశం విడిచి వెళ్లి ఉండవచ్చని ఫెడరల్ గతంలో చెప్పింది. నిందితుడి గురించిన సమాచారం అందిస్తే రూ. 10 లక్షల రివార్డు కూడా ఎన్‌ఐఏ ప్రకటించింది.

నిందితుడు బెంగళూరు నుంచి బళ్లారి (మంత్రాలయ)కి బస్సులో ప్రయాణించినట్లు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు వివిధ మార్గాల్లో బస్ డ్రైవర్లు, కండక్టర్లను సైతం విచారిస్తున్నారు. హుమ్నాబాద్ వైపు వెళ్లడం చూశామని కొందరు అంటున్నారు. హుమ్నాబాద్ ఉత్తర కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉంది.

హుమ్నాబాద్ నుంచి హైవే ద్వారా కేరళకు కలిపే తీరప్రాంతంలోని భత్కల్ పట్టణానికి లేదా హైదరాబాద్‌కు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నా.. పట్టుకోడానికి మాత్రం మరికొన్ని రోజులు పట్టొచ్చు.

Read More
Next Story