సీమ ప్రగతి కోసం నంద్యాలలో 27న ‘‘రాయలసీమ నిజదర్శన దీక్ష’’
రాయలసీమలో సాగునీటి సమస్యలను తక్షణం పరిష్కరించాలని నంద్యాలలో దీక్ష చేపడుతున్నదెవరు? ప్రభుత్వం ముందు ఏ డిమాండ్లు ఉంచబోతున్నారు?
రాయలసీమలో సాగునీటి సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన నంద్యాలతో ‘‘రాయలసీమ నిజదర్శన దీక్ష’’ చేపడుతున్నట్లు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి తెలిపారు.
శనివారం నంద్యాల సమితి కార్యాలయంలో దీక్షకు సంబంధించిన కరపత్రాలను సమితి నాయకులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వై.యన్.రెడ్డి మాట్లాడుతూ.. తుంగభద్ర, కృష్ణా నదులలో నీరు ప్రవహిస్తున్నా..సీమ ప్రాజెక్టులు నీరు పొందలేకపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల హక్కులకు తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 6, 2023న తీసుకొచ్చిన చీకటి చట్టం రద్దుకు పాలకులు, రాజకీయ పార్టీలు పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
సీమ అభివృద్ధికి చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ, పెన్నా నది పునరుజ్జీవానికి ప్రత్యేక సాగునీటి కమిషన్ ఏర్పాటుకు కృషి చేయాలని రాజకీయ పార్టీలను కోరారు. రాయలసీమ సాగునీటి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
రాయలసీమలో న్యాయరాజధాని, సీడ్‌హబ్/ఉద్యానవన పంటల హబ్ పేరిట సీమ వాసులను మభ్యపెట్టడం మాని రాష్ట్ర విభజన చట్టం హక్కుల సాధనకు కృషి చేయాలని కోరారు.
రాయలసీమ ప్రగతి కోసం చేపట్టే ‘‘రాయలసీమ నిజదర్శన దీక్ష’’కు ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సమితి నాయకులు ఆంధ్రాబ్యాంక్ రిటైర్డ్ ఎజీఎం శివనాగిరెడ్డి, మహమ్మద్ పర్వేజ్, భాస్కర్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, శివరామిరెడ్డి, పట్నం రాముడు, క్రిష్ణమోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ జూపల్లె గోపాల్ రెడ్డి, రాఘవేంద్రగౌడ్, షణ్ముఖరావు, సుదర్శన్, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.