
భారత్‌తో చర్చలకు సిద్ధం.. కానీ ఆహ్వానం అందలేదు: పాక్ మంత్రి
ఉగ్రవాదంపై ఆధారాలతో చర్చలు జరగాలని సూచన
భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే న్యూఢిల్లీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆహ్వానం అందలేదని పాకిస్థాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ వెల్లడించారు. ఉగ్రవాదం, సింధు జలాల ఒప్పందం వంటి వివాదాస్పద అంశాలపై చర్చించేందుకు అభ్యంతరం లేదని, అయితే అందుకు అధికారికమైన చర్చల వ్యవస్థ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి అధికారిక ప్రక్రియ లేకుండా రెండు దేశాల మధ్య సమస్యలను ఎలా చర్చిస్తామని ప్రశ్నించారు. ‘‘ద్వైపాక్షిక చర్చలకు మిమ్మల్ని ఒక్కసారి కూడా పిలవలేదు. దీనిపై అధికారికంగా ఏదైనా పురోగతి ఉంటే దానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తాం. ఒక యంత్రాంగం లేకుండా మనం ద్వైపాక్షిక అంశాలను ఎలా చర్చించగలము?’’ అని ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ మాలిక్ అన్నారు.
షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు మాలిక్ నవంబర్ 20 నుంచి 22 వరకు భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తన పర్యటన ప్రధానంగా బహుళపక్ష వేదికకు సంబంధించినదేనని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొని, అక్కడి సందేశాన్ని పాకిస్థాన్‌కు తీసుకెళ్లడమే తన పర్యటన ఉద్దేశమని వివరించారు.
ఈ పర్యటనలో తజికిస్థాన్, ఇరాన్ ప్రతినిధులతో మాలిక్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అయితే భారత ప్రతినిధులతో మాత్రం అలాంటి సమావేశం జరగలేదు. భారత్‌తో చర్చలకు తనను కనీసం ఒక్కసారి కూడా పిలవలేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అధికారికంగా చర్చల ప్రక్రియ ప్రారంభమైతేనే సంబంధిత అంశాలపై స్పందిస్తానని చెప్పారు.
సింధు జలాల ఒప్పందంపై చర్చలకు సిద్ధం
భారత్‌తో చర్చించాల్సిన అంశాల్లో సింధు జలాల ఒప్పందం కూడా ఉందని మాలిక్ తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు భారత్ నుంచి అధికారిక ఆహ్వానం వస్తే తప్పకుండా చర్చిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం అలాంటి ఆహ్వానం తమకు అందలేదని వెల్లడించారు. ‘‘మీరు నన్ను సింధు జలాల ఒప్పందంపై చర్చించడానికి ఆహ్వానిస్తే మనం తప్పకుండా దాని గురించే మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు నన్ను సింధూ జలాల ఒప్పందంపై చర్చించడానికి ఆహ్వనించలేదు’’ అని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపై ఆధారాలతో చర్చలు జరగాలి
ఇక ఉగ్రవాదం అంశంపైనా మాలిక్ స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే రెండు దేశాల మధ్య ఒక నిర్దిష్టమైన చర్చల వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలు, అభ్యంతరాలపై పరస్పరం ఆధారాలు సమర్పించుకుని చర్చించుకోవాలని సూచించారు.
ద్వైపాక్షిక లేదా బహుళపక్ష వేదికల ద్వారా ఈ అంశంపై చర్చించేందుకు పాకిస్థాన్ గతంలోనూ సిద్ధత వ్యక్తం చేసిందని ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాద సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలంటే రెచ్చగొట్టే వ్యాఖ్యల కంటే వాస్తవ ఆధారాల ఆధారంగా చర్చలు జరగాలని మాలిక్ అభిప్రాయపడ్డారు.
తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి.. దర్గాకు నిరాకరణ
మాలిక్ భారత పర్యటనలో పర్యాటక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు భారత ప్రభుత్వం ఆయనకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీలోని హుమాయూన్ సమాధి, దిల్లీ హాట్ వంటి భద్రతాపరంగా అనుమతి లభించిన ప్రాంతాలను సందర్శించేందుకు కూడా అవకాశం కల్పించింది. అయితే హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించాలన్న ఆయన అభ్యర్థనను భద్రతా కారణాలతో భారత విదేశాంగ శాఖ తిరస్కరించింది.
మొత్తంగా ఎస్సీఓ సమావేశంలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ మంత్రి.. ఇరు దేశాల మధ్య వివాదాస్పద అంశాలపై చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చారు. అయితే అలాంటి చర్చలు జరగాలంటే అధికారిక ఆహ్వానం, నిర్దిష్టమైన వ్యవస్థ అవసరమని స్పష్టం చేశారు. భారత్ నుంచి మాత్రం ఈ పర్యటనలో ద్వైపాక్షిక చర్చలకు ఎలాంటి ముందడుగు పడలేదు.
Next Story
