ఇదే నిజమైన కేరళ ఫైల్..
x

ఇదే నిజమైన కేరళ ఫైల్..

కేరళలోని మలప్పురం జిల్లాలో 400 ఏళ్ల నాటి దుర్గా దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు హిందువులు, ముస్లింలు చేతులు కలిపారు.


కేరళలోని ముస్లింలు అధికంగా ఉండే మలప్పురం జిల్లాలో 400 ఏళ్ల నాటి దుర్గా దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు హిందువులు, ముస్లింలు చేతులు కలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి ఇప్పటివరకు వెచ్చించిన దాదాపు రూ. రూ.50 లక్షలలో సగం డబ్బు ముస్లింలే ఇచ్చారని ముత్తువల్లూరు శ్రీదుర్గాభగవతి దేవస్థానం అధికారులు తెలిపారు.

మే 7న ప్రారంభమయ్యే మూడు రోజుల కార్యక్రమంలో 173 సెంటీమీటర్ల పొడవైన దుర్గామాత విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికి ఆలయ మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఇంకా నాలుగు చిన్నపాటి ఆలయాలు నిర్మించాల్సి ఉంది.

ముస్లింల దాతృత్వం..

ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ పునరుద్ధరణ 2015లో ప్రారంభమైంది. "మేము మతాలకు అతీతంగా, వర్గ విభేదాలకు అతీతంగా ప్రజల నుంచి విరాళాలను అభ్యర్థించాం. చాలా మంది ప్రజలు సహకరించారు. ఎక్కువ భాగం విరాళాలు ముస్లింల నుంచి వచ్చాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను" అని ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు చంద్రన్ తెలిపారు.

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) చీఫ్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్, PK కున్హాలికుట్టి వంటి పార్టీ ప్రముఖులు తమ విరాళాల అభ్యర్థనకు సానుకూలంగా ఎలా స్పందించారో చంద్రన్ గుర్తు చేసుకున్నారు.

ముస్లింల పాత్ర..

విరాళాలు సేకరించేందుకు తంగల్ గత సంవత్సరం కూడా ఆలయాన్ని సందర్శించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి శారీరక రుగ్మతల తొలగింపు, మానసిక, ఆర్థిక సమస్యల నుండి విముక్తి కల్పించాలని భక్తులు కోరుకుంటుంటారు. ఆలయ పరిరక్షిణలో ముస్లింల ప్రమేయం ఎక్కువే అని భావించాలి. ఇటీవలి గోపురానికి రాగి పూత పూయడానికి వారు ఇచ్చిన విరాళాలు దోహదపడ్డాయి. ఆలయ ఉత్సవాలకు కూరగాయలు, ఆలయ నిర్మాణ సామగ్రిని సమకూరుస్తున్నారు.

ఒక ముస్లిం రూ.2 లక్షలు విరాళంగా ఇవ్వగా, సంఘంలోని మరో సభ్యుడు రూ.లక్ష పునరుద్ధరణ పనులకు ఇచ్చినట్టు చంద్రన్ తెలిపారు.

ఆలయ అధికారులు విడుదల చేసిన బ్రోచర్‌లో ఆలయ తంత్రి టెక్కినియెదత్ తరనానెల్లూరు పద్మనాభన్ ఉన్ని నంబూతిరిపాడ్‌తో పాటు ఐయుఎంఎల్‌కు చెందిన తంగల్ ఫోటో కూడా ఉండడం విశేషం.

"హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లతో సహా అన్ని వర్గాల వారు సంతోషంగా , ఐక్యంగా జీవించే ప్రదేశం" అని చంద్రన్ ఉటంకించారు."ఏ విషపూరిత ప్రచారం లేదా ద్వేషపూరిత ప్రచారం ఈ సుదీర్ఘ సామరస్య సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయదు." అని పేర్కొన్నారు.

Read More
Next Story