ఎమ్మార్వోను హత్య చేసిన రియల్‌ మాఫియా?
x

ఎమ్మార్వోను హత్య చేసిన రియల్‌ మాఫియా?

ల్యాండ్‌ మాఫియాలు రెచ్చిపోతున్న ప్రాంతాల్లో మండల మేజిస్ట్రేట్ల ప్రాణాలకే దిక్కులేదా? అవుననే సమాధానమే వస్తోంది


భూముల ధరలు పెరిగి, ల్యాండ్‌ మాఫియాలు రెచ్చిపోతున్న ప్రాంతాల్లో మండల మేజిస్ట్రేట్ల ప్రాణాలకే దిక్కులేదా? ఎమ్మార్వోలు, రిజిస్ట్రార్లకూ భద్రత కల్పించక తప్పదా అంటే అవుననే సమాధానమే వస్తోంది ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌. విశాఖపట్నం నగరంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హతమార్చింది. కొమ్మది చరణ్ క్యాస్టల్‌లో జరిగిన ఈ హత్య సంచలనం రేపింది. కొమ్మాదిలో తన ఇంట్లో ఉన్న రమణయ్యపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇనుప రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. సీపీ రవిశంకర్ ఆయన్నర్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మండల మేజిస్ట్రేట్‌కే భద్రత కరువైంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు.

కిందికి పిలిచి మరీ హత్య...

విశాఖ రూరల్‌ (చినగదిలి) తహసీల్దార్‌గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యాడు. కొమ్మాదిలోని ఓ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులో నివాసం ఉండే ఆయన.. శుక్రవారం బాధ్యతలు చేపట్టి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్‌ రావడంతో కిందకు వచ్చి అపార్ట్‌మెంట్‌ గేట్‌ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో దుండగుడు ఇనుపరాడ్‌తో తహసీల్దార్‌పై ఒక్కసారిగా దాడి చేసి పరారయ్యాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే రమణయ్య కుప్పకూలిపోయాడు. గమనించిన వాచ్‌మెన్‌ కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. దాడికి గల కారణాలపై ఆరా తీసున్నారు.

అదుపులోకి నలుగురు అనుమానితులు..

సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. 12 బృందాలు ఏర్పాటు చేసిన విశాఖ సీపీ రవిశంకర్‌... సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన వ్యక్తి గురించి జల్లెడ పడుతున్నారు.

ఎవరీ రమణయ్య?

శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామానికి చెందిన రమణయ్య.... విధుల్లో చేరి పదేళ్లు అవుతుంది. డిప్యూటీ ఎమ్మార్వో, ఎమ్మార్వో, కలెక్టరేట్‌లో ఏవోగా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వోగా పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం నగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు. విధులకు హాజరై ఇంటికి చేరుకోగా...రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ఫోన్‌రావటంతో ఫ్లాట్‌ నుంచి కిందకు వెళ్లారు. ఓ వ్యక్తితో పది నిమిషాలపాటు సీరియస్‌గా మాట్లాడారు. అతడు తన వెంట తెచ్చిన ఇనుప రాడ్‌తో రమణయ్య తలపై బలంగా కొట్టడంతో అక్కడిక్కడే కుప్పకూలాడు. భూ వివాదానికి సంబంధించిన గొడవ అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

కుటుంబ సభ్యుల ఆందోళన...

ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమణయ్య సోదరుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణం విశాఖలో అధికారులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతానికి కూత వేటు దూరంలోనే హత్య జరగడం దారుణమన్నారు. పని ఒత్తిడి ఎక్కువ ఉందని... ఇక్కడ పని చేయలేకపోతున్నానని తనతో ఇటీవలే చెప్పారన్నారు. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా, బొండపల్లికి బదిలీ అయిందన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న తన సోదరుడు లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. 28 సంవత్సరాల సర్వీస్ ఉన్న... తన సోదరుడు కేవలం 8 సంవత్సరాల సర్వీస్ చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులపై తనకు నమ్మకం ఉందని.. న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆందోళన

'తహశీల్దార్ రమణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా హత్యకు కారకులైన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి' అన్నారు ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి. తహశీల్దార్ రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అధిక భూ వివాదాలు ఉన్న మండలాల తహశీల్దార్లకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలి. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగి పైన ఆటంకాలు, దాడులకు సంబంధించి దోషులపైన చర్యలు తీసుకొనుటకు కఠినమైన చట్టం తీసుకురావాలని కోరారు. రమణయ్య, తహసీల్దార్ దారుణ హత్యకు నిరసనగా ఇవాళ 26 జిల్లాలో రెవిన్యూ ఉద్యోగులందరు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నారు.

Read More
Next Story