కర్ణాటకలో మిర్చి రైతుల విధ్వంసానికి కారణమేంటి?
x

కర్ణాటకలో మిర్చి రైతుల విధ్వంసానికి కారణమేంటి?

ఎండు మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఆగ్రహించిన రైతులు హవేరి జిల్లాలోని APMC మార్కెట్ వద్ద విధ్వంసానికి పాల్పడ్డారు.


కర్ణాటకలో ఎండు మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఆగ్రహించిన రైతులు హవేరి జిల్లాలోని APMC మార్కెట్ వద్ద విధ్వంసానికి పాల్పడ్డారు. ఫైర్ ఇంజన్‌తో సహా 13 వాహనాలకు నిప్పంటించారు. గత వారం క్వింటాల్‌ రూ.20 వేలు పలికిన మిర్చి ధర ఈ వారం రూ. 12వేలకు పడిపోయింది.

ఫర్నిచర్ ధ్వంసం..

రైతులు ఏపీఎంసీ (వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ) కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బయట నిరసన తెలుపుతున్న మరికొందరు భవనంపై రాళ్ల విసరగడంతో కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు ఆందోళనకారులు ఏపీఎంసీ అధ్యక్షుడి కారుపై రాళ్లు రువ్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రైతులు మిర్చి కుప్పకు నిప్పుపెట్టినట్లు సమాచారం. దీంతో మార్కెట్‌ పరిసరాలు ఘాటెక్కాయి. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది.

ధరల పతనానికి కారణమేమిటి?

గత రెండు వారాలుగా మార్కెట్‌కు వస్తున్న మిర్చి నాణ్యత తక్కువగా ఉండడమే ధరలు పతనానికి కారణమని ఏపీఎంసీ అధికారులు చెబుతున్నారు. కూలీల కొరత, మిర్చి నిల్వ చేసేందుకు స్థలం లేకపోవడం కూడా పరిస్థితిని మరింత దిగజార్చిందని అంటున్నారు.

‘‘ఎండ ఎక్కువగా ఉండడంతో మిరపకాయలను నిల్వ చేయడం తలనొప్పిగా ఉంది. హవేరిలోని మిర్చి మార్కెట్‌లో 32 కోల్డ్ స్టోరేజీలు ఉండగా, బళ్లారి, రాయచూర్, కలబురగి, ఆంధ్రప్రదేశ్‌లో నిల్వ స్థలం అందుబాటులో లేదు' అని పేరు చెప్పడానికి ఇష్టపడని APMC సిబ్బంది తెలిపారు.

'కాల్పులు చేసినవారు రైతులు కాదు'

గతంలో మిర్చి ధరలు తగ్గినపుడు వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించే స్థాయికి రైతులు వెళ్లలేదు. హింసాత్మక నిరసనలకు దిగడం ఇదే తొలిసారి. వాహనాలను తగులబెట్టిన ఆందోళనకారులు రైతులుకాదని, ఇతర రాష్ట్రం లేదా ఇతర జిల్లా నుంచి వచ్చిన వారే ఈ పని చేసి ఉంటారని బాడగి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సురేశ్‌గౌడ్‌ పాటిల్‌ స్పష్టం చేశారు.

“కాల్పులు చేసినవారు రైతులు కాదు. నేను వారి పేరు చెప్పలేను. కానీ వారు ఎవరో మాకు ఒక ఆలోచన ఉంది. ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. కర్నాటక పోలీసులు ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు' అని పాటిల్ చెప్పారు.

మారిన మార్కెట్ సమయాలు..

ప్రతి వారం సోమవారం హావేరి, బళ్లారి, గడగ్, విజయపూర్, కొప్పల్, బాగల్‌కోట్, రాయచూర్ పొరుగున ఉన్న తెలంగాణ జిల్లాల నుండి అనేక మంది రైతులు మిరపకాయలను విక్రయించడానికి హావేరిలోని APMC మార్కెట్‌కు తరలివస్తారు. సోమవారం మార్కెట్‌కు 3.11 లక్షల బస్తాలకు పైగా మిర్చి విక్రయానికి వచ్చింది. మిర్చిని హోల్‌సేల్‌ ధరకు కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యాపారులు సైతం మార్కెట్‌ను వస్తుంటారు. హవేరితో పాటు హుబ్లీ-ధార్వాడ ఏపీఎంసీ మార్కెట్లలో కూడా రైతులు మిర్చి విక్రయిస్తున్నారు. ఈ రెండు మార్కెట్లు కర్ణాటక ఉత్తర ప్రాంతంలో ముఖ్యమైనవి.

అయితే సోమవారం జరిగిన హింసాకాండ తర్వాత, రైతులు తమ మిరపకాయలను వారానికి రెండుసార్లు (సోమ, గురువారం) విక్రయించడానికి అనుమతించాలని APMC నిర్ణయించిందని పాటిల్ చెప్పారు.

ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. ముఖ్యమైన వ్యక్తులందరూ సమావేశమై వారానికి రెండుసార్లు మార్కెట్‌ను నిర్వహించాలని నిర్ణయించుకున్నారని పాటిల్ చెప్పారు. దీని వల్ల మార్కెట్‌లో రద్దీ ఉండదని ఆయన అన్నారు.

సహనం కోల్పోవద్దు..

మిర్చి ధర పతనమైనందున రైతులు సహనం కోల్పోవద్దని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి శివానంద్‌పాటిల్‌ విజ్ఞప్తి చేశారు. ఎపిఎంసి మార్కెట్‌లో జరిగిన హింసాకాండను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర చెప్పారు. మిర్చి ధర ఆకస్మికంగా పతనంపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు: బీజేపీ

సిద్ధరామయ్య ప్రభుత్వం అనుసరిస్తున్న ‘రైతు వ్యతిరేక’ విధానాలే మిర్చిధర పతనానికి కారణమని బీజేపీ రాష్ట్ర విభాగం ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలపై శ్రద్ధ వహించి సరైన సమయంలో కరువు సాయం అందించి ఉంటే.. ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావని ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక అన్నారు. కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గాఢ నిద్ర వీడి రైతులకు కరువు సాయంపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులు ఆయన నివాసానికి, విధానసౌధకు నిప్పుపెట్టే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.

Read More
Next Story