
తెలంగాణలో రికార్డు లొంగుబాటు: 124 మంది మావోయిస్టులు సరెండర్ !
దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీతో సహా భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. పునరావాస పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం వివరాలు వెల్లడించనున్నారు.
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలతో సహా జనజీవన స్రవంతిలో చేరేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. శనివారం పలువురు మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నారని, మొత్తం 124 మంది మావోయిస్టులు లొంగిపోవచ్చని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. వీరిలో దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం. కమిటీకి చెందిన సభ్యులు తమ ఆయుధాలతో సహా లొంగిపోనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సాధారణ జీవితంలో కలవాలనే ఆకాంక్ష ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు. ఈ లొంగుబాటు రాష్ట్ర పోలీసు చరిత్రలోనే ఒక పెద్ద పరిణామంగా అధికారులు పేర్కొన్నారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం రికార్డుగా భావిస్తున్నట్లు చెప్పారు. మరింతగా, కొంత సమాచారం ప్రకారం మొత్తం సంఖ్య 126కి చేరే అవకాశముందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మరికొందరు కూడా లొంగిపోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
లొంగిపోతున్న వారిలో పీఎల్‌జీఏ బెటాలియన్ కంపెనీ కమాండర్ కొరసా లక్కు, ఉకి కల్లు, చలసాని నవత, అరుణ, సుధాకర్ ఉన్నట్లు సమాచారం. అయితే మావోయిస్టు అగ్రనేత గణపతి ఈ లొంగుబాటులో లేరని తెలిసింది. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు, వారికి అందించే పునరావాస ప్యాకేజీలపై ముఖ్యమంత్రి వివరాలు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

