తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై భారీ ఆశలు పెట్టుకున్న ప్రజలకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు ఎయిర్‌పోర్ట్‌లలో పాల్వంచ, బసంత్‌నగర్ ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణం సాధ్యం కాదని కేంద్ర పౌర విమానయాన శాఖ స్పష్టం చేయడంతో, పెద్దపల్లి, పాల్వంచ ప్రాంతాల ప్రజల కలలు కల్లలయ్యాయి. చుట్టూ కొండలు, గుట్టలు ఉండటం వల్ల విమానాల రాకపోకలకు సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ఫీజిబిలిటీ రిపోర్ట్ తేల్చడంతో ఈ కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రాజెక్టులు నిలిచిపోయాయి.
తెలంగాణ రాష్ట్రంలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ మంగళం పాడింది. 33 జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శంషాబాద్ విమానాశ్రయం ఒక్కటే ఉంది. తెలంగాణ నుంచి దేశ, విదేశాలకు రాకపోకలు సాగించాలంటే విమాన ప్రయాణికులకు ఒక్కటే విమానాశ్రయం అందుబాటులో ఉంది. కొత్తగా నాలుగు విమానాశ్రయాలను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖకు ప్రతిపాదించింది. అయితే ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం వద్ద ఉన్న బసంత్ నగర్ ఎయిర్ పోర్టుల నిర్మాణం సాధ్యం కాదని సాక్షాత్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సోమవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కంద్ర సహాయమంత్రి ఈ విషయం చెప్పారు.
చుట్టూ కొండల మధ్య విమానాశ్రయాల నిర్మాణం సాధ్యం కాదు
కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం వద్ద ఉన్న బసంత్ నగర్ ప్రాంతాల్లో చుట్టూ ఎత్తైన కొండలు, గుట్టలు ఉండటం వల్ల విమానాలు దిగడానికి ఆటంకం కలుగుతుందని సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనంలో తేలిందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినతిపై ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పాల్వంచ, బసంత్ నగర్ లలో విమానాశ్రయాల నిర్మాణంపై టెక్నో ఎకనామిక్ ఫిజిబులటీ రిపోర్టు ఇవ్వాలని కోరగా, కొండలు ఉన్నందువల్ల విమానాశ్రయాల నిర్మాణం సాధ్యం కాదని సాంకతిక రిపోర్టులో తేలింది. ఈమేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలంగాణ సర్కారుకు లేఖ రాసిందని కేంద్ర సహాయమంత్రి చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏకైక శంషాబాద్ విమానాశ్రయం ఒక్కటే ఉండటంతో అది నిత్యం విమాన ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉంటుంది. వరంగల్ జిల్లా మామునూర్ పాత విమానాశ్రయం , ఆదిలాబాద్ ఏరోడ్రమ్ ప్రతిపాదిత స్థలాలు విమానాశ్రయాల నిర్మాణానికి అనువుగా ఉన్నాయి. నాలుగు విమానాశ్రయాలు నిర్మించాలని ప్రతిపాదించగా ఇందులో నుంచి పాల్వంచ, బసంత్ నగర్ విమానాశ్రయాల నిర్మాణం సాధ్యం కాదని కేంద్ర ఎయిర్ పోర్ట్ అథారిటీ చేతులెత్తేసింది. అసలే ఒకే ఒక్క విమానాశ్రయం ఉన్న తెలంగాణలో రెండు విమానాశ్రయాల నిర్మాణం సాధ్యం కాదని కేంద్రం చెప్పడంతో తెలంగాణ విమాన ప్రయాణికుల కల చెదిరింది.
ఫీజిబులిటీ స్టడీకి రూ.40.53 లక్షల విడుదల
రామగుండం బసంత్ నగర్ విమానాశ్రయ స్థాపనకు సాంకేతిక అడ్డంకులు ఏర్పడటంతో పెద్దపల్లి జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరడం లేదు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ ఫీజు కింద రూ.40.53 లక్షలను అధికారికంగా మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి విడుదల చేసింది. ఈ మేరకు రవాణా, రహదారులు, భవనాల (TR&B) శాఖ జీఓఆర్టీ నంబరు 465 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లా, అనంతరం గ్రామంలోని 591 ఎకరాల భూమిలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం అధ్యయనం నిర్వహించారు.
పోరాటం చేస్తాం : ఎంపీ గడ్డం వంశీ
గత రెండేళ్లుగా తాను పెద్దపల్లి ప్రజలతో కలిసి విమానాశ్రయం నిర్మాణ కలను సాకారం చేయడానికి కృషి చేస్తున్నానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మిస్తే పెద్దపల్లి ప్రాంత పౌరులకు, సింగరేణి ఉద్యోగులకు, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. రామగుండం విమానాశ్రయం వాస్తవరూపం దాల్చే వరకు తన పోరాటం కొనసాగిస్తానని ఎంపీ వంశీ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఒక్క శంషాబాద్ విమానాశ్రయంపై ఆధారపడాల్సిన పరిస్థితి కొనసాగుతుండగా, కొత్త ఎయిర్‌పోర్ట్‌లపై కేంద్రం ఇచ్చిన సమాధానంతో తెలంగాణ విమాన ప్రయాణికుల ఆశలు దెబ్బతిన్నాయి. అయితే వరంగల్ మామునూర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో అవకాశాలు ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో అయినా కొత్త విమానాశ్రయాల కల నిజమవుతుందా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మరోవైపు ప్రజల ఆశలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రజాప్రతినిధులు చెబుతుండటం ఈ అంశంపై ఇంకా రాజకీయ వేడి తగ్గేలా కనిపించడం లేదు.