
‘కుక్కల విషయంలో సుప్రీం తీర్పు తప్పు’
భారతదేశంలో డబ్బు ఉన్నవాడికే చట్టం గొడుగు పడుతుందంటూ రేణూ దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు.
వీధి కుక్కల విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కచ్ఛితంగా సదరు న్యాయమూర్తి పర్సనల్‌గా ఇచ్చిందేనంటూ హీరోయిన్ రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు. ఇందుకు తనపై కేసులు పెట్టినా, జైల్లో పెట్టించినా ఇబ్బంది లేదని, తాను ఏం చేయాలో చూసుకుంటానని అన్నారు. తెలంగాణలో భారీ సంఖ్యలో వీధి కుక్కలను హత్య చేసిన ఘటనపై రేణూ దేశాయ్ తాజాగా మాట్లాడారు. తాను కుక్కల ప్రాణాల గురించి మాట్లాడటానికి రాలేదని, మనుషుల ప్రాణాల గురించి మాట్లాడటానికే వచ్చానని ఆమె అన్నారు. ‘‘దేశంలో లా(న్యాయశాస్త్రం) అనేది ఒక జోక్‌లా మారిపోయింది. నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు సేఫ్. డబ్బులు లేకపోతే నువ్వు ట్రబుల్‌లో ఉన్నట్లే. మన దేశంలో లా పరిస్థితి ఇదే. దీనికి మీరు ఒప్పుకుంటారా? లేదా?’’ అని ఆమె ప్రశ్నించారు.
నేనేం చేస్తున్నానో అందరికీ తెలుసు
‘‘ప్రతి రోజూ అంబులెన్స్‌లను పంపి కుక్కలను రక్షిస్తున్నాం. ప్రతి రోజూ కనీసం 5 కుక్కలు చనిపోతున్నాయి. అంబులెన్స్‌లు వెళ్తున్నాయ్.. సేవ్ చేస్తున్నాయ్. ప్రతి నెలా లక్షల రూపాయలు కడుతున్నాను. కుక్కల జీవితాలను కాపాడటానికి నేనేం చేస్తున్నానో వెల్ఫేర్‌లో ఉన్నవాళ్లకి తెలుసు. ప్రతి రోజూ యాక్సిడెంట్స్‌తో వందల కుక్కలు చనిపోతున్నాయి. అవేం చేయాలి. నాను పలానా బండి గుద్దింది అని అవి ఎవరికి కంప్లెయింట్ చేయాలి. ప్రతీదీ అవినీతి అయిపోయింది. ఎక్కడికి తీసుకెళ్తారు డబ్బు’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు, నాయకులు అన్నీ అవినీతి మయం అయిపోయాయంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూగజీవాలపై ప్రతీకారం అన్యాయం
కుక్క కాటుతో మరణిస్తున్న వారి సంఖ్యను మాత్రమే ముందుకు తెచ్చి మూగజీవులపై ప్రతీకారం తీర్చుకోవడం అన్యాయమని రేణు దేశాయ్ అన్నారు. కుక్క కాటుతో చనిపోయే వారి కంటే దోమ కాటుతో చనిపోయే వారు లక్షల్లో ఉన్నారని తెలిపారు. ఏడాదికి దోమ కాటుతో దాదాపు పది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అప్పుడు అవి ప్రాణాలు కావా అని ప్రశ్నించారు. వంద కుక్కల్లో నాలుగు ఐదు మాత్రమే దాడి స్వభావంతో ఉంటాయని పేర్కొన్నారు. అలాంటి కొద్దిమంది కుక్కల కారణంగా మిగతా కుక్కలన్నింటినీ చంపడం ఎంతవరకు న్యాయం అని నిలదీశారు. ఒకరి తప్పుకు అందరినీ శిక్షిస్తారా అని ప్రశ్నించారు.
కుక్క కాట్లు ప్రభుత్వ వైఫల్యాలే
సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను తప్పుగా అర్థం చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుక్కలను పూర్తిగా నిర్మూలించే విధానాలకు శ్రీకారం చుట్టాయని ఆరోపించారు. కుక్కకాటు ఘటనలకు ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. నిస్సహాయతతో కుక్కలను చంపడం సమస్యకు పరిష్కారం కాదని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాల్లో ప్రతిరోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని రేణు దేశాయ్ గుర్తు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు మహిళలపై అత్యాచారాలు హత్యలు కుటుంబ సభ్యులే ఒకరినొకరు హతమార్చుకునే ఘటనల్లో లక్షలాది ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. వాటన్నింటిని పక్కన పెట్టి కేవలం కుక్క కాటుతో చనిపోయిన వారినే ప్రాణాలుగా పరిగణించడం ఎలా అని నిలదీశారు.
కుక్కలను చంపడం పరిష్కారం కాదు
దేశంలో చెత్త నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే వీధి కుక్కలు ఎక్కువగా పిల్లలకు జన్మనిస్తూ సంఖ్య పెరుగుతోందని ఆమె వివరించారు. ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు సరిగా అమలు చేయకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతోందన్నారు. సమస్యను కుక్కలను చంపడం ద్వారా పరిష్కరిస్తామని భావించడం ఘోరమైన పొరపాటు అని చెప్పారు.
తాను ప్రతిరోజూ అనేక కుక్కలను కాపాడుతున్నానని రేణు దేశాయ్ తెలిపారు. ప్రమాదాల్లో గాయపడిన కుక్కలను అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలిస్తున్నామని వాటి చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. బైక్ బస్ కారు ప్రమాదాల వల్ల కాళ్లు నడుములు విరిగిన కుక్కలను ఎన్నోసార్లు రక్షించానని తెలిపారు. వాహనదారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితులకు కారణమని అన్నారు.
ఆ బాధ నాకు తెలుసు
కుక్కల దాడుల్లో చిన్న పిల్లలు చనిపోయిన ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని రేణు దేశాయ్ అన్నారు. ఒక తల్లిగా ఆ బాధ ఎంత తీవ్రమో తనకు తెలుసని చెప్పారు. అయినప్పటికీ అన్ని కుక్కలను హతమార్చడం పరిష్కారం కాదని స్పష్టం చేశారు. కొద్దిమంది తప్పుల కోసం అన్ని మూగజీవులను శిక్షించడం అన్యాయమని అన్నారు.
ప్రభుత్వాలు అయినా వ్యక్తులు అయినా వీధి కుక్కలను క్రూరంగా చంపే కార్యక్రమాలకు తక్షణమే ముగింపు పలకాలని ఆమె డిమాండ్ చేశారు. భూమిపై జీవించే హక్కు ప్రతి జీవికీ ఉందని స్పష్టం చేశారు. మూగజీవాలపై జరుగుతున్న హింసను అడ్డుకునేందుకు సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని రేణు దేశాయ్ పిలుపునిచ్చారు.

