రేవంత్ ప్రభుత్వాన్ని తాకనున్న రిటైర్మెంట్ వేవ్!  ఖజానాకు ట్రిపుల్ షాక్
x

రేవంత్ ప్రభుత్వాన్ని తాకనున్న రిటైర్మెంట్ వేవ్! ఖజానాకు ట్రిపుల్ షాక్


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.

1) రేవంత్ ప్రభుత్వాన్ని తాకనున్న రిటైర్మెంట్ వేవ్..! ఖజానాకు ట్రిపుల్ షాక్

2) హైదరాబాద్‌లో 1 లక్ష సీట్ల క్రికెట్ స్టేడియం! దేశంలో రెండో అతిపెద్దది?

3) గంటకు 5,600 ఇడ్లీలు.. 2,000 దోశలు! రోజూ 50 వేల మంది విద్యార్థులకు టిఫిన్

1) రేవంత్ ప్రభుత్వాన్ని తాకనున్న రిటైర్మెంట్ వేవ్..! | ఖజానాకు ట్రిపుల్ షాక్

ఒక వైపు ఉద్యోగుల బకాయిలు, మరో వైపు వేల సంఖ్యలో రిటైర్మెంట్లు, ఇంకోవైపు కొత్త PRC డిమాండ్. తెలంగాణ ప్రభుత్వ ఖజానా ముందు ఇప్పుడు మూడు భారీ ఆర్థిక సవాళ్లు నిలిచాయి. ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నాయి. ఇదే సమయంలో వచ్చే మూడేళ్లలో సుమారు 28 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు. రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర సెటిల్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అంటే, ఇప్పటి వరకు ఉన్న బకాయిలను క్లియర్ చేయడమే ఒక సవాల్ అయితే, రాబోయే రిటైర్మెంట్ వేవ్ మరో భారీ భారం. దీనికి కొత్త PRC కూడా జతకడితే, రాష్ట్ర ఖజానాపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరగనుంది.

ఉద్యోగులు, రిటైర్మెంట్ ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం మొత్తం పెండింగ్ బిల్లులు ఒక దశలో రూ.14 వేల కోట్ల వరకు ఉన్నాయని, అందులో కొంత మొత్తాన్ని విడుదల చేసినట్లు సమాచారం. అంటే, బకాయిల క్లియరెన్స్ కొనసాగుతున్నా, మొత్తం ఆర్థిక ఒత్తిడి మాత్రం ఇంకా దాదాపు రూ.10 వేల కోట్ల మేర పెండింగ్ బకాయిల భారం ఉందనే అంశం ఇప్పుడు ఉద్యోగ సంఘాల ఆందోళనకు ప్రధాన కారణంగా మారింది.

''ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకూడదని TGEJAC రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ హెచ్చరిస్తున్నారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ప్రభుత్వానికి రాజకీయంగా కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని ఆయన అన్నారు".

ఉద్యోగ సంఘాల వాదన ఏంటంటే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే కాదు, పెండింగ్ DAలు, ఇతర బిల్లులు, ఆరోగ్య పథకం, PRC వంటి సమస్యలు కూడా ఒకేసారి పరిష్కారం కావాలి. అంటే ప్రభుత్వం ముందు ఉన్నది కేవలం ఒక బిల్లు కాదు, పెండింగ్ క్లెయిమ్‌ల పర్వతం.

ఇప్పుడు అసలు పెద్ద సవాల్, రిటైర్మెంట్ వేవ్. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం, 2026 చివరి నాటికి – 9,700 మంది, 2027లో – 9,400 మంది, 2028లో – 8,700 మంది, అంటే, మూడు సంవత్సరాల్లో కలిపి దాదాపు 28 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు.

ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగి రిటైర్ అయిన రోజు నుంచి ప్రభుత్వానికి ఆ వ్యక్తితో ఆర్థిక సంబంధం ముగిసిపోదు. గ్రాట్యుటీ ఉంటుంది. పెన్షన్ ఉంటుంది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఉంటుంది. GPF లేదా ఇతర సెటిల్‌మెంట్ అంశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పెండింగ్ వేతనాలు, ఇతర క్లెయిమ్‌లు కూడా ఉంటాయి. అంటే వేలాది మంది ఒకే సమయంలో రిటైర్ అయితే, ప్రభుత్వానికి ఒకేసారి భారీ క్యాష్ అవుట్‌ఫ్లో అవసరం అవుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ఏటా రూ.9 వేల కోట్ల వరకు అదనపు ఆర్థిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇదే ఇప్పుడు ఫైనాన్స్ శాఖకు పెద్ద సవాల్.

ఈ రిటైర్మెంట్ వేవ్ మధ్యలో ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న, కొత్త PRC ఎప్పుడు? తెలంగాణ ఉద్యోగులు దాదాపు మూడేళ్లుగా రెండో PRC అమలు కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాలు PRCతో పాటు పెండింగ్ DAలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజా నిరసనల్లో కూడా ఆరు పెండింగ్ DAలు, PRC అమలు ప్రధాన డిమాండ్లుగా వినిపించాయి.

ఇటీవ‌ల ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ప్రభుత్వం PRC నివేదికను త్వరగా సమర్పించాలని అధికారుల కమిటీని ఆదేశించినట్లు ప్రకటించింది. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. కానీ ఇక్కడే ప్రభుత్వానికి ఆర్థిక చిక్కు. కొత్త PRC అంటే కేవలం పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు పెరగడం మాత్రమే కాదు. దాని ప్రభావం, జీతాల బిల్లుపై, పెన్షన్లపై, DAల సెటిల్‌మెంట్‌పై, రిటైర్మెంట్ ప్రయోజనాలపై, భవిష్యత్ పెన్షన్ బాధ్యతలపై, కూడా పడే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం ముందు ఒక క్లిష్టమైన ప్రశ్న ఉంది. ముందు పెండింగ్ బకాయిలు క్లియర్ చేయాలా? రిటైర్మెంట్ వేవ్ కోసం నిధులు కేటాయించాలా? లేదా PRC అమలు చేయాలా?

PRS Legislative Research బడ్జెట్ విశ్లేషణ ప్రకారం 2024-25లో తెలంగాణ జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులపై భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. 2026-27లో పెన్షన్ వ్యయం కోసం రూ.14,737 కోట్ల బడ్జెట్ కేటాయింపు చూపించగా, వడ్డీ చెల్లింపులకు రూ.21,304 కోట్ల అంచనా ఉంది. కమిటెడ్ ఖర్చులు ఎక్కువగా ఉంటే ప్రభుత్వం అభివృద్ధి, మౌలిక వసతుల వంటి ఇతర ప్రాధాన్యతలపై ఖర్చు చేసే ఆర్థిక స్వేచ్ఛ తగ్గుతుంది. అంటే ఒకవైపు, జీతాలు, పెన్షన్లు, వడ్డీ తప్పనిసరి ఖర్చులు. మరోవైపు, వెల్ఫేర్ స్కీమ్స్, సబ్సిడీలు, అభివృద్ధి పనులు. ఇప్పుడు వీటికి అదనంగా, రిటైర్మెంట్ వేవ్, పెండింగ్ బకాయిలు, కొత్త PRC. అందుకే రాబోయే మూడు సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు అత్యంత కీలకంగా మారనున్నాయి.

“TGEJAC సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకారం, జనవరి 1, 2024 నుంచి జూలై 1, 2026 వరకు రావాల్సిన ఆరు DA వాయిదాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు, DAలు, PRC, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఒకేసారి పరిష్కారం కావాల్సిన అంశాలుగా ఉద్యోగ సంఘాలు చూస్తున్నాయి.” ఉద్యోగ సంఘాలు మాత్రం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.

తెలంగాణ ప్రభుత్వ ఖజానా ముందు ఇప్పుడు మూడు భారీ ఫైళ్లు ఉన్నాయి. ఫైల్ నంబర్ వన్ పెండింగ్ ఉద్యోగుల బకాయిలు. ఫైల్ నంబర్ టూ మూడు సంవత్సరాల్లో 28 వేల మంది రిటైర్మెంట్లు. ఫైల్ నంబర్ త్రీ కొత్త PRC అమలు. ఈ మూడు ఫైళ్లు కలిపితే, అది కేవలం ఉద్యోగుల సమస్య కాదు. రాష్ట్ర ఆర్థిక ప్రాధాన్యతలను నిర్ణయించే పెద్ద సవాల్.

ఒకవైపు ఉద్యోగులు తమ హక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రిటైర్ అయిన ఉద్యోగులు తమ జీవితాంతం సేవకు రావాల్సిన ప్రయోజనాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, అప్పులు, జీతాలు, పెన్షన్లు అన్నింటినీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. మరి రాబోయే మూడేళ్ల రిటైర్మెంట్ వేవ్‌ను తెలంగాణ ఖజానా ఎలా ఎదుర్కొంటుంది? రూ.వేల కోట్ల బకాయిలు ఎప్పుడు క్లియర్ అవుతాయి? కొత్త PRC ఎప్పుడు వస్తుంది? ఈ మూడు ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చే సమాధానమే తెలంగాణ ఉద్యోగుల భవిష్యత్తుతో పాటు రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు కూడా కీలకం కానుంది.


2) హైదరాబాద్‌లో 1 లక్ష సీట్ల క్రికెట్ స్టేడియం! దేశంలో రెండో అతిపెద్దది?

ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్, ఇప్పుడు ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల వైపు మరో భారీ అడుగు వేయబోతోంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏకంగా 100 ఎకరాల్లో భారీ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అదీ సాధారణ స్టేడియం కాదు. లక్ష మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చునే సామర్థ్యంతో నిర్మించే మెగా స్టేడియం.

ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం. దీని సామర్థ్యం సుమారు లక్షా 32 వేల మంది ప్రేక్షకులు. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రతిపాదిస్తున్న కొత్త స్టేడియం సామర్థ్యం దాదాపు లక్ష మంది ప్రేక్షకులు. అంటే ఈ ప్రాజెక్టు పూర్తయితే, నరేంద్ర మోదీ స్టేడియం తర్వాత దేశంలో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా హైదరాబాద్ నిలిచే అవకాశం ఉంది.

ఇప్పటికే ఉప్పల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉన్నప్పటికీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరింత పెద్దది, అధునాతనమైనది, బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగపడే స్టేడియం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.ఇది కేవలం క్రికెట్ మ్యాచ్‌ల కోసం మాత్రమే నిర్మించే స్టేడియం కాదు. అవసరాన్ని బట్టి, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, భారీ మ్యూజిక్ కాన్సర్ట్‌లు, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు, ఇతర క్రీడా పోటీలు నిర్వహించేలా దీన్ని డిజైన్ చేయాలని యోచిస్తున్నారు.

హైదరాబాద్‌లో భారీ స్థాయి ఈవెంట్ల కోసం ప్రస్తుతం పరిమితమైన వేదికలే ఉన్నాయి. ఈ కొత్త స్టేడియం వస్తే, క్రీడలతో పాటు అంతర్జాతీయ కాన్సర్ట్స్, మెగా షోలు, పెద్ద ఈవెంట్లకు కూడా హైదరాబాద్‌కు కొత్త అడ్రస్‌గా మారే అవకాశం ఉంది.

అయితే ఈ స్టేడియం కోసం ఫ్యూచర్ సిటీనే ఎందుకు ఎంచుకున్నారు? దీనికి ప్రధాన కారణం కనెక్టివిటీ. ఈ ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ వరకు ప్రతిపాదిత మెట్రో విస్తరణ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భవిష్యత్తులో లక్ష మంది ప్రేక్షకులు ఒకే సమయంలో స్టేడియానికి చేరుకోవాల్సి వస్తే, రవాణా వ్యవస్థ అత్యంత కీలకం. అందుకే రోడ్డు, మెట్రో, ఎయిర్ కనెక్టివిటీ ఉన్న ఫ్యూచర్ సిటీ ప్రాంతం ఈ మెగా ప్రాజెక్టుకు అనుకూలంగా భావిస్తున్నారు.

ఈ మెగా స్టేడియం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం, బీసీసీఐ మధ్య భాగస్వామ్య మోడల్ ఉండే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, స్టేడియం కోసం భూమిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించనుంది. అటు నిర్మాణ వ్యయం, నిర్వహణకు సంబంధించిన అంశాలను బీసీసీఐ భరించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, డిసెంబర్ 9న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం.

100 ఎకరాల విస్తీర్ణం. లక్ష మంది ప్రేక్షకుల సామర్థ్యం. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, కాన్సర్ట్స్, మెగా ఈవెంట్స్, ఫ్యూచర్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం, నెట్ జీరో సిటీ కాన్సెప్ట్‌లతో అనుసంధానం. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే, హైదరాబాద్‌కు ఒక కొత్త గ్లోబల్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ల్యాండ్‌మార్క్‌గా మారే అవకాశం ఉంది.


3) గంటకు 5,600 ఇడ్లీలు.. 2,000 దోశలు! రోజూ 50 వేల మంది విద్యార్థులకు టిఫిన్

గంటకు 5,600 ఇడ్లీలు. గంటకు 2,000 దోశలు..3,600 పూరీలు. ఇది ఏదైనా ఫుడ్ ఫ్యాక్టరీ అనుకుంటున్నారా? కాదు. పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు తెలంగాణలో ఏర్పాటు చేసిన ఒక మెగా కమ్యూనిటీ కిచెన్! రోజూ ఏకంగా 50 వేల మందికి పైగా విద్యార్థులకు వేడివేడి అల్పాహారం సిద్ధం చేసే సామర్థ్యంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ అత్యాధునిక కిచెన్ సిద్ధమైంది. లోపల ఉన్న భారీ ఆటోమేటెడ్ యంత్రాలు చూస్తే నిజంగానే ఆశ్చర్యపోవాల్సిందే!

ఉదయం ఖాళీ కడుపుతో పాఠశాలకు వెళ్లే పిల్లల కష్టాలను తీర్చాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అల్పాహార పథకాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. ఉత్సాహంగా చదువుకోవాలి. అన్న ఆలోచనతో ఈ మెగా కిచెన్‌కు రూపకల్పన చేశారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా మూడు జిల్లాల్లోని వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు.

ఈ భారీ కిచెన్ ఏర్పాటుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన CSR నిధులతో ఆర్థిక సహకారం అందించగా, నిర్వహణ బాధ్యతలను హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ చేపట్టింది. ఈ ఒక్క కిచెన్ పరిధిలోకి మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలు రానున్నాయి.

మొత్తం 17 మండలాల్లో ఈ పథకం అమలు కానుంది. 691 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42 వేల 450 మంది విద్యార్థులు, 13 జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 6 వేల 654 మంది విద్యార్థులు. అంటే రోజూ దాదాపు 50 వేల మందికి పైగా విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఈ కిచెన్ సిద్ధమైంది.ఒకప్పుడు ఇంట్లో టిఫిన్ లేక, ఖాళీ కడుపుతో బడికి వెళ్లే పిల్లలకు ఇప్పుడు భారీ మెగా కిచెన్‌లో తయారయ్యే వేడివేడి బ్రేక్‌ఫాస్ట్ అందనుంది.

ఈ మెగా కిచెన్ అసలు ప్రత్యేకత ఏమిటంటే, ప్రభుత్వం కేటాయించిన 8 వేల చదరపు అడుగుల భారీ షెడ్‌లో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. గంటకు 5,600 ఇడ్లీలు తయారు చేసే భారీ స్టీమర్లు, 2,000 దోశలు చేసే ఆటోమేటెడ్ మెషీన్లు, 3,600 పూరీలు తయారు చేసే యంత్రాలు. అంతే కాదు, సాంబార్, కూరల తయారీ యూనిట్ల ద్వారా కేవలం రెండు గంటల్లో 5 వేల మందికి సరిపడా ఆహారం సిద్ధం చేయవచ్చు. కేవలం 40 నిమిషాల్లో వెయ్యి మందికి సరిపడా అన్నం వండే భారీ పరికరాలు కూడా ఉన్నాయి.వెజిటబుల్ కటింగ్ యూనిట్లు, RO ప్లాంట్, గ్యాస్ బ్యాంక్, ఫుడ్ ల్యాబ్, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, అన్నీ ఒకే చోట ఏర్పాటు చేశారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచనల మేరకు ప్రత్యేక మెనూను రూపొందించారు.సోమవారం ఇడ్లీ, మంగళవారం – పూరీ, బుధవారం – దోశ, గురువారం – ఉప్మా, శుక్రవారం – మిల్లెట్ ఇడ్లీ, శనివారం – బోండా, అంటే రోజుకో రుచి…రోజుకో బ్రేక్‌ఫాస్ట్!

అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో తయారయ్యే ఈ ఆహారాన్ని వేలాది మంది విద్యార్థులకు సరఫరా చేయనున్నారు.ఈ మెగా కిచెన్‌లో కనిపించేది కేవలం భారీ యంత్రాలు కాదు. వేలాది మంది పిల్లల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఒక పెద్ద ప్రయత్నం. రోజూ దాదాపు 50 వేల మంది విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సిద్ధమైన ఈ మెగా కిచెన్. మంచిర్యాలకే కాదు, తెలంగాణలో పేద విద్యార్థుల పోషకాహార కార్యక్రమానికి ఒక కొత్త అధ్యాయంగా మారబోతోంది.

Read More
Next Story