మావోయిస్టు నేత గణపతి ప్రాణానికి రేవంత్ హామీ
x
revanth and Maoist top leader Ganapati

మావోయిస్టు నేత గణపతి ప్రాణానికి రేవంత్ హామీ

మావోయిస్టు నేతలు ప్రత్యేకంగా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవటానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు


దేశంలో ఎక్కడెక్కడో ఉన్న మావోయిస్టు నేతలంతా తెలంగాణలోకి వచ్చి పోలీసుల ముందు ఎందుకు లొంగిపోతున్నట్లు ? శనివారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపే సమాధానం చెబుతుంది. దశాబ్దాలపాటు ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, తెలంగాణలో బాగా యాక్టివ్ గా ఉంటు పార్టీలో కీలక హోదాల్లో ఉన్న వాళ్ళు ఎన్ కౌంటర్లు కాగా మిగిలిన కొద్దిమంది కీలకనేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, సుజాత తదితరులు ఈమధ్యనే తెలంగాణ డీజీపీ బీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. నిజానికి ఇపుడు లొంగిపోయిన వారిలో కొందరు దశాబ్దాలుగా చత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ అడవులే కేంద్రంగా పనిచేశారు. తాము పనిచేసిన రాష్ట్రాల్లో కాకుండా తెలంగాణకు వచ్చి లొంగిపోయారు.

కారణం ఏమిటంటే పైన చెప్పిన రాష్ట్రాల్లో తెలంగాణ లెక్క వేరు మిగిలిన రాష్ట్రాల లెక్క వేరు. ఈ లెక్కలు ఏమిటంటే తెలంగాణలో రక్తంచిందకుండా, ఎన్ కౌంటర్ల పేరుతో మావోయిస్టులను వేటాడకుండా లొంగుబాట్లకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. అదే చత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పోలీసులు మావోయిస్టు నేతలను వెంటాడి, వేటాడి ఎన్ కౌంటర్లు చేసేస్తున్నారు. లొంగిపోయే అంశాలు పరిశీలనలో ఉన్నా సరే పై రాష్ట్రాల పోలీసులు ఎన్ కౌంటర్లలో మావోయిస్టు నేతల ఏరివేతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకనే పై రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉండి పోరాటాలు చేసిన మావోయిస్టు నేతలు ప్రత్యేకంగా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవటానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

తాజాగా రేవంత్ పిలుపే దీనికి నిదర్శనం. ఈరోజు సాయంత్రం రేవంత్ సమక్షంలో 130 మంది మావోయిస్టు దళసభ్యులు తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఇపుడు లొంగిపోయిన వారంతా ఈమధ్యనే లొంగిపోయిన దేవ్ జీ నాయకత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ గెరిల్లా ఆర్మీలో పనిచేసిన వారే. అంటే ముందు నాయకుడు లొంగిపోయిన తర్వాత పరిస్ధితులను సమీక్షించుకుని తర్వాత దళమంతా కూడా లొంగిపోయింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతు మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతిని లొంగిపోవాలని పిలుపిచ్చారు. పోలీసుల ముందు లొంగిపోతే గణపతి ప్రాణాలకు, ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టు నేతల విషయంలో పోలీసులు చాలా ఉదారంగానే వ్యవహరిస్తున్నారు.

చాలాకాలంగా గణపతి అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని, కనీసం తనంతట తాను నడవలేకపోతున్నాడని పోలీసుల దగ్గర సమాచారం ఉంది. అనారోగ్యంతోనే అజ్ఞాతంలో బతుకుతున్న గణపతి నేపాల్ తలదాచుకుంటున్నాడని, కాదు కాదు థాయ్ ల్యాండ్ లో ఉన్నాడనే ధృవపడని వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయి. గణపతి ఎక్కడున్నాడన్నది బయట ప్రపంచానికి తెలియకపోయినా రెండు రోజుల క్రితమే తండ్రిని లొంగిపోవాల్సిందిగా కొడుకు ముప్పాళ్ళ శ్రీనివాసరావు సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తి అందరికీ తెలిసిందే. ఇపుడు రేవంత్ కూడా గణపతిని లొంగిపోవాల్సిందిగా పిలుపిచ్చాడంటే లొంగుబాటుకు రంగం సిద్ధమైనట్లుగానే అనుకోవాలి. మరి లొంగుబాటు ఎప్పుడుంటుందో చూడాలి.

Read More
Next Story