రేవంత్ సీఎం అయ్యింది మెరిట్ కోటాలోనే
x
Congress Bhuvanagiri MP Chamala Kiran Kumar Reddy

రేవంత్ సీఎం అయ్యింది మెరిట్ కోటాలోనే

తెలంగాణ రాజకీయాల్లో మెరిట్, మేనేజ్మెంట్, పేమెంట్ కోటాలపై పెద్ద చర్చ నడుస్తోంది.


ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన విధానంపై తెలంగాణలో రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(KTR) కేటీఆర్, మాజీమంత్రి (Harish Rao)హరీష్ రావేమో పేమెంట్ కోటాలో రేవంత్ సీఎం అయ్యాడని పదేపదే ఆరోపిస్తున్నారు. పేమెంట్ కోటాలో సీఎం అయ్యాడు కాబట్టే ప్రతినెలా ఢిల్లీకి డబ్బులమూటలు మోసుకుని వెళుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. అయితే (BRS)బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం తోసిపుచ్చారు. రేవంత్(Revanth) ముఖ్యమంత్రి అయ్యింది మెరిట్ కోటాలోనే అని స్పష్టంగా చెప్పారు. కేటీఆర్ అండ్ కో ఆరోపిస్తున్నట్లు పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం రేవంత్ కు లేదని, ప్యూర్లీ మెరిట్ కోటాలోనే సీఎం అయినట్లు తేల్చేశారు.

రేవంత్ ది మెరిట్ కోటానే అనిచెప్పిన ఎంపీ కేటీఆర్ పైనే ఎదురుదాడి చేశారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చాడని ఆరోపించారు. మేనేజ్మెంట్ కోటా అంటే కేసీఆర్ కొడుకు హోదాలో అని చెప్పకనే చెప్పి ఎంపీ ఎద్దేవాచేశారు. కేసీఆర్ కొడుకు కాబట్టే మేనేజ్మెంట్ కోటాలో సిరిసిల్ల ఎంఎల్ఏ టికెట్ తెచ్చుకుని గెలిచాడని, అలాగే మంత్రిపదవి కూడా మేనేజ్మెంట్ కోటాలోనే అందుకున్నట్లు ఎగతాళిచేశారు. రేవంత్ ఇండిపెండెంటుగా జడ్పీటీసీగా గెలిచిన తర్వాత రెండుసార్లు ఎంఎల్ఏ, ఒకసారి ఎంపీ అయిన విషయాన్ని ఎంపీ గుర్తుచేశారు.

కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కు మేనేజ్మెంట్ కోటా కూడా దక్కేది కాదని ఎంపీ అన్నారు. రేవంత్, కేటీఆర్ లో మెరిట్ కోటా, మేనేజ్మెంట్ కోటా, పేమెంట్ కోటా ఎవరిదో జనాలందరికీ బాగా తెలుసు అన్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు చెప్పారు. శాశ్వతంగా తామే అధికారంలో ఉంటామని కేసీఆర్ నియంతపాలన చేసినట్లు ఎంపీ గుర్తుచేశారు. రేవంత్ చెప్పినట్లుగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఎంపీ జోస్యంచెప్పారు.

Read More
Next Story