
రాజశేఖర్ రెడ్డి కన్నా రేవంతే గట్టోడు.. !
ఆప్తులకు పదవులు తెప్పించుకోవడంలో వైఎస్‌ఆర్ పోరాడిన అంశంలో రేవంత్ తొలిసారే విజయం సాధించారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారిక ఆసక్తికరమైన పోలిక తెరపైకి వచ్చింది. అదే ఉమ్మడి ఆంధ్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య. ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్ కన్నా రేవంత్ రెడ్డే గట్టోడన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏ విషయంలో అంటే.. ఆప్తులకు పదవి ఇప్పించుకోవడంలో. వైఎస్ఆర్ తన ఆప్తుడు అయిన కేవీపీ రామచందర్ రావుకు రాజ్యసభ సీటు ఇప్పించుకోవడంలో చాలా ఒడిదుడుకులు తిన్నారు. పలుసార్లు కేవీపీ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం తిరస్కరించింది. ఎట్టకేలకు 2008లో కేవీపీకి రాజ్యసభ సీటు ఇప్పించుకోవడంలో వైఎస్ఆర్ సక్సెస్ అయ్యారు. కానీ రేవంత్ మాత్రం వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించడంలో ఫస్ట్ షాట్‌లోనే సక్సెస్ అయ్యారు. రాజ్యసభ స్థానానికి వేం నరేందర్ రెడ్డి పేరును రేవంత్ సిఫార్సు చేసిన వెంటనే కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఇప్పుడు ఈ పోలిక చర్చ మొదలైంది.
కేవీపీకి వరుస తిరస్కరణలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ రామచందర్ రావు ఎంతటి ఆప్తులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవీపీ చెప్పారంటే.. వైఎస్ చెప్పినట్లే అన్నట్లు ఉండేది పరిస్థితి. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం రాజకీయాల్లో కూడా బలంగా కనిపించేది. అనేక విషయాల్లో పార్టీ అధిష్టానం దగ్గర సక్సెస్ అయిన వైఎస్ఆర్.. కేవీపీ రాజ్యసభకు పంపే విషయంలో మాత్రం పలుసార్లు ఫెయిల్ అయ్యారు. ఈ విషయంలో వైఎస్ఆర్‌కు అంత ఈజీగా విజయం దక్కలేదు.
అంతేకాకుండా అప్పట్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను నిశితంగా పరిశీలిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు తీసుకునేది. అందువల్లో మరేమైన ఇతర కారణాల వల్లోగానీ వైఎస్ఆర్.. కేవీపీ పేరు సిఫార్సు చేసిన ప్రతిసారి అతనిని కాదని వేరేవారికి అవకాశం ఇచ్చేది. అందువల్ల వైఎస్ఆర్ సిఫార్సు ఉన్నప్పటికీ మొదటి రెండు అవకాశాల్లో కేవీపీకి టికెట్ దక్కలేదు. చివరకు 2008లో పరిస్థితులు అనుకూలించడంతో కేవీపీ రామచందర్ రావు రాజ్యసభకు వెళ్లే అవకాశం దక్కింది.
రేవంత్ ఫస్ట్ షాటే హిట్
ఇక ఇప్పుడు రేవంత్ విషయానికి వస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం తన తొలి ప్రయత్నంలోనే తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. రేవంత్ సిఫార్సు వచ్చిన వెంటనే కాంగ్రెస్ అధిష్టానం ఆ పేరును ఆమోదించింది. దీంతో వైఎస్ కన్నా రేవంత్ గట్టోడే అన్న చర్చ తెరపైకి వచ్చింది.
వైఎస్ఆర్‌కు ఉన్న మైనస్ ఏమిటి?
వైఎస్ఆర్ హయాంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. దాంతో పాటు ఎవరికి అవకాశాలు ఇవ్వాలి అన్న విషయాలను హైకమాండ్ చాలా నిశితంగా పరిశీలించి అడుగు ముందుకేసేది. సోనియా గాంధీ ఆశీస్సులు ఉన్నప్పటికీ, ఢిల్లీలోని 'కోర్ గ్రూప్' నేతలు వైఎస్ఆర్‌ను ఒక ప్రాంతీయ శక్తిగా చూసేవారు. ఒకే నేతకు రాష్ట్రంలో పూర్తి స్వేచ్ఛ ఇస్తే అధిష్టానానికి పట్టు తప్పుతుందనే భయం అప్పట్లో ఉండేది. అందుకే కేవీపీ వంటి ఆప్తులకు పదవులు ఇచ్చే విషయంలో హైకమాండ్ పేచీలు పెట్టేది. అప్పట్లో వైఎస్ఆర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేసే సీనియర్ల సంఖ్య ఎక్కువగా ఉండేది.
విశ్లేషకుల దృష్టిలో అప్పటి పరిస్థితులు వైఎస్ఆర్‌కు పూర్తిగా అనుకూలంగా లేవు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకుల మధ్య సమతుల్యతను కాపాడాలని ప్రయత్నించింది. అంతేకాకుండా సీఎం సీటులో వైఎస్ఆర్, రాజ్యసభలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఆత్మగా చెప్పుకునే కేవీపీని ఉంచడానికి పార్టీలో కూడా చాలా మంది సుముఖుత కనబరచలేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ కారణంగానే పార్టీలో సమతుల్యతను కాపాడం కోసం కాంగ్రెస్.. కేవీపీని పక్కనెట్టేదన్న వాదన వినిపిస్తోంది. దాంతో పాటుగా రాష్ట్రంలో ఇతర వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఆలోచన ఉండేది. అందువల్లనే ప్రతిసారి వైఎస్ఆర్ వ్యతిరేక వర్గాలకు కూడా పెద్దపీట వేస్తుండేది.
రేవంత్‌కు ఉన్న ప్లస్ ఏమిటి?
కర్ణాటక తర్వాత కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంక్ ఉన్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో అసెంబ్లీ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతూ రాహుల్ గాంధీ నమ్మకాన్ని రేవంత్ పూర్తిస్థాయిలో గెలుచుకున్నారు. దాంతో పాటుగా ఇప్పటి కాంగ్రెస్ హైకమాండ్ గతంలోలా లేదు. పాత పద్ధతులకు భిన్నంగా, గెలిపించే గుర్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానానికి రేవంత్.. అతిపెద్ద గెలుపుగుర్రంగా కనబడుతున్నారు. దీంతో రేవంత్ అడిగింది కాదనలేని స్థితిలో ఢిల్లీ పెద్దలు ఉన్నారు.
అంతేకాకుండా వైఎస్ఆర్ వినమ్రంగా అడిగి సాధించుకునేవారు, కానీ రేవంత్ రెడ్డి తన ప్రాధాన్యత ఏంటో కుండబద్దలు కొట్టి చెప్పగలరు. రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవాలంటే తన టీం బలంగా ఉండాలని అధిష్టానాన్ని ఒప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
రేవంత్ తెలివిగా వెళ్లారా..
ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవీపీ రామచందర్ రావును క్యాబినెట్ హోదాలో సలహాదారుగా ఉంచుకున్నారు. రేవంత్ కూడా అదే విధంగా వేం నరేందర్ రెడ్డిని క్యాబినెట్ హోదాలో సలహాదారుగా ఉంచుకున్నారు. కానీ వైఎస్ఆర్‌కు కేవీపీ మాత్రమే సలహాదారుగా ఉన్నారు. కానీ రేవంత్‌కు వేం నరేందర్ రెడ్డితో పాటు మరో ఏడుగురు సలహాదారులు ఉన్నారు. దీంతో రేవంత్‌కు వేం మాత్రమే సన్నిహితుడు కాదు ఇంకా ఇతరులు కూడా ఉన్నారన్న భావన పార్టీ అధిష్టానంలో కలిగి ఉండొచ్చని, కానీ వైఎస్ విషయంలో మాత్రం ఒక్కరే ఉండటంతో కేవీపీ అంటే వైఎస్ ఆత్మగానే పార్టీ హైకమాండ్ భావించి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ కారణం కూడా ఇప్పుడు రేవంత్ సక్సెస్ అవడంలో కీలక పాత్ర పోషించి ఉండొచ్చని, ఈ విషయంలో రేవంత్ చాలా తెలివిగా వ్యవహరించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

