Revanth Reddy
x

సర్ దారి తప్పింది.. బీజేపీపై రేవంత్ ధ్వజం

SIR ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల తొలగింపు, సీఈసీ ఎంపిక, ఎన్నికల కమిషన్ తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.


ఓటు హక్కు కల్పించాల్సిన సర్ ప్రక్రియను ఓట్ల తొలగింపునకు ఉపయోగిస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోకూడదన్న భయంతోనే బీజేపీ సర్ ప్రిక్రయను తీసుకొచ్చిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల ఓట్లు తొలగించడమే కేంద్ర సర్కార్ టార్గెట్ అని ఆరోపించారు. సర్ ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న రేవంత్.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సోమవారం కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలోనూ రేవంత్ రెడ్డి (సర్’ ప్రక్రియపై తీవ్ర విమర్శలు చేశారు. మొదట మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పుడు దారి తప్పిందని అన్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల వ్యవస్థను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.

సీజేఐని తొలగించాలి

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఎంపిక విధానంలో 2023లో మార్పులు చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి సీఈసీ ఎంపికలో భాగస్వాములుగా ఉండే విధానం ఉండేదని గుర్తుచేశారు. కానీ, కొత్త విధానంలో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, ప్రతిపక్ష నేతకు బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ఎంపికను రాహుల్ గాంధీ అప్పట్లోనే వ్యతిరేకించారని పేర్కొన్నారు.

ఎన్నికల కమిషన్‌లో తప్పులు జరుగుతున్నాయని మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

20 కోట్ల ఓట్ల తొలగింపే లక్ష్యం

దేశంలోని స్వతంత్ర సంస్థలను బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను ఉపయోగించుకున్నారని, ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల ఓట్ల తొలగింపు లక్ష్యంగా పనిచేస్తున్నారని, దాదాపు 20 శాతం మందిని ఓటు హక్కుకు దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

యువత, నిరుద్యోగులు, పేదలు, గిరిజనులు సహా బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే యువత ఓట్లను కూడా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం కృత్రిమ మేధ (AI)ను ఉపయోగిస్తున్నారని కూడా పేర్కొన్నారు.

ఓటర్ల సంఖ్యలో మార్పులు ఎలా

ఓటర్ల సంఖ్యలో మార్పులపై రేవంత్ రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. 2014లో 81 కోట్ల ఓట్లు, 2019లో 91 కోట్ల ఓట్లు, 2023లో 97 కోట్ల ఓట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారని ఆరోపిస్తూ, దేశంలో జనాభా పెరుగుతున్నప్పుడు ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గుతోందని ప్రశ్నించారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాలని కోరారు. ఓటు హక్కు కోల్పోతే ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే అవకాశం కోల్పోతారని, సంక్షేమ పథకాల విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

సర్‌ను అమలు చేసిన బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందని రేవంత్ గుర్తు చేశారు. ఆ ప్రక్రియ జరగని రాష్ట్రాల్లో కమలం పార్టీ వాడిపోయిందని, ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో కూడా గెలవడం కోసం సర్ ప్రక్రియను చేపట్టిందని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు, ఓటర్ల సంఖ్యలో మార్పులపై సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దేశాన్ని ముక్కలు చేస్తున్నారు

దేశంలోని పౌరులను బీజేపీ రెండు వర్గాలుగా విభజించేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఉన్నవారికి ఓటు హక్కు ఉండేలా, వ్యతిరేకంగా ఉన్నవారిని ఓటు హక్కుకు దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఈ పరిణామాలు దేశ ప్రజాస్వామ్యానికి, భవిష్యత్తుకు సంబంధించిన అంశమని అన్నారు. ప్రజలు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలని కోరారు.

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం

సర్‌కు వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోమని తెలిపారు. ‘జ్ఞానేశ్ గో బ్యాక్’ నినాదంతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత పోరాటాన్ని మరో స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు.

Read More
Next Story