Revanth Reddy at Stand With Her Event
x

మహిళల భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ జేఎన్‌టీయూలో జరిగిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో మహిళల ఆర్థిక సాధికారత, పథకాల అమలు, వేధింపుల నివారణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం తెలిపారు.


మహిళల భద్రత, సాధికారతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఆడిటోరియంలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” కార్యక్రమంలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకువస్తోందని చెప్పారు. మహిళలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో మహిళాశక్తి పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలలో ఎక్కువవి మహిళల పేరుతోనే కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. మహిళల సామర్థ్యంపై ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉందని, అదే కారణంగా పార్టీలోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారని సీఎం తెలిపారు. మహిళ సంఘాల ద్వారా ఆర్టీసీలో వెయ్యి బస్సులు నడుస్తున్నాయని, వాటికి మహిళలే యజమానులుగా ఉన్నారని చెప్పారు.

మహిళలపై వేధింపులు గతంలో ప్రధానంగా పట్టణాలకే పరిమితమయ్యేవని, ఇప్పుడు వాటి పరిధి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత కోసం చట్టాలు చేయడం మాత్రమే కాకుండా వాటిని కచ్చితంగా అమలు చేయడం కూడా అవసరమని సీఎం స్పష్టం చేశారు.

Read More
Next Story