
‘వేల కోట్ల ఆస్తులు.. కేసీఆర్ శ్వేతపత్రం ఇవ్వాలి’
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ పాలన, నేతన్నల సమస్యలు, ఆస్తులపై ఆరోపణలు చేశారు.
సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సిరిసిల్లకు వచ్చారు. మంగళవారం సిరిసిల్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సమస్యలకు సిరిసిల్ల నిలయంగా మారిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుందని కూడా విమర్శించారు. పదేళ్లలో ఇంత ఆస్తులు ఎలా సంపాదించారో కేటీఆర్ శ్వేతపత్రం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. సిరిసిల్లలో రేవంత్ పర్యటనకు ముందు నుంచే కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. సభకు లక్ష మందిని సమీకరించేలా పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు.
సిరిసిల్లకు చేరుకున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ నేతలు, మంత్రులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. సిరిసిల్ల అంటే సిరులకు నిలయం అని.. కానీ బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఇది ఉరిసిల్లగా మారిందని రేవంత్ అన్నారు. నేత కార్మికుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదని ప్రశ్నించారు. గల్ఫ్‌కు వలస వెళ్తున్న కార్మికులను ఎందుకు ఆపలేకపోయారని కేటీఆర్‌ను నిలదీశారు.
ఉద్యమం పేరుతో సంపాదించారు
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుందని రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అవినీతి జరిగిందని అన్నారు. మానేరు ఇసుక విషయంలోనూ కేసీఆర్ కుటుంబానికి చెందినవారిపై ఆరోపణలు చేశారు. నేరెళ్ల ఘటనను కూడా రేవంత్ ప్రస్తావించారు. దళితులపై అప్పట్లో జరిగిన ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దళితులను పోలీస్ స్టేషన్లలో ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.
కేసీఆర్ కుటుంబ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ సవాల్ చేశారు. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని కొన్ని స్టార్ హోటళ్లతో కేసీఆర్ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయంటూ ఆయన ఆరోపణలు చేశారు. గతంలో ఇతరుల పేర్లలో ఉన్న భూములు, ఆస్తులు తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లకు ఎలా మారాయని ప్రశ్నించారు. అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో పెట్టుబడులపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నేత కార్మికులకు కాంగ్రెస్ అండ
నేత కార్మికుల కోసం బీఆర్‌ఎస్ పదేళ్లలో రూ.2,234 కోట్లు ఖర్చు చేసిందని రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.1,731 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ జిల్లాకు కూడా రూ.1,700 కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల గడీపై గురిపెట్టి రాజకీయంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ పాలన కావాలా.. దొరల పాలన కావాలా అని ప్రశ్నించారు.
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అభివృద్ధిపై చర్చించాలని రేవంత్ సవాల్ చేశారు. గత ఎన్నికల్లో కేటీఆర్‌ను ఆరుసార్లు గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు నేతన్నల సమస్యలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు. కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో రేవంత్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభలో చేసిన విమర్శలతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ మాటల యుద్ధం మరింత స్పష్టంగా కనిపించింది.
సభ సక్సెస్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సభ సక్సెస్ అయిందనే చెప్పాలి. సభ జరిగిన తీరు, సీఎంకు ప్రజల నుంచి అందిన ఆహ్వానం, రేవంత్ స్పీచ్‌కు వచ్చిన స్పందనను బట్టే ఈ విషయం చెప్పొచ్చు. సిరిసిల్లలో కాంగ్రెస్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 1.5 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. సభా ప్రాంగణం అంతా ప్రజలతో కిటకిటలాడిపోయింది. ప్రజలకు అందించిన సదుపాయాలు కూడా అద్భుతంగా ఉన్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పడూ రాజకీయ బహిరంగ సభల్లో ఉన్నట్లు కాకుండా.. ఈ సభలో నిలబడిన ప్రజలు అతి తక్కువ మంది ఉన్నారు.
