మార్చి తర్వాత మూసి ముస్తాబు  మొదలవుతుంది
x

మార్చి తర్వాత మూసి ముస్తాబు మొదలవుతుంది

ప్రాజక్టు మీద బిఆర్ ఎస్ బుర్రలో పాయిజన్. అది పొల్యూషన్ కంటే ప్రమాదం: అపోజిషన్ పార్టీ మీద సిఎం రేవంత్ నిప్పులు


మూసీ ప్రాజక్టు ముందుకు సాగుతుంది, ముహుర్తం మార్చి తర్వాత మొదలవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డ ప్రకటించారు. శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ మార్చి 31 నాటికి ప్రాజక్టు సిద్ధమవుతుందని, ఆ తర్వాత వెంటనే పనులు ప్రారంభమవుతాయని ఆయన ప్రకటించారు. మూసీ ప్రాజక్టు వెనక అనేక ప్రపంచ ఖ్యాతి నగరాలను అనుభవం ఉందని కూడా ఆయన చెప్పారు.

మూసీ ప్రాజెక్టుకు ADB బ్యాంకు రూ.4000 కోట్లు రుణం ఇచ్చేందుకు ఎషియన్ డెవెలప్ మెంటు బ్యాంక్ (ADB) అంగీకరించిందని కూడా ఆయన సభలో ప్రకటించారు.

లండన్, న్యూయార్క్, సింగపూర్ లతో పాటు, జపాన్, సౌత్ కొరియాదేశాలలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి ఎలా సాగిందో అధ్యయనం చేసిన అనంతరం, సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

“సమగ్ర ప్రాజక్టు నివేదిక (DPR) సిద్దమయ్యాక ఎమ్మెల్యేలందరికీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పాలి. పేదలకు మంచి ఇండ్లు కట్టించి వారికి మెరుగైన వసతులు కల్పించి హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం. గాంధీ సరోవర్ నిర్మాణానికి డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వడానికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు సూచనప్రాయంగా అంగీకరించారు,” అని రేవంత్ తెలిపారు.

మూసీ ప్రాజక్టును ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో చెబుతూ మూసీ నది కాలుష్యం వల్ల పరివాహక ప్రాంతాల్లో పర్యావరణం, ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోందని, పరిశ్రమల మలినాలు, ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

“కాకతీయుల నుంచి నిజాం నవాబుల వరకు సాగు, తాగు నీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించారు. 1908లో నగరాన్ని వరద ముంచెత్తితే సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిజాం సర్కారు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించింది. అవే ఇప్పటికీ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. వాటిని ఫామ్ హౌజుల నుండి వచ్చే డ్రైనేజీతో కలుషితం చేస్తుంటే ఉక్కు పాదం మోపి ముందుకు వెళ్తున్నాము,” అని చెప్పారు.

మూసీ నది ప్రక్షాళనకు అయ్యే ఖర్చు కన్సల్టెన్సీలు డీపీఆర్ సిద్దంచేశాక తెలుస్తుందని, మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి అభివృద్ధి చేయాలనుకుంటున్నామనీ సిఎం ఎ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టంచేశారు. మూసా, ఈసా నదుల సంగమం బాపూ ఘాట్ వద్ద V షేప్ లో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు.

“మూసీ - ఈసా నదుల సంగమంలో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్ముడి విగ్రహాన్ని నెలకొల్పే ప్రాంతం గాంధీ సరోవర్‌ను ‘V’ ఆకారంలో అభివృద్ధి చేస్తాం. గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 20 టీఎంసీలలో 15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5 టీఎంసీలను మూసీలో శుద్ధమైన నీరు నిరంతరం ప్రవహించేందుకు వినియోగించబోతున్నాం,” అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఉత్తర్ ప్రదేశ్ లో గంగా నదిలోనూ, గుజరాత్ లో సబర్మతి నదులను ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్లు కట్టి వాటిని అభివృద్ధి మంత్రంగా ప్రచారం చేసుకున్నారు. మేం వాటిని వ్యతిరేకించలేదు తప్పుపట్ట లేదు. మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. కంపెనీల కలుషితాల నుంచి జంతువుల కళేబరాల వరకు మూసీలో కలుస్తున్నాయి. మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారని వైద్యులు చెప్పిన పరిస్థితి. వాటిని చూసి మూసీలో శుద్ధమైన నీరు ప్రవహించాల్సిందేనని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు మేము ప్రయత్నం చేస్తుంటే ఎందుకు విషయం చిమ్ముతున్నారని సిఎం ప్రతిపక్షాలను నిలదీశారు.

మూసి ప్రక్షాళన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారమనే విమర్శను తిప్పికొడుతూ, “గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నామనీ, ఓల్డ్ సిటీ ఒరిజినల్ సిటీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని దాన్ని ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామనీ సిఎం చెప్పారు. రాబోయే 20 ఏండ్లలో పట్టణీకరణ 75 శాతానికి పెరుగుతుంది. నన్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు, అదీ కూడా ఒక ఇండస్ట్రి, హైటెక్ సిటీ నిర్మించాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. మూసీ ప్రక్షాళన చేయాలని వాళ్ల బీఆరెస్ ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారు. గుజరాత్ సబర్మతీ నది ప్రక్షాళన సమయంలో 60 వేల కుటుంబాలను తరలించారు. ఇక్కడ పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తామంటే వాళ్లు అలాగే ఉండాలన్నట్లుగా విపక్షం ప్రవర్తిస్తోంది. మంచిరేవుల దగ్గర ఉన్న పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. నది పరివాహకంలో గురుద్వార, మసీదు, చర్చి లను నిర్మించి మత సామరస్యాన్ని చాటబోతున్నాం,” అని సిఎం అన్నారు.

అంతకు ముందు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మూసీ సుందరీకరణ ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చారా? పేదల ఇళ్లు కూల్చితే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం, అని అన్నారు.

“మూసీ మోడ్రనైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో చెప్పాలి, సిఎం ఒకసారి ముఖ్యమంత్రి గారు లక్ష కోట్లని, మరోసారి లక్షా 50 వేల కోట్లు అని పలుసార్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవు అంటున్న ప్రభుత్వం మూసీ సుందరీకరణ మీద మాత్రం లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు. ఇప్పటివరకు ఎన్ని నివాసాలు కూల్చారు? కూల్చిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ చెల్లించారా? లేదా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వారిని అసైన్మెంట్ చేసి చేతులు దులుపుకున్నారా? ప్రభుత్వం గుర్తించిన కూల్చవలసిన ప్రభుత్వ, ప్రైవేటు కట్టడాలు ఎన్ని? ఎంత భూమిని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తున్నారు?” అని నిలదీశారు.

“రెండున్నర టీఎంసీల స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసిలో వదులుతామన్నారు అవి ఎక్కడి నుంచి తెస్తున్నారు? కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుండి ఆ గోదావరి నీళ్లను తెస్తున్నారా? లేక గాలిలో నుండి తెస్తున్నారా,” అని ప్రశ్నించారు.

తరువాత ఆయన బిఆర్ఎస్ ఎమ్యెల్యేలతో కలిసి అసెంబ్లీని బహిష్కరించి గన్ పార్క్ దగ్గర ధర్నా చేసి మూసీ కంపు కంటే సీఎం మాటల కంపు ఎక్కువైందన్నారు. “రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు,” అని నిందించారు.

తదుపరి ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ మూసీ ప్రాజక్టు ఎక్కడి నుంచి మొదలవుతుందో చెప్పాలన్నారు, “మూసి ప్రణాళిక 18 నెలలలో కన్సార్టియమ్ అధ్యయనం చేసి ఇస్తుందని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు అమలును మూసి పుట్టే అనంతగిరి కొండలనుండి చేస్తారా. ఎక్కడి నుంచి ప్రాజెక్టును చేపడతారు. డిఫెన్సు వాళ్ళ నుంచి భూమి తీసుకుంటాము అంటున్నారు. ప్రైవేట్ భూములు ఎన్ని తీసుకుంటారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కాచ్మెంట్ ఏరియా ఎంత. హిమాయత్ సాగర్ కాచ్మెంట్ ఏరియా అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ ప్రాంతాల్లో వున్న ఆక్రమణలు ఎన్ని, వాటిని తొలగించటానికి మీ ప్రణాళిక ఏమి. మూసిలోకి గోదావరి నీరు కలుపుతామని అంటున్నారు. ఆ నీరు ఏదైనా రిజర్వాయర్ లో నిల్వ ఉంచి ఎత్తి పోస్తారా లేక నేరుగా కలుపుతారా,” అని అడిగారు.

“యిటీవల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను పూర్తిగా తెరవకపోయిన ఔటర్ రింగ్ రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. నది పుట్టే ప్రాంతం నుండి ఎన్ని చెక్ డ్యాములు నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను ఎండబెట్టేందుకు ఈ చెక్ డ్యాములు కట్టారు. వాటిని యిప్పుడు ఏమి చేస్తారు. నిర్లక్ష్యానికి గురైన పేద ముస్లింల ఇళ్ళను వాళ్ళను మురికి వాడల నుండి కాపాడే పేరుతో తొలిగించే ప్రయత్నం జరుగుతోంది. యిక్కడ కొన్ని ఇళ్ళలో కాపురాలు మూడు అంతస్థులలో వున్నారు. వారి అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు యిస్తారా. చార్మినార్ పెడస్ట్రనైజేషన్ ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు దానివలన ప్రభావితం అయ్యే వాళ్ళకు పునరావాసం గురించి ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ ప్రణాళికా ఏమి అయ్యింది. దానికి తగిన నిధులు ఇవ్వండి. పేదల ఇళ్ళు కూలగొడితే మా పార్టీ మూసి ప్రాజెక్టును వ్యతిరేకిస్తుంది,” అని హెచ్చరించారు.

Read More
Next Story