
ముగిసిన రేవంత్ దావోస్ పర్యటన
అవగాహనా ఒప్పందాలు లక్షల కోట్ల రూపాయలకు జరిగిన మాట నిజమే కాని వాస్తవ పెట్టుబడులు ఎంత వస్తాయన్నది చూడాలి.
దావోస్ లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతంగా ముగిసింది. పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా రేవంత్(Revanth) దావోస్(Davos) లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మూడురోజుల్లో 12 దిగ్గజ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యాడు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లోని అనేక కంపెనీలతో పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలను చేసుకున్నారు. ఏఐ, సస్టైనబిలిటీ స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు జరిగాయి.
పోయిన నెలలో హైదరాబాద్, ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ 2047 సదస్సులో రాష్ట్రానికి రు. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. ఇపుడు దావోస్ లో కూడా అనేక దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకోవటం గమానర్హం. ఎన్నికంపెనీలు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి అనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం తాజాగా ప్రకటించలేదు. అవగాహనా ఒప్పందాలు లక్షల కోట్ల రూపాయలకు జరిగిన మాట నిజమే కాని వాస్తవ పెట్టుబడులు ఎంత వస్తాయన్నది చూడాలి.
మూడురోజుల పర్యటనలో రేవంత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలకమైన సెషన్లలో పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ వేదికను హైదరాబాద్ లో నిర్వహించాలన్న రేవంత్ సూచనకు దావోస్ సదస్సులో మంచి స్పందనే కనబడింది. అయితే పాలో అప్ సదస్సు హైదరాబాద్ లో పెడతారా లేదా అన్నది తెలీదు. దావోస్ పర్యటన ముగించుకున్న రేవంత్ జ్యూరిక్ చేరుకుని అక్కడినుండి అమెరికాకు చేరుకుంటారు. మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు దావోస్ నుండి హైదరాబాదుకు తిరుగు ప్రయాణమయ్యారు.

