
వేల కోట్లతో రోడ్లు.. ప్రజల ప్రాణాలకు భద్రత ఉందా?
రోడ్డు ప్రమాదాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి: నితిన్ గడ్కరీ
1) వేల కోట్లతో రోడ్లు.. ప్రజల ప్రాణాలకు భద్రత ఉందా?
2) సాగర్ నీటిపై ఏపీ కన్ను.. తెలంగాణ నీటి హక్కులకు ముప్పు!
3) అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా.. బస్తీల్లో బాంబులా?
1) వేల కోట్లతో రోడ్లు.. ప్రజల ప్రాణాలకు భద్రత ఉందా?
తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రీజినల్ రింగ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కానీ.. రోడ్ల అభివృద్ధి అంటే కేవలం వాహనాలు వేగంగా వెళ్లడమేనా? ఆ రోడ్లపై ప్రయాణించే సామాన్యులకు భద్రత ఉందా? పాదచారులకు నడిచే హక్కు ఉందా? ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడే ఏర్పాట్లు ఉన్నాయా?
హైదరాబాద్‌లో ప్రారంభమైన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు ఈ అంశాలపై చర్చించేందుకు తెలంగాణకు ఒక కీలక వేదికగా మారింది. హెచ్ఐసీసీలో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభమైంది. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ సదస్సును ప్రారంభించారు. పర్యావరణహిత రహదారుల నిర్మాణం, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ వ్యవస్థలపై చర్చించారు.
హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. ఐటీ కారిడార్లు, ఫ్యూచర్ సిటీ, పారిశ్రామిక ప్రాంతాలు, శాటిలైట్ టౌన్‌షిప్‌లతో రవాణా అవసరాలు పెరుగుతున్నాయి. రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, జాతీయ రహదారుల విస్తరణతో రాష్ట్రంలో రోడ్ల నెట్వర్క్ మరింత పెరగబోతోంది.
అయితే రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు? వర్షాలు వస్తే రోడ్లు ఎందుకు దెబ్బతింటున్నాయి? గుంతల కారణంగా ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది? నిర్మాణ లోపాల వల్ల ప్రాణాలు పోతే బాధ్యత వహించేది ఎవరు? ఇవి కేవలం సాంకేతిక సమస్యలు కాదు. ప్రజల ప్రాణాలకు, భద్రతకు సంబంధించిన మానవ హక్కుల ప్రశ్నలు.
హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవుతున్నాయి. రోడ్లు దాటేందుకు సరైన సదుపాయాలు లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు రోడ్లపై ప్రయాణించాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు, సురక్షిత జంక్షన్లు, ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు, ప్రమాదాల నివారణకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం అత్యవసరం. రోడ్ల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఏం నేర్చుకోవాలి?వర్షాలు, వరదలను తట్టుకునే రోడ్ల నిర్మాణం.. ఎక్కువకాలం మన్నికగా ఉండే మెటీరియల్ వినియోగం.. AI ఆధారిత ట్రాఫిక్ నియంత్రణ.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో శాస్త్రీయ మార్పులు.. పాదచారులు, సైక్లిస్టులకు ప్రత్యేక మార్గాలు.. వీటిని తెలంగాణ రోడ్ల అభివృద్ధిలో భాగం చేయాలి.
రోడ్లు ఎన్ని కిలోమీటర్లు నిర్మించామన్నది మాత్రమే అభివృద్ధికి కొలమానం కాదు. ఆ రోడ్లపై ఎంతమంది సురక్షితంగా ప్రయాణిస్తున్నారు? ఎంతమంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి? సామాన్యుడి ప్రయాణం ఎంత సులభమైంది? అన్నదే అసలైన అభివృద్ధికి కొలమానం. అభివృద్ధి పేరుతో రోడ్లు నిర్మించడం ఎంత ముఖ్యమో.. ఆ రోడ్లపై ప్రజల ప్రాణాలను కాపాడటం కూడా అంతే ముఖ్యం. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు తెలంగాణ రోడ్ల అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందా?
2) సాగర్ నీటిపై ఏపీ కన్ను.. తెలంగాణ నీటి హక్కులకు ముప్పు!
నాగార్జునసాగర్ జలాశయం.. తెలంగాణకు కేవలం ఒక నీటి ప్రాజెక్టు మాత్రమే కాదు. రాష్ట్ర తాగునీటి అవసరాలకు, సాగునీటి భద్రతకు అత్యంత కీలకమైన జలవనరు.అలాంటి నాగార్జునసాగర్ నీటి వినియోగంపై ఇప్పుడు మరోసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం మొదలైంది.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు తెలంగాణకు ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది.
అసలు ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ఎందుకు అభ్యంతరం చెబుతోంది? దీని వెనుక ఉన్న అసలు సమస్య ఏమిటి?పల్నాడు జిల్లాలోని 363 గ్రామాలకు, 11 మండలాల్లో నివసిస్తున్న సుమారు 10 లక్షల మందికి తాగునీరు అందించాలనేది ఏపీ ప్రభుత్వ లక్ష్యం.
దీని కోసం నాగార్జునసాగర్ రిజర్వాయర్ సమీపంలోని విజయపురి సౌత్ వద్ద దాదాపు రూ.1,200 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మిస్తోంది.ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 160 మిలియన్ లీటర్ల నీటిని తరలించాలని ప్రతిపాదించారు. అంటే ఏడాదికి సుమారు 1.865 టీఎంసీల నీరు అవసరమవుతుంది.
ఇక్కడే అసలు వివాదం మొదలైంది.నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ స్థాయి 155.48 మీటర్లు. కానీ ఏపీ నిర్మిస్తున్న ఇన్‌టేక్ వెల్‌లో అత్యంత దిగువన ఉన్న ఓపెనింగ్‌ను 150.45 మీటర్ల వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ అధికారులు గుర్తించారు.
అంటే జలాశయం డెడ్ స్టోరేజీ స్థాయికి కూడా దిగువ నుంచి నీటిని తీసుకునేలా నిర్మాణం జరుగుతోందన్నది తెలంగాణ అభ్యంతరం.ఇది కేవలం నీటిని తోడుకునే అంశం మాత్రమే కాదు. జలాశయంలో నీటి నియంత్రణ, నిర్వహణ, భద్రతపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ముఖ్యంగా నీటి నిల్వలు తగ్గిన సమయంలో ఇలాంటి నిర్మాణాల ప్రభావం ఏమిటన్నది సాంకేతికంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది.నాగార్జునసాగర్ నీరు ఉమ్మడి కృష్ణా నదీ జలాల వ్యవస్థలో భాగం. రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణలో కృష్ణా బోర్డు పాత్ర కీలకం.ఏపీ చేపడుతున్న ఈ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను కృష్ణా బోర్డు, కేంద్ర జల సంఘం పరిశీలించి, అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే ముందుకు వెళ్లాలన్నది తెలంగాణ వాదన.
ఏపీ మాత్రం తమకు కేటాయించిన నీటిలో నుంచే పల్నాడు ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని చెబుతోంది. తమకు 2.64 టీఎంసీల కేటాయింపు ఉందని, ఈ ప్రాజెక్టుకు 1.865 టీఎంసీలే అవసరమని వాదిస్తోంది.
అయితే నీటి కేటాయింపులు ఉన్నాయనే కారణంతో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతుల అవసరం తీరిపోతుందా? ఇదే ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న.
తెలంగాణ ప్రయోజనాల కోణంలో ఈ వివాదం ఎందుకు కీలకం?నాగార్జునసాగర్ నీరు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల తాగునీటి, సాగునీటి అవసరాలకు కీలకం. ముఖ్యంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా ఈ జలాశయం ప్రాధాన్యత కలిగి ఉంది.భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే నీటి నిల్వలపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. అలాంటి సమయంలో జలాశయం నుంచి నీటిని ఎక్కడి నుంచి, ఎంత పరిమాణంలో, ఏ నిబంధనల ప్రకారం తీసుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి.
ఒక రాష్ట్రం తాగునీటి అవసరాలను తీర్చుకోవడం ఎంత ముఖ్యమో.. మరో రాష్ట్రం నీటి హక్కులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం.అందుకే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కోరుతోంది. ఇది ఏపీ ప్రజలకు తాగునీరు అందించడాన్ని వ్యతిరేకించే అంశం కాదు. ఉమ్మడి జలవనరుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా, చట్టబద్ధమైన అనుమతులు, సాంకేతిక పరిశీలన, రెండు రాష్ట్రాల హక్కులను పరిగణనలోకి తీసుకోవాలన్నది తెలంగాణ అభ్యంతరం.
సాగర్ నీటిపై తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కృష్ణా బోర్డు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుంది? ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలే కీలకంగా మారాయి.
3) అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా.. బస్తీల్లో బాంబులా?
ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చే వలస కార్మికులకు చిన్న గ్యాస్ సిలిండర్లు అవసరం. తక్కువ ఆదాయం.. అద్దె గదుల్లో నివాసం.. ఒకే గదిలో నలుగురైదుగురు కలిసి జీవనం. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సిలిండర్లతో వంట చేసుకోవడం వారికి సౌకర్యంగా ఉంటుంది. కానీ ఇదే అవసరాన్ని కొందరు అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. జనావాసాల మధ్యే ప్రమాదకరమైన గ్యాస్ రీఫిల్లింగ్ దందా సాగిస్తున్నారు.
హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో తాజాగా బయటపడిన ఘటన ఈ అక్రమ వ్యాపారం తీవ్రతను మరోసారి బయటపెట్టింది. గృహ వినియోగ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్‌ను అక్రమంగా బదిలీ చేస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి, 46 నిండు గ్యాస్ సిలిండర్లు, 35 ఖాళీ మూడు కిలోల సిలిండర్లు, ఒక ఐదు కిలోల సిలిండర్‌తో పాటు రీఫిల్లింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది ఒక్క లంగర్హౌస్కే పరిమితమైన సమస్య కాదు. నగరంలోని బస్తీలు, రద్దీ ప్రాంతాల్లో చిన్న సిలిండర్లకు డిమాండ్ ఉండటంతో అనధికారికంగా గ్యాస్ నింపి విక్రయించే కేంద్రాలు పనిచేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్‌లో ఇలాంటి కేంద్రాలు ఎన్ని ఉన్నాయనే దానిపై సమగ్ర అధికారిక లెక్కలు అందుబాటులో లేవు.
హైదరాబాద్‌లో నిర్మాణ రంగం, హోటళ్లు, చిన్న పరిశ్రమలు, ఫుడ్ స్టాళ్లు, ఇతర అసంఘటిత రంగాల్లో లక్షలాది మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది చిన్న సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వలస కార్మికుల సంఖ్య 8 నుంచి 10 లక్షల వరకు ఉండొచ్చు. అయితే వీరందరూ అక్రమ రీఫిల్లింగ్ గ్యాస్‌పైనే ఆధారపడుతున్నారని చెప్పడానికి ఆధారాలు లేవు.
ఈ డిమాండ్ వెనుకే అక్రమ వ్యాపారానికి అవకాశం ఏర్పడుతోంది. గృహ వినియోగ సిలిండర్ల నుంచి గ్యాస్‌ను చిన్న సిలిండర్లలోకి బదిలీ చేసి, వాటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐదు కిలోల రీఫిల్‌కు రూ.600 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యాపారంలో అసలు సమస్య డబ్బు కాదు.. భద్రత. సరైన పరికరాలు, శిక్షణ, భద్రతా ప్రమాణాలు లేకుండా జనావాసాల మధ్య గ్యాస్ బదిలీ చేస్తే చిన్న లీకేజీ కూడా పెద్ద అగ్నిప్రమాదానికి దారితీయవచ్చు. పక్కనే ఇళ్లు, దుకాణాలు ఉంటే ప్రమాదం మరింత తీవ్రంగా మారుతుంది. పిల్లలు, వృద్ధులు, స్థానిక కుటుంబాలు ఎలాంటి తప్పు చేయకపోయినా ప్రాణాపాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే చిన్న సిలిండర్లు వాడుతున్న పేద కార్మికులను మాత్రమే తప్పుపట్టడం పరిష్కారం కాదు. వారికి చట్టబద్ధంగా, సురక్షితంగా, అందుబాటు ధరలో గ్యాస్ లభించే వ్యవస్థను బలోపేతం చేయాలి. అదే సమయంలో గృహ వినియోగ సిలిండర్లు అక్రమ వ్యాపారుల చేతుల్లోకి ఎలా చేరుతున్నాయో అధికారులు గుర్తించాలి. గ్యాస్ ఏజెన్సీల సరఫరా వ్యవస్థలో అక్రమాలు ఉన్నాయా? అనధికార కేంద్రాలకు గ్యాస్ ఎవరు అందిస్తున్నారు? నగరవ్యాప్తంగా తనిఖీలు ఎందుకు సమర్థంగా జరగడం లేదు?
అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలపై దాడులు చేయడంతో పాటు వాటి వెనుక ఉన్న సరఫరా నెట్‌వర్క్‌ను కూడా వెలికితీయాలి. ఎందుకంటే కొందరికి ఇది లాభదాయకమైన వ్యాపారం కావచ్చు. కానీ ఆ కేంద్రాల పక్కనే నివసించే ప్రజలకు మాత్రం ప్రతి రోజూ ప్రాణభయం!
