
కుమారుడు ఇజాన్ తో కలిసి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(ఫొటో కర్టసీ : సానియామీర్జా ఇన్ స్టాగ్రామ్)
విమానాల గర్జనలు,క్షిపణి శకలాలు…దుబాయ్ నుంచి తిరిగొచ్చిన సానియా మీర్జా
దుబాయ్‌లో యుద్ధ భయం : భద్రత కోసం హైదరాబాద్‌కు
దుబాయ్ లో అనిశ్చిత పరిస్థితులున్నాయి...
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో దుబాయ్ ప్రాంతంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని సానియా చెప్పారు. యుద్ధం నేపథ్యంలో రమజాన్ ఈద్ పండుగకు ముందు ఆమె హైదరాబాద్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు.దుబాయ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం పండుగ సమయంలో తన కొడుకు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి వీలుగా హైదరాబాద్ కు తిరిగి వచ్చానన్నారు. ‘‘దుబాయ్ లోని అల్ బర్షా ప్రాంతంలోని తన ఇంటి సమీపంలో ఆకాశంలో యుద్ధ విమానాలు ఎగరడం, వాటిని అడ్డగించడం చూశాను, ఆ తర్వాతే తాను భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను’’అని సానియా వెల్లడించారు.
ఇంటి సమీపంలోనే క్షిపణి శకలాలు పడ్డాయి...
దుబాయ్ లో అడ్డగించిన ఒక క్షిపణి శకలాలు తాను నివసించే ఇంటి ప్రదేశానికి సమీపంలోనే పడ్డాయని సానియామీర్జా చెప్పారు. ‘‘మా ఇంటి పైన యుద్ధ విమానాల శబ్దం విన్నాం, వాటిని అడ్డగించడం చూశాం. మేం నివసించే చోటు నుంచి సుమారు 400-500 మీటర్ల దూరంలో శకలాలు పడ్డాయి’’ అని సానియా పేర్కొన్నారు. దుబాయ్ లో పరిస్థితి అనిశ్చితంగా మారడంతో తాను హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్లు సానియా మీర్జా వివరించారు.‘‘ దుబాయ్ నా రెండో ఇల్లు. కొన్ని సంఘటనలు జరిగాయి, ఆ సమయంలో తిరిగి వచ్చేయడమే మంచిదని నేను భావించాను. మాకు అభద్రతగా అనిపించలేదు, కానీ అనిశ్చితిగా అనిపించింది’’అని ఆమె పేర్కొన్నారు.దుబాయ్‌లోని తన కుమారుడి పాఠశాల వచ్చే వారం తిరిగి ప్రారంభం కానుందని, అయితే తాను ఎప్పుడు తిరిగి వెళ్లాలో నిర్ణయించుకునే ముందు పరిస్థితిని గమనిస్తానని సానియా మీర్జా పేర్కొన్నారు.పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని ఆశిస్తున్నానని ఆమె అన్నారు.
దుబాయ్‌లో సానియా మీర్జా నివాసం
పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో 2010వ సంవత్సరంలో వివాహం తర్వాత సానియా మీర్జా దుబాయ్‌కి వెళ్లారు. భద్రతాపరమైన ఆందోళనల కారణంగా పాకిస్థాన్‌లో శాశ్వతంగా స్థిరపడకుండా ఉండేందుకు, దుబాయ్ నగరం చివరికి ఆమె ప్రధాన నివాసంగా మారింది.ఆమె ప్రస్తుతం తన కుమారుడు ఇజాన్‌తో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నారు.విడాకుల తర్వాత సానియా దుబాయ్ నగరంలోని ఒక కొత్త విలాసవంతమైన విల్లాలోకి మారి, ఒంటరి తల్లిగా తన కొడుకును పెంచుకుంటూనే తన వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
Next Story

