
హైదరాబాద్‌లో రాజకీయాల కోసం లక్ష్యంగా మారిన రోహింగ్యాలు
మయన్మార్ నుంచి కేవలం కట్టుబట్టలతో వచ్చిన వీరికి నగరంలో బతకడానికి కావాల్సిన నైపుణ్యాలు, వనరులు లేవు
నూర్ మొహమ్మద్ (42) (పేర్లు మార్చబడ్డాయి) రంజాన్ సందర్భంగా బంగ్లాదేశ్‌లో ఉన్న తన తల్లికి ఈసారి ఒక్క రూపాయి కూడా పంపలేకపోయానని చెప్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. చెత్త లో సామాన్లు ఏరి అమ్మటం, నిర్మాణ స్థలాల్లో కూలీగా పని చేయడం ఆయన జీవనాధారం. రోహింగ్యా శరణార్థి అయిన ఆయనకు ఆ పనులు దొరకటం ఇటీవలి కాలంలో కష్ట సాధ్యమవుతోంది. అడ్డ దగ్గర తాను కూలీకి వెళ్తే అడ్డుకుంటున్నారని, చివరికి చెత్త ఏరే పని కూడా చేసుకోనివ్వటం లేదని వాపోయారు.
“ప్రతి సంవత్సరం పండుగ సమయంలో నా తల్లికి రు. 5,000 పంపేవాడిని. మేస్త్రీ పని దొరకనప్పుడు చెత్త సేకరించటానికి వెళ్ళినా అడ్డుకుంటున్నారు, వేధిస్తున్నారు. నా 18 ఏళ్ల కొడుకును నలుగురు చెత్త ఏరుతుండగా కొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వాళ్ళు లేరు. పోలీసులు తరచూ పత్రాలు చూపమంటారు. ఐక్య రాజ్య సమితి శరణార్థుల కమిషన్ ఇచ్చిన గుర్తింపు కార్డు తప్ప నా దగ్గర మరోటి లేదు,” అని ఆవేదనతో చెప్పాడు.
నూర్ రోజు సంపాదన రు. 300 నుంచి రు. 500 మధ్య ఉంటుంది. ఆ బొటా బొటి సంపాదన లోంచే రు. 3,250 ఇంటి అద్దె చెల్లిస్తున్నట్టు ఆయన చెప్పాడు.
హైదరాబాద్ నగరంలో గత 10 లేదా 15 ఏళ్లుగా బ్రతుకుతున్న 6,900 మంది లో కేవలం 100 నుంచి 150 మంది మాత్రమే కొంత మేరకైనా చదువుకున్నారు. వారిలో ఒకరు ముగ్గురు పిల్లల తల్లి ఒంటరి మహిళ రిజ్వానా. ఆమె 2012 లో తన తోటి గ్రామస్థులతో కలిసి మయన్మార్ నుంచి హైదరాబాద్ వచ్చారు.
“ఇది వరకు హాస్పిటల్ లో పనిచేసేదాన్ని. రాత్రి పూట ఆలస్యంగా బయటకు రావద్దని పోలీసులు వారించడంతో ఆ పని మానేశాను. ఇప్పుడు రాత్రి పూట బయటకు రావటానికి భయంగా ఉంటుంది. మా అందరికీ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే పని ఎలా దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన తొలి నాళ్ళలో మాపై ఇన్ని నియంత్రణలు ఉండేవి కాదు. దీనితో ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగిపోయాయి. జీవితం నెట్టుకు రావటం కష్టంగా ఉంది,” అని ఆమె చెబుతొంది.
“నేను పదో తరగతి చదవుతుండగా అక్కడ హత్యాకాండ మొదలైంది. అప్పుడే ఇక్కడికి పారిపోయి వచ్చాము. హత్యలు మొదలైనప్పుడు మా ఊరికి కొంత దూరంలో మరో ప్రాంతంలో ట్యూషన్ లు చెప్తున్నాను. కుటుంబంతో సంబంధం కోల్పోయిన నేను మరో రెండేళ్ళ తర్వాతే నా తల్లిని కలవగలిగాను. అప్పటికి నేను ఇద్దరు పిల్లల తల్లిని,” అని రిజ్వానా తన గతాన్ని గుర్తు చేసుకున్నారు.
మయన్మార్ నుంచి కేవలం కట్టుబట్టలతో వచ్చిన వీరికి నగరంలో బతకడానికి కావాల్సిన నైపుణ్యాలు, వనరులు లేవు. వీరిలో ఎక్కువ మంది రైతులు కావడంతో వారికి పట్టణాలలో బ్రతకటానికి తగిన నైపుణ్యాలు లేవు. నిర్మాణ పనులు, పాత సామాన్లు లేదా కూరగాయల అమ్మకం లాంటివి చేస్తూ వీళ్ళు తమను తాము పోషించుకుంటున్నారు.
రిజ్వానా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయనే ఆలోచనతో ఇంటర్ చదువుతోంది. తన ప్రస్తుత సంపాదన రు. 12,000. ఈ ఆదాయంతో ముగ్గురు పిల్లలు, తన తల్లి జీవించటం కష్టమవుతోంది.
మయన్మార్ లో ఎదుర్కున్న హింస జ్ఞాపకాలు వృద్దులు, యువకులను ఇంకా కలవరపెడుతున్నాయి. 1956లో పుట్టిన మొహమ్మద్ ఇస్మాయిల్ తన గ్రామస్తులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. తన కుటుంబంలోని 25 మందిని ఆ నరసంహారం లో కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అమిన్ మొహమ్మద్ (75) చెత్త ఏరుతుండగా ఒక హిందూ మహిళ తనకు భోజనం పెట్టిందని గుర్తు చేసుకున్నారు. “ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లు. నిబంధనలు కఠినతరం అవ్వకముందు నేను ముంబై, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్ వెళ్ళి సంపాదించుకునే వాళ్లం,” అని చెప్పాడు.
గుర్తింపు పత్రాలు లేకపోయినా మొబైల్ సిమ్ కార్డులు ఎలా తీసుకున్నారని అడగ్గా, స్థానికుల సహాయం వల్ల తీసుకున్నామని చెప్పారు. అయితే కొందరు రు. 800 వరకు డబ్బులు ఇచ్చి సిమ్ కార్డు తీసుకున్నామని చెప్పారు. 'యునైటెడ్ నేషన్స్ హై కమీషన్ ఫర్ రిఫ్యూజీస్' శరణార్థులుగా మారి (Modern Architects of Rural India), కోవా COVA (Confederation of Voluntary Associations) లాంటి సంస్థల ద్వారా సహాయం అందిస్తోంది. రోహింగ్యాలు ఎక్కువగా బాలాపూర్ ప్రాంతంలోని సుమారు 30 కాలనీల్లో నివసిస్తున్నారు.
వీడని స్వదేశం తిరిగి వెళ్ళే ఆలోచన:
వీరికి తమ దేశం వెళ్లాలనే కోరిక మాత్రం వీడటం లేదు. ఢిల్లీ, బెంగళూరు, బంగ్లాదేశ్‌లో ఉన్న బంధువులతో సంబంధాలు కొనసాగిస్తున్న అమిన్ మొహమ్మద్ ఇతరులు మయన్మార్‌లో పరిస్థితులను గాజాతో పోలుస్తున్నాడు.
మయన్మార్‌లో ఉన్న తమ వారితో నెలకు ఒకసారి వాట్సాప్‌లో మాట్లాడగలుగుతున్నాం అని మరో మహిళ షంషిదా చెబుతోంది. “అక్కడ ఇంటర్నెట్ తరచూ ఆఫ్ చేస్తుంటారు. మా కుటుంబానికి ఉన్న ఐదు ఎకరాల భూమిని బౌద్ధులు ఆక్రమించారు. ఇక్కడ మేము సరిగ్గా వెలుగు లేని చిన్న గదిలో జీవించాల్సి వస్తోంది,” అని ఆమె అన్నారు.
వికలాంగుడయిన తన కొడుకు చికిత్స ఆమె కుటుంబానికి కష్టమౌతోంది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ నుంచి వీరికి అందే సహాయం నాలుగు నెలల క్రితం ఆగిపోయింది. నెలకు రు. 9000 మాత్రమే సంపాదించే తండ్రి మహమ్మద్ అయూబ్ కొడుకుకు రు. 5,000 ఖర్చు చేయటం కష్టమవుతోంది. నిలోఫర్ హాస్పిటల్‌లో డాక్టర్లు మెదడు స్కాన్ చేయమని సిఫార్సు చేశారు.
స్వదేశం వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు అనేది అందరి మాట.
ఆరోగ్య సౌకర్యాలు-నిబంధనలు:
గత సంవత్సరం ఆఖరు వరకు శరణార్థులు హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పొందేవారు. ఆధార్ కార్డు తప్పనిసరి చేయటంతో ఆ సౌకర్యానికి వారు ప్రస్తుతం నోచుకోవటం లేదు.
తన కుమారుడి చికిత్స కోసం అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నట్టు షంషిదా భర్త మొహమ్మద్ అయూబ్ చెబుతున్నారు. “హిందూ, ముస్లిం కాంట్రాక్టర్లు స్థానికులతో సమానంగా మాకు పని కల్పిస్తూ సాయం చేస్తున్నారు. కనీస జీవనం కష్టమవుతున్న స్థితిలో నా కొడుకుకు చికిత్స ఎలా చేయించాలో తెలియటం లేదు,” అని ఆవేదనతో అన్నారు.
58 ఏళ్ల కాదిర్ హుస్సేన్ గత సంవత్సరం వరకు ఈ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందేదని గుర్తు చేశారు.
సఫూరా ఖాతూన్ (35) తన కుమార్తెకు గుండెలో రంధ్రం ఉందని, చికిత్సకు రు. 8 లక్షలు కావాలని డాక్టర్లు చెప్పారని తెలిపింది. అవసరమైన సర్జరీ అయినా వాయిదా వేస్తూ ప్రస్తుతానికి మందులతో నెట్టుకొస్తున్నారు.
విద్వేష ప్రచార ప్రభావం:
రోహింగ్యాలు నివసించే ప్రాంతాలకు సమీపంలో ‘ధర్మ రక్షణ సభ’ నిర్వహించడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రయత్నించడంతో వారి పరిస్థితి మరో సారి వార్తల్లో నిలిచింది. ఆ సభకు పోలీసులు అనుమతి నిరాకరించటంతో లాయర్ కరుణసాగర్ హైకోర్టులో కేసు వేశారు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలుగచేయం అని హామీ ఇవ్వటంతో సభకు హై కోర్టు అనుమతించింది. కానీ ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతూ ప్రసంగించిన నాయకులు స్థానిక ముస్లింలు, బంగ్లాదేశ్ వాసులు, మయన్మార్ నుంచి వచ్చిన కాందిశీకులకు మధ్య ఎటువంటి తేడా లేకుండా అందరినీ ఒకే గాటిన కట్టి అందరి మీద సమానంగా విషం చిమ్మారు.
ఇది స్థానిక మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న రాజకీయ ప్రేరేపిత ప్రయత్నం కాదని కరుణ సాగర్ అన్నారు.
“రోహింగ్యాలు అందరినీ గుర్తించాం. వారికి ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ జారీ చేసిన కార్డులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వారి దగ్గర మొబైల్ సిమ్ కార్డు లేదా వాహనాలు ఉండకూడదు. కానీ స్థానికుల సహాయంతో వాటిని తీసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉండే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం,” అని బాలాపూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం. నవీన్ కుమార్ చెప్పారు.
డిపోర్ట్ చేస్తారనే భయంతో ఎప్పుడు ఎవరితో ముఖ్యంగా స్థానికులతో రోహింగ్యాలు గొడవలకు పోరని ఆయన అన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి ఆయన బాలాపూర్ ప్రాంతంలో పనిచేస్తున్నారు.
తగ్గుముఖం పట్టిన సహాయం:
హైదరాబాద్ లో రోహింగ్యాలు మాత్రమే కాకుండా 12 దేశాల నుంచి శరణార్థులు ఉన్నారని కోవా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మజర్ హుస్సేన్ అన్నారు.
“వాళ్ళు 2010 లో మొదట వచ్చినప్పుడు వారి సంఖ్య 50 నుంచి 60 మాత్రమే. 2011 లో వారి సంఖ్య 1,500 నుంచి 2,000 మధ్యకు చేరింది. 2015-16 లో జరిగిన వారి మరో నరసంహారం వలన మరో 4,000 మంది తల దాచుకోవటానికి హైదరాబాద్ వచ్చారు. దీంతో వారి సంఖ్య 6,000 దాటింది,” అని ఆయన చెప్పారు.
వాళ్లు ఎక్కువగా బాలాపూర్, బాబా నగర్, షాహీన్ నగర్ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారి సంఖ్య పెరగటంతో పని కోసం, అద్దె ఇంటి కోసం వారికి స్థానికులకు మధ్య పోటీ పెరిగింది. బయటి నుండి వచ్చిన వీరి వలన తమకు పని దొరకటం లేదని, అద్దెలు పెరిగాయనే అసంతృప్తి పెరిగింది.
దాతలు చేసే సహాయం రంజాన్ మాసం లోనే అందుతుంది. అదీ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు వాళ్ళు గాజాలో పాలస్తీనీయుల సమస్యలపై దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితిలో సుమారు 1,200 మంది బంగ్లాదేశ్ వెళ్లిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి.
(గోప్యత కోసం కొన్ని పేర్లు మార్చబడ్డాయి)

