రోహిత్ రెడ్డికి రిమాండ్.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు
x

రోహిత్ రెడ్డికి రిమాండ్.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు

మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనలో కాల్పులు, డ్రగ్స్ పార్టీ, కొకైన్ స్వాధీనం వంటి అంశాలు పోలీసుల రిమాండ్ రిపోర్టులో బయటపడ్డాయి.


మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్ విధించగా, పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ పార్టీ, కాల్పులు, కొకైన్ స్వాధీనం వంటి అంశాలు కేసును మరింత తీవ్రంగా మార్చాయి. వీకెండ్ సందర్భంగా ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ టీం పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించే సమయంలోనే బుల్లెట్ శబ్దం వినిపించిందని రిపోర్టులో పేర్కొన్నారు. పోలీసులు తాము వచ్చామని, కాల్పులు చేయవద్దని హెచ్చరించినప్పటికీ మరో రెండు సార్లు కాల్పులు జరిగాయని తెలిపారు. ఆ సమయంలో కాల్పులు కొనసాగించాలని, జరిగినది తానే చూసుకుంటానని ఎవరో గట్టిగా మాట్లాడినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో కాల్పులు ఆగిపోయాయని తెలిపారు.

తుపాకీ స్వాధీనం.. పలువురు అదుపులో

సెర్చ్ వారెంట్‌తో ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అక్కడ ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. బాత్రూం దగ్గర నమిత్ శర్మ చేతిలో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. జర్మన్ మేడ్ పాయింట్ .32 రివాల్వర్‌ను కూడా పట్టుకున్నారు. ఫామ్‌హౌస్‌లో ఒక మహిళతో పాటు మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

కొకైన్ వ్యవహారం వెలుగులోకి

విచారణ ప్రారంభంలో ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే పదేపదే ప్రశ్నించడంతో సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి రెండు గ్రాముల కొకైన్ బయటపడింది. కొకైన్ ఎవరూ తెచ్చారన్న ప్రశ్నకు మొదట సమాధానం రాలేదు. తర్వాత రోహిత్ రెడ్డి డ్రైవర్‌ను విచారించగా విషయం బయటపడింది. చివరికి కౌశిక్ అనే వ్యక్తి తానే కొకైన్ తీసుకొచ్చినట్లు అంగీకరించాడు. సిమ్లా బిజినెస్ ట్రిప్ సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.

డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్

ఫామ్‌హౌస్‌లో ఉన్న 11 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా పలువురికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రెండోసారి ఎర్రగడ్డ ఆసుపత్రిలో నిర్వహించిన రక్త పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌కు కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులో వెల్లడైంది. మొత్తం ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, పుట్టా మహేశ్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి ఉన్నారు.

కాల్పులపై కీలక వివరాలు

కాల్పులు జరిపిన వ్యక్తిగా నమిత్ శర్మను పోలీసులు గుర్తించారు. ఫామ్‌హౌస్‌లోకి వస్తున్న పోలీసులను భయపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఈ ఘటనలో మద్యంలో కొకైన్ కలిపి సేవించినట్లు కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Read More
Next Story