
ఉద్యోగులకు రు. 713 కోట్లు విడుదల
డిసెంబర్ మాసానికి సంబంధించిన బకాయిలు, బిల్లుల చెల్లింపులకు ఈ మొత్తాన్ని ఆర్ధికశాఖ బుధవారం మంజూరుచేసింది
తెలంగాణ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు, బకాయిల చెల్లింపులకోసం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రు. 713 కోట్లు విడుదలచేసింది. డిసెంబర్ మాసానికి సంబంధించిన బకాయిలు, బిల్లుల చెల్లింపులకు ఈ మొత్తాన్ని ఆర్ధికశాఖ బుధవారం మంజూరుచేసింది. ట్రెజరీల నుండి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు దామాషా పద్దతిలో నిధులు బ్యాంకుఖాతాల్లో జమవుతాయి. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, బిల్లులు కొండలాగ పేరుకుపోయాయి. సుమారు 20వేలమంది ఉద్యోగులకు దాదాపు రు. 12 వేల కోట్లను ప్రభుత్వం బకాయిలు పెట్టేసింది. ప్రభుత్వం దగ్గర నిధులు లేని కారణంగానే బకాయిలు పేరుకుపోయాయి.
కేసీఆర్ హయాంలో 2021లో రిటైర్ అవ్వాల్సిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటానికి నిధులు లేనికారణంగా వారి రిటైర్మెంట్ వయుసును మూడేళ్ళకు పెంచారు. అంటే 58 ఏళ్ళకు రిటైర్ అవ్వాల్సిన ఉద్యోగుల సర్వీసును 61 ఏళ్ళకు పెంచారు. 2023లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో చాలామంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఉద్యోగులు రిటైర్ అయినపుడు చెల్లించాల్సిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్మెంట్ తదితరాలకు రేవంత్ ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవటంతో వేలాది కోట్ల రూపాయలను బకాయిలు పెట్టేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు చెల్లించలేకపోయిన కేసీఆర్ ప్రభుత్వం ఆ భారాన్ని రేవంత్ ప్రభుత్వం మీదకు తోసేసింది. అప్పటినుండి 2025, డిసెంబర్ వరకు సుమారు 14 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దశలవారీగా చెల్లింపులతో బకాయిలు రు. 12 వేల కోట్లకు తగ్గింది.
ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగుల బిల్లులు, బెనిఫిట్స్ పెండింగులో ఉండటంతో పెద్దఎత్తున ఆందోళన జరిగింది. దాంతో ఉద్యోగుల సంఘాల నేతలతో రేవంత్ మాట్లాడుతు నెలకు రు. 700 కోట్లచొప్పున బకాయిలు, బిల్లును చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం మొన్నటి ఆగష్టు నుండి ప్రతినెలా రు. 700 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇపుడు విడుదలైన రు. 713 కోట్లలో గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్, అడ్వాన్సులు ఉన్నాయి.

