గోషామహల్‌లో రూ.76.87 లక్షల నగదు స్వాధీనం
x

గోషామహల్‌లో రూ.76.87 లక్షల నగదు స్వాధీనం

సాధారణ తనిఖీల్లో గోషామహల్‌లో భారీ నగదు పట్టుబడింది. అనుమానాస్పదంగా తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


పోలింగ్ దగ్గర పడుతున్న వేళ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గోషామహల్‌లో నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 9 సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్యాన్‌బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచులతో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు గమనించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వారిని ఆపి పరిశీలించారు.

తనిఖీలో మూడు సంచుల్లో భారీగా నగదు ఉన్నట్టు బయటపడింది. మొత్తం నగదు విలువ రూ.76,87,650గా పోలీసులు నిర్ధారించారు. నగదు తరలింపు తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి పేర్లు జ్యోతిరామ్‌, గణపతి రామ్, మహేందర్‌గా పోలీసులు గుర్తించారు. వారిని గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

అయితే నగదుకు సంబంధించి సరైన వివరణ ఇవ్వలేకపోయారని పోలీసులు తెలిపారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు కూడా చూపలేకపోయారు. దీంతో నగదును సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నగదును ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించనున్నట్టు గోషామహల్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అక్రమ నగదు తరలింపులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

Read More
Next Story