రేవంత్ ప్రభుత్వానికి ఆర్టీసీ సమ్మె హెచ్చరిక
x

రేవంత్ ప్రభుత్వానికి ఆర్టీసీ సమ్మె హెచ్చరిక

సమ్మెలో పాల్గొనే విషయమై ఆర్టీసీలోని వివిధ యూనియన్ల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి


ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు రెడీ అవుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండుతో సమ్మెకు సిద్ధపడుతున్నారు. సమ్మెలో పాల్గొనే విషయమై ఆర్టీసీలోని వివిధ యూనియన్ల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఉద్యోగుల, కార్మికుల పనిభారం తగ్గించటం కోసం సంస్దలో అవసరమైన ఉద్యోగాలను భర్తీచేయటం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేయటం లాంటి, పీఆర్సీ అమల్లాంటి అనేక డిమాండ్లను యూనియన్ల నేతలు రేవంత్ ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నారు.

దశాబ్దాల క్రితమే అంటే సమైక రాష్ట్రంలోనే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడుప్పుడు నడుస్తున్న సంవత్సరాల్లో మాత్రమే లాభాల్లో పనిచేస్తున్నది. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పండుగలు లేకపోతే ఏదైనా జాతరలు అదీకాకపోతే ఏవైనా ప్రత్యేక దినాల్లో బస్సుల్లో ఎక్కే ప్రయాణీకుల కారణంగా ఆ పర్టిక్యులర్ ఏడాది మాత్రమే సంస్ధకు బాగా ఆదాయం వచ్చేది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందన్నది వాస్తవం. దీనికి అదనంగా సంస్ధలోని ఉద్యోగుల్లో కొందరి నిర్లక్ష్యం, దీర్ఘకాలంగా జరిగిన సమ్మెల్లాంటి అనేక కారణాలతో మరింత నష్టాల్లో కూరుకుపోయింది.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్టీసీని ఉద్ధిరించేస్ధామని పార్టీలు, అధినేతలు ఇచ్చే హామీలు నీటిమీద రాతల్లాగే తయారయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత డిమాండ్ల సాధన పేరుతో ఆర్టీసీలోని మెజారిటి కార్మిక యూనియన్లు సుమారు 50 రోజులు సమ్మెచేశాయి. దానిదెబ్బకు సంస్ధ ఇప్పటికీ కోలేకపోతోంది. దీనిమీద అదనంగా గడచిన రెండళ్ళుగా అమలవుతున్న మహిళలకు ఉచితబస్సు పథకం గోరుచుట్టుమీద రోకటిపోటులాగ తయారైంది. చెప్పుకోవటానికి పథకం అమలు ఘనంగానే ఉన్నా ఆచరణలో ఆర్టీసీని బాగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. కోట్లాదిమంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నా వారు చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వం ఆర్టీసీకి తిరిగి రీఎంబర్స్ చేయాలి. అయితే ఏ నెల డబ్బులు మరుసటి నెలలోనే ప్రభుత్వం చెల్లించకపోవటంతో సంస్ధ మరింతగా నష్టాల్లో కూరుకుపోతోంది.

ఈ సమస్యకు 2023 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అదనం. రెండేళ్ళ క్రితం రేవంత్ ఇచ్చిన హామీలను అమలుచేయమనే ఆర్టీసీలోని కార్మిక, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం హైదరాబాద్ లోని ఉద్యోగ, కార్మికుల్లో కొందరు ఇందిరాపార్క్ దగ్గర పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు.

విలీనం చేయాలి : అశ్వత్ధామ

తమ డిమాండ్లగురించి ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్ధామరెడ్డి తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నాము’’ అని చెప్పారు. ‘‘తమ డిమాండ్లలో అన్నింటికన్నా కీలకమైనది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటమే’’ అని తెలిపారు. ‘‘ఈ డిమాండ్ దశాబ్దాలుగా కార్మికుల, ఉద్యోగుల కలగా మిగిలిపోతోంది’’ అని అన్నారు. రెడ్డి మాట్లాడుతు ‘‘చనిపోయిన వారి కుటుంబాల్లోని సభ్యులకు ఇచ్చే కారుణ్య నియామాకాలను రెగ్యులర్ ఉద్యోగులుగా కాకుండా కాంట్రాక్టుపద్దతిలో ప్రభుత్వం చేస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘కారణ్య నియామకాలను కాంట్రాక్టు పద్దతిలో కాకుండా రెగ్యులర్ పద్దతిలోనే నియమించాలి’’ అని డిమాండ్ చేశారు.

అలాగే 2019-24 మధ్య నిలిచిపోయిన కారుణ్య నియామకాలను వెంటనే పూర్తిచేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికి సుమారు 1500 కారుణ్యనియామకాలను కాంట్రాక్టుపద్దతిలో చేసినట్లు ఆరోపించారు. ఇక సంస్ధలో పనిభారం పెరిగిపోతోందన్నారు. ముఖ్యంగా 3 వేలమంది కండక్టర్లు, డ్రైవర్ల పనిగంటలు 11-15 గంటల మధ్యలో ఉన్నట్లు తెలిపారు. పెరిగిపోయిన పనిగంటల భారాన్ని తగ్గించి గతంలో లాగే 8 పనిగంటలనే వర్తింపచేయాలని రెడ్డి డిమాండ్ చేశారు. చివరకు సంస్ధలోని కార్మికులు, ఉద్యోగులకు వర్తింపచేయాల్సిన పీఆర్సీని వెంటనే అమలుచేయాలన్నారు. 2021 నుండి పీఆర్సీ పెండింగులోనే ఉందని, ఆ పీఆర్సీ అమలుకాకపోవటంతో 2025లో అమలుచేయాల్సిన మరో పీఆర్సీ కూడా పెండింగులోనే ఉన్నట్లు ఆరోపించారు. ఆర్టీసీలో ప్రతి నాలుగేళ్ళకు ఒక పీఆర్సీని అమలుచేయాలని వివరించారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి తగిన గడువిచ్చామని పట్టించుకోకపోత మార్చి 2వ వారంలో మిగిలిన యూనియన్లతో చర్చించి సమ్మెకు వెళతామని అశ్వత్ధామరెడ్డి చెప్పారు.

సమ్మె అవసరం లేదు : పొన్నం

ఆర్టీసీలో సమ్మె చేయాల్సిన అవసరం లేదని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. పొన్నం మీడియాతో మాట్లాడుతు తమ ప్రజాపాలనలో సమ్మెలకు తావులేదన్నారు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పిన మాటలను మంత్రి గుర్తుచేశారు. ఉద్యోగ, కార్మిక సంఘాలు ప్రస్తావిస్తున్న డిమాండ్లపై మార్చి 5,6 తేదీల్లో చర్చలు జరపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పైన చెప్పిన రెండురోజుల్లో సంఘాల నేతలు సచివాలయంకు వచ్చి తనతో చర్చలు జరపాలని మంత్రి ఆహ్వానించారు.

Read More
Next Story