మున్సిపల్ ఎన్నిక‌ల తర్వాత తొమ్మిది వేల కోట్ల రైతు భ‌రోసా: సిఎం రేవంత్ రెడ్డి
x

మున్సిపల్ ఎన్నిక‌ల తర్వాత తొమ్మిది వేల కోట్ల రైతు భ‌రోసా: సిఎం రేవంత్ రెడ్డి

తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ఆయన కోరారు


మున్సిపల్ ఎన్నిక‌లు ముగియ‌గానే తొమ్మిది వేల కోట్ల రైతు భ‌రోసా ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ మున్సిపాలిటీల్లో రు. 17,472 కోట్లు ఖర్చుపెట్టామని వచ్చే ఎనిమిది ఏళ్ళలో మున్సిపాలిటీల‌ను అద్దంలా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

మున్సిపల్ ఎన్నికలకు నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా బుధవారం నల్గొండ, మిర్యాలగూడ లో ప్రచారం నిర్వహించిన ఆయన మున్సిప‌ల్ శాఖ తన దగ్గరే ఉందని, మున్సిపాలిటీల అభివృద్ధి తన బాధ్య‌త‌ అని చెప్పారు. మొత్తం 123 మున్సిపాలిటీల పైన కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక అమలుచేస్తున్న పథకాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని ఆయన కోరారు.

“న‌ల్గొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో రు. 2028 కోట్లు ఖ‌ర్చు పెట్టాం. మిర్యాల‌గూడ లో రు. 295 కోట్ల ఖ‌ర్చు చేశాము. ఓటేసే ముందు స‌న్న‌బియ్యం, రేష‌న్ కార్డు, రైతు భోరోసా, రుణ‌మాఫీ, బ‌స్సు ప్ర‌యాణం, 70 వేల ప్ర‌భుత్వ ఉద్యోగాలు, ఇందిర‌మ్మ ఇళ్ల‌ను గుర్తు చేసుకోండి. ఈ ప్ర‌భుత్వం గిరిజునులు, పేద‌లు, ఆదివాసీలు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు, మైనార్టీల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు తీసుకువ‌చ్చింది. మా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను చూసి మున్సిపల్ ఎన్నిక‌ల్లో తీర్పు ఇవ్వాలి,” అని రేవంత్ అన్నారు.

బిఆర్ఎస్ హయాంలో ఇచ్చిన బ‌తుక‌మ్మ చీర‌ల గురించి ప్రస్తావిస్తూ, అవి దేనికైనా ప‌నికి వ‌చ్చాయా? సారె పెట్టిన‌ట్లుగా ఆడ‌బిడ్డ‌లు ఇందిర‌మ్మ చీర‌లు క‌ట్టుకుని వ‌చ్చారని సభలో ఉన్న మహిళలను ఉద్ధేశించి అన్నారు.

ఎస్ ఎల్ బీసీ ని పూర్తి చేయ‌కపోవటాన్ని ప్రస్తావిస్తూ 30 కిలో మీట‌ర్ల ట‌న్నెల్ ను గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం తవ్వితే దానిని పూర్తి చేయకుండా వదిలేశారని విమర్శించారు. “ఎస్ ఎల్ బీసీ ని రెండేళ్ల‌లో పూర్తి చేయాలకున్నా ప్ర‌మాదం జ‌రిగి 8 మంది చ‌నిపోయారు. జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు ఓట్లు ఎలా అడుగుతారు,” అని ప్రశ్నించారు.

రైతుల కోసమే ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ల‌క్షా ప‌దివేల కోట్లు ఖ‌ర్చు చేసిందని, మిర్యాల‌గూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని, బోన‌స్ తీసుకుంటున్న అత్య‌ధిక ల‌బ్దిదారులు మిర్యాల‌గూడాలోనే ఉన్నారని అన్నారు.

సభలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

Read More
Next Story