
హరీష్ రావు విచారణ గురించి సజ్జనార్ ఏమన్నారంటే..!
కీలక సాక్షులను సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని, దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని హరీష్ రావుకు స్పష్టమైన ఆదేశాలు
ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు ముంగళవారం విచారించారు. దాదాపు ఏడు గంటలపాటు సాగిన ఈ విచారణకు సంబంధించి హైదరాబాద్ సీపీ, సిట్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారు వీసీ సజ్జనార్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన విడుదల చేశారు. పలు ఆదేశాలతో ఆయనను పంపినట్లు తెలిపారు. అంతేకాకుండా పలు ప్రత్యేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మంగళవారం విచారణకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణ నిర్ణీత సమయంలో పూర్తికాగా, అనంతరం ఆయనకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. ‘‘2026 జనవరి 20న విచారణకు హాజరైన హరీష్ రావు సాయంత్రం తన కుమారుడి విమాన ప్రయాణం ఉందని దర్యాప్తు అధికారులకు తెలియజేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సిట్, విచారణను ముగించినట్టు స్పష్టం చేసింది. అవసరమైతే తదుపరి దర్యాప్తు నిమిత్తం మళ్లీ పిలుస్తామని ముందుగానే ఆయనకు తెలియజేశారు’’ అని సజ్జనార్ వివరించారు.
‘‘ఈ కేసుకు సంబంధించి కీలక సాక్షులను సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని, దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని హరీష్ రావుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మరో విషయం స్పష్టం చేశారు. ఈరోజు జరిగిన విచారణ కేవలం క్రైమ్ నం.243/2024 అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు మాత్రమే పరిమితం అని తెలిపారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేయడం, అనధికారికంగా నిఘా పెట్టడం వంటి తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది’’ అని ఆయన వివరించారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చి 10 నుంచి సమగ్ర దర్యాప్తు సాగుతోందని, ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన ఛార్జిషీటు దాఖలు చేసినట్టు సిట్ వెల్లడించింది. కేసుకు సంబంధించిన ఇతర కోణాలపై ఇంకా లోతైన విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనబెట్టి హరీష్ రావును విచారించారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని పోలీసులు ఖండించారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని, వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. చట్టబద్ధమైన ప్రక్రియలోనే దర్యాప్తు సాగుతోందని, ఎవరిపైనా రాజకీయ ఉద్దేశాలతో చర్యలు తీసుకోవడం లేదని సిట్ స్పష్టం చేయడంతో, ఈ వ్యవహారంపై స్పష్టత ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

