జర్నలిస్ట్‌లు ఎందుకు పారిపోతున్నారు?: సజ్జనార్
x

జర్నలిస్ట్‌లు ఎందుకు పారిపోతున్నారు?: సజ్జనార్

ఒక మహిళా అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్న సీపీ సజ్జనార్.


ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై కొన్ని ఛానెళ్లలో వచ్చిన వార్తా కథనాలు తీవ్ర దుమారం రేపాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. విచారణకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ రంగంలోకి దిగుతూనే ముగ్గురు జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేసింది. అంతేకాకుండా ఒక మీడియా ఛానెల్‌ కార్యాలయంలో సోదాలు కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్, బీజేపీ నేతలు, జర్నలిస్ట్ సంఘాల వారు తీవ్రంగా ఖండించారు. ఈ వివాదం తీవ్రతరం అవుతున్న క్రమంలో దీనిపై సీపీ సజ్జనార్ స్పందించారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. కేసు విచారణకు మీడియా ప్రతినిధులు సహకరించాలని కోరారు.

‘‘విచారణకు పిలిస్తే ఓ ఛానెల్ సీఈఓ ఎందుకు రావట్లేదు? రిపోర్టర్లు పాలాయన మంత్రం ఎందుకు జపిస్తున్నారు. అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకుని బ్యాంకాక్ పారిపోవడానికి ప్రయత్నిస్తుంటేనే ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. మరో రిపోర్టర్ ఏమో విచారణకు వస్తా అని చెప్పి.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అందుకే వారిని అరెస్ట్ చేశాం. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం. అన్నీ కూడా చట్ట ప్రకారమే చేస్తున్నాం. ప్రజా జీవితంలో విమర్శలు సహజం. కానీ విమర్శలు సహేతుకంగా ఉండాలి’’ అని తెలిపారు.

‘‘ఎటువంటి ఆధారాలు లేకుండా మహిళా అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం క్రూరత్వమే అవుతుంది. అన్ని రంగాల్లో మహిళలు విజయాలు సాధిస్తున్నారు. అలాంటి మహిళా అధికారులపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదు. మహిళా అధికారులను కించపరుస్తూ వార్తలు ఎలా రాస్తారు. సీఎంపై అవమానకర విమర్శలు చేయడంతో మరో కేసు కూడా నమోదయింది. ఆ రెండు కేసులపై విచారణ మొదలైంది’’ అని సజ్జనార్ తెలిపారు.

అసలు వివాదం ఇదే..

ఒక మంత్రికి, ఐఏఎస్ అధికారికి మధ్య ప్రేమాయణం ఉందని, అందుకే మంత్రి సిఫార్సుతో సదరు అధికారి పోస్టింగ్స్ జరిగాయంటూ ఒక ఛానెల్, పలు యూట్యూబ్ ఛానెళ్లు వార్తను ప్రసారం చేశాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఐఏఎస్ అధికారుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటువంటి విమర్శలు, ఆరోపణలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై విచారణ జరపడం కోసమే ఎనిమిది సభ్యుల సిట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సిట్‌లో నార్త్ రేంజ్ జాయింట్ సీపీ ఎన్ స్వేతా, చేవెళ్ల ఫ్యూచర్ సిటీ డీసీపీ యోగేష్ గౌతమ్, ఏడీఎంఎన్ హైదరాబాద్ సిటీ డీసీపీ కే వెంకట లక్ష్మీ, హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ వీ అరవింద బాబు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషినల్ ఏసీబీ బీ ప్రతాప్ కుమార్, హైదరాబాద్ ఏసీపీ, సీసీఎస్ జీ గురు రాఘవేంద్ర, సీఐ సెల్ ఇన్‌స్పెక్టర్ సీ శంకర్ రెడ్డి, షీ సైబర్ సెల్ ఎస్ఐ హరీష్ ఉన్నారు.

Read More
Next Story