
రాజకీయనేతలకు సజ్జనార్ సంచలన వార్నింగ్
మాట్లాడిన వాళ్ళందరినీ పోలీసులు లోపలేసేవారు అని ఎద్దేవాచేశారు
‘‘ఎమర్జెన్సీ ఉంటే ఇలా మాట్లాడగలరా’’ ? ... ఇది హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వేసిన సూటి ప్రశ్న. సజ్జనార్ ప్రశ్నించింది ఎవరినంటే రాజకీయ నేతలను. జర్నలిస్టుల అరెస్టుల తర్వాత పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం మీద కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరంకుశ ప్రభుత్వం, ఎమర్జెన్సీ వచ్చిందని అంటున్నట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమర్జెన్సీ ఉంటే అందరు ఇలాగ మాట్లాడగలరా ? అని సూటిగా నిలదీశారు. మాట్లాడిన వాళ్ళందరినీ పోలీసులు లోపలేసేవారు అని ఎద్దేవాచేశారు. దర్యాప్తులో భాగంగానే సోదాలకు వెళ్తామని..ముఖ్యమంత్రి మీద అసభ్య పోస్టులు పెట్టిన కేసులోనూ సిట్ దర్యాప్తు జరుపుతోంది అని సజ్జనార్ క్లారిటి ఇచ్చారు.
కమిషనర్ ఇంకా ఏమన్నారంటే విచారణలో భాగంగా పిలిచినపుడు రావాలి కదా ? అని అడిగారు. ఒక జర్నలిస్టు రాత్రి పారిపోయేందుకు ప్రయత్నించారు, సాయంత్రం 5.30 గంటలకు బ్యాంకాక్ కు టికెట్ బుక్ చేసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఆ విషయం తెలియటంతోనే ఇళ్ళల్లో సోదాలకు వెళ్ళామని వివరించారు. ఛానెల్ సీఈవో ఎక్కడున్నారు ? తప్పుచేయకపోతే ఎందుకు భయం ? విచారణలో భాగంగా అందర్నీ పిలుస్తాం, ఎక్కడున్నా పట్టుకొచ్చి చట్టం ముందు ప్రవేశపెడతాం అని అన్నారు.
ఇప్పటివరకు పోలీసులు రాజకీయ పార్టీలకు లేదా నేతలకు వార్నింగులు ఇచ్చిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఇపుడు కూడా సజ్జనార్ ఎవరి పేరు ప్రస్తావించకుండా, ఏ పార్టీగురించి మాట్లాడకుండానే అందరికి కలిపి వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది. గతంలో కూడా పోలీసుల వైఖరిని చాలా సందర్భాల్లో చాలా పార్టీల నేతలు డైరెక్టుగానే ఎండగట్టిన సందర్భాలున్నాయి. అయినా అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులు ఇపుడు సజ్జనార్ ఇచ్చినట్లుగా వార్నింగ్ ఇవ్వలేదు. మరిపుడు హైదరాబాద్ కమిషనర్ వార్నింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.
ఈ వివాదానికి నేపధ్యం ఏమిటంటే ఒక ఛానల్లో ఒక మంత్రి, ఒక ఐఏఎస్ అధికారిణికి సంబంధించిన వివాదాస్పద కథనాన్ని ప్రసారం చేయటమే. కథనంలో ఎక్కడా మంత్రి, ఐఏఎస్ అధికారిణి పేరు ప్రస్తావన లేనప్పటికీ రాజకీయాలను క్లోజ్ గా ఫాలో అయ్యేవాళ్ళకి కథనంలోని మంత్రి, ఐఏఎస్ అధికారిణి ఎవరు అని అర్ధమయ్యేట్లుగా చెప్పారు. దాంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘంతో పాటు కొందరు మంత్రులు కూడా సదరు కథనం, టీవీ ఛానల్ పై మండిపోతున్నారు. దాని పర్యవసానమే జర్నలిస్టులపైన కేసులు, అరెస్టులు.
సంక్రాంతి పండుగ సందర్భం కాబట్టి వెంటనే బీఆర్ఎస్, బీజేపీ నేతలు రంగంలోకి దిగేసి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పోలీసుల వైఖరిని తూర్పారపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని తాము మాత్రమే రక్షించగలము అని పెద్ద పెద్ద డైలాగులు వినిపిస్తున్నారు. జర్నలిస్టులపై కేసులు పెట్టి, అరెస్టులు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు. ప్రభుత్వం, పోలీసుల చర్యలపై తీవ్రంగా నిరసన తెలిపారు. జర్నలిస్టులపై రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటు మండిపోతున్నారు. ‘‘సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకుని పనిచేస్తున్నారు’’ అని హరీష్ అనటంతో కమిషనర్ బాగా హర్టయినట్లు అనిపిస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ హయాంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మీడియా విషయంలో ఇలాగే వ్యవహరించింది. మీడియాను కిలోమీటర్ లోతులో బొంద పెడతానని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎంఎల్ఏల ప్రమాణస్వీకారం సందర్భంగా ఒక టీవీ ఛానల్ వ్యగ్యంగా కథనాన్ని ప్రసారం చేసిందనే కారణంగా ఏడాదికి పైగా ప్రసారాలను నిలిపేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ప్రభుత్వంపై వ్యతిరేక కథనం ప్రసారం చేసిందని మరో ఛానల్ ప్రసారాలను కూడా ఏడాదికిపైగా నిలిపేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఛానళ్ళ ప్రసారాలను అడ్డుకోవటం తప్పని అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు తెలీదా ? ప్రసారాలను ప్రభుత్వం అడ్డుకోవటంపై జర్నలిస్టులు నానా గొడవచేసినా ఇదే కేటీఆర్, హరీష్ ఎందుకు పట్టించుకోలేదు ?
ఇక, ఎన్డీయే ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది. ఎందుకంటే కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాసినందుకు, ప్రసారం చేసినందుకు ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులపై కేసులు పెట్టి, అరెస్టులు చేయించి రిమాండుకు పంపిన విషయం తెలిసిందే. కొందరు జర్నలిస్టులు కోర్టుల్లో పోరాడి తమ మీద నమోదైన కేసులను కొట్టేయించుకున్నారు. అధికారంలో ఉన్నపుడు పార్టీలకు గుర్తురాని మీడియా స్వేచ్చ ప్రతిపక్షంలోకి రాగానే బీఆర్ఎస్ నేతలకు సడెన్ గా గుర్తుకొచ్చేయటమే ఆశ్చర్యం.
మీడియా స్వేచ్చంటే ఇదేనా ?
మీడియా స్వేచ్చ ముసుగులో ఏదంటే అది రాసేస్తాము, కథనాలు ప్రసారాలు చేస్తామంటే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. ప్రజాసమస్యలపైన వార్తలు రాయటం, కథనాలను ప్రసారం చేసినపుడు కూడా పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే సమాజం నుండి మద్దతు దొరుకుతుంది. అలాకాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో జరుగుతోందని సమాజానికి ఏవిధంగానూ మేలుచేయని కథనాలను ప్రసారం చేయటం వల్ల ఎవరికి ఉపయోగం ? మీడియా స్వేచ్చ ముసుగులో ఎవరిమీదంటే వాళ్ళపైన ఇష్టారాజ్యంగా కథనాలను ప్రసారం చేస్తాం, వార్తలు రాస్తామంటే ఎవరూ అంగీకరించరు. మీడియా అన్నది ప్రజాపక్షంగా ఉండాలి, సమాజహితం కోసమే పనిచేయాలి. అంతేకాని ఎవరిపైనో బురదచల్లేందుకు ఇంకెవరిచేతిలోనో ఆయుధంగా మారుతామంటే ఎవరూ హర్షించరు.

