రివ్యూ మీటింగ్‌కు రాలేదని వీసీల జీతాలు నిలిపేశారు.ఈ పని చేసిందెవరంటే..
x

రివ్యూ మీటింగ్‌కు రాలేదని వీసీల జీతాలు నిలిపేశారు.ఈ పని చేసిందెవరంటే..

సమీక్ష సమావేశానికి రాలేదని బీహార్ ప్రభుత్వం ఏకంగా వీసీల జీతాలకు చెక్ పెట్టింది. ఎందుకు హాజరు కాలేదో వివరణ కూడా ఇవ్వాలని మెమోలు జారీ చేశారు.


బీహార్ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల బ్యాంకు అకౌంట్లను ప్రీజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితం విద్యా శాఖ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పెండింగ్‌ పరీక్షలు, ఇతర సమస్యలపై చర్చించడం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి వీసీలెవరూ హాజరుకాలేదు. దీంతో విద్యాశాఖ కార్యదర్శి బైద్యనాథ్ యాదవ్ ఓ లేఖ జారీ చేశారు.

‘‘రెండు రోజుల్లో వీసీల నుంచి సంతృప్తికర సమాధానం రాకపోతే, FIR నమోదు అవుతుంది. వీసీల జీతాల చెల్లింపులు ఆగిపోతాయి. ఉత్తర్వులు వచ్చే దాకా సంబంధిత విశ్వవిద్యాలయాల బ్యాంకు ఖాతాలలో నగదు లావాదేవీలు జరగకూడదు.’’ అని ఆ లేఖలో కనపర్చారు. మగద్ విశ్వవిద్యాలయం, కామేశ్వర్ సింగ్ దర్భంగా సంస్కృత విశ్వవిద్యాలయం మినహా అన్ని విశ్వవిద్యాలయాలకు ఈ లేఖను పంపారు.

“విశ్వవిద్యాలయాల్లో పరీక్షలు, తదితర కీలక అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి వారి (VCలు) గైర్హాజరయ్యారు. వారు (వీసీలు) ప్రభుత్వ ఉద్యోగులుగా తమ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారు’’ అని విద్యాశాఖ కార్యదర్శి లేఖలో రాశారు.

గత ఆగస్టులో..

ముజఫర్‌పూర్‌లోని బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ బీహార్ యూనివర్శిటీ తమ పరిధిలోని విద్యాసంస్థలను తనిఖీ చేయడంలో విఫలమయ్యారని, సమీక్షా సమావేశానికి హాజరు కాకపోవడంతో గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం వీసీ, ప్రో-వీసీల జీతాలను నిలిపివేసింది విద్యా శాఖ. వర్సిటీ బ్యాంక్ ఖాతాలను ప్రీజ్ చేయాలని అప్పట్లో ఆదేశించారు కూడా.

Read More
Next Story