జీహెచ్ఎంసీ విభజన.. కార్మికులకు ఆలస్యమవుతున్న జీతాలు
x

జీహెచ్ఎంసీ విభజన.. కార్మికులకు ఆలస్యమవుతున్న జీతాలు

GHMCలో విలీనమైన ప్రాంతాల్లో ఔట్‌సోర్సింగ్ శానిటేషన్ కార్మికులకు జీతాలు ఆలస్యమవుతున్నాయని BRS ఆరోపణలు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్.


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఆలస్యం కావడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. తాజాగా దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని, కార్మికులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ కోరింది. పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను ప్రధాన కార్యదర్శి , ఎంఏయూడీ ప్రధాన కార్యదర్శికి కూడా పంపినట్లు తెలిపారు.

నర్సింగి సర్కిల్‌లోనే దాదాపు 400 మంది ఔట్‌సోర్సింగ్ శానిటేషన్, మున్సిపల్ కార్మికులు ప్రతి నెలా 20 నుంచి 25 రోజుల వరకు జీతాల ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసిన ప్రాంతాలు, అలాగే సైబరాబాద్ వంటి కొత్త కార్పొరేషన్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని వివరించారు.

ఈ కార్మికులలో ఎక్కువ మంది ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారని ఆయన గుర్తు చేశారు. వారి కుటుంబాల జీవనం పూర్తిగా ఈ జీతాలపైనే ఆధారపడుతుందని తెలిపారు. జీతాల చెల్లింపుల్లో పదే పదే ఆలస్యం కావడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.

ఇదే సమయంలో ప్రభుత్వం పట్టణ శుభ్రతను మెరుగుపర్చేందుకు “99 డేస్ గార్బేజ్ ఫ్రీ ప్రోగ్రామ్”ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో మంచి ఫలితాలు ఆశిస్తూ కార్మికుల జీతాలు సమయానికి ఇవ్వకపోవడం విరుద్ధంగా ఉందని ఆయన సూచించారు. జీతాలు ఇవ్వకుండా అదనపు పనిభారం పెట్టడం న్యాయం కాదని, మానవత్వానికి విరుద్ధమని లేఖలో వివరించారు.

అదేవిధంగా శానిటేషన్ పనులకు ఉపయోగించే వాహనాల నిర్వహణకు సరిపడ నిధులు లేకపోవడంతో వాటి నిర్వహణ సరిగా జరగడం లేదని కూడా సమాచారం అందిందని తెలిపారు. దీనివల్ల సేవల సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని చెప్పారు.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఐదు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వానికి సూచించింది. ఔట్‌సోర్సింగ్ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయడం, ప్రతి నెలా సమయానికి జీతాలు చెల్లించడం, శానిటేషన్ వాహనాల నిర్వహణకు సరిపడ నిధులు ఇవ్వడం, కార్మికుల గౌరవం , జీవన భద్రతను కాపాడడం, ఇంకా బకాయి వేతనాలన్నింటినీ తక్షణమే విడుదల చేయడం వంటి అంశాలను ప్రస్తావించింది.

ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తే వందలాది కార్మికులు , వారి కుటుంబాలకు ఉపశమనం లభిస్తుందని సీతారాం ధూళిపాల లేఖలో పేర్కొన్నారు. అలాగే శుభ్రత కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడానికి ఇది సహాయపడుతుందని కూడా సూచించారు.

Read More
Next Story