బిస్కెట్ నుంచి బిర్యానీ వరకు కల్తీ మాయాజాలం
x
కల్తీ ఆహాీరపదార్థాల గుట్టురట్టు చేసిన పోలీసులు

బిస్కెట్ నుంచి బిర్యానీ వరకు కల్తీ మాయాజాలం

హైదరాబాద్‌లో కల్తీ కలకలం..ఒక్క నెలలోనే 61 కేసులు


లాభాల కోసం మనుషుల ప్రాణాలను పణంగా పెడుతున్న కల్తీ రాయుళ్ల అకృత్యాలు హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తున్నాయి. ఆహారం పేరుతో జరుగుతున్న ఈ ప్రమాదకర కల్తీ దందాపై హెచ్-ఫాస్ట్ బృందం మెరుపుదాడులు నిర్వహిస్తూ నిజాలను వెలుగులోకి తీసుకువస్తోంది.

పసిబిడ్డలకు తినిపించే బిస్కెట్ల నుంచి ఐస్ క్రీమ్ లు ,ప్రతి వంటింట్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి, పాలు, పెరుగు, బిర్యానీ వరకు ప్రతి వస్తువులోనూ విషం నింపుతున్న కల్తీ రాయుళ్ల అకృత్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం కేంద్రంగా కల్తీ ఆహార పదార్థాల దందా యథేచ్ఛగా సాగుతోంది.

హెచ్ ఫాస్ట్ పోలీసు బృందం

ప్రజారోగ్యాన్ని కాపాడటమే పరమావధిగా ఆహార భద్రత కోసం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ లో హెచ్ ఫాస్ట్ (H-FAST) పేరిట ప్రత్యేక పోలీసు బృందాన్ని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఏర్పాటు చేశారు. ఈ పోలీసు బృందం కల్తీ ఆహార ముఠాల గుట్టు రట్టు చేస్తూ వారిపై ఉక్కుపాదం మోపుతోంది.హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అండ్ యాక్షన్ టీమ్ వరుస దాడులతో హడలెత్తిస్తోంది. లాభాల కోసం సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టేలా కల్తీ చేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కల్తీ లేని సమాజం కోసం, సురక్షితమైన ఆహారం కోసం తాము పోరాటం చేస్తున్నామని సీపీ పేర్కొన్నారు.
హెచ్ ఫాస్ట్ ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటైన గత నెల రోజుల్లో 61 కేసులు నమోదు చేసి, 15 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేయడంతో పాటు, 64 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

పాడైపోయిన డబుల్ కా మీఠా

హైదరాబాద్‌లోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక రెస్టారెంట్లలో ఒకటైన గ్రాండ్ హోటల్ లో పాడైపోయిన డబుల్ కా మీఠా (డెజర్ట్) వడ్డించారని ఒక వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై విచారణ జరపాలని సంబంధిత పోలీసులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు.మార్చి 29వతేదీన జరిగిన ఈ ఘటనపై వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.కాగా గ్రాండ్ హోటల్ యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించింది.

కల్తీ ఆహార ముఠా భగ్నం

హైదరాబాద్ శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఆహార ఉత్పత్తుల తయారీ , విక్రయాల్లో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.మార్చి 28వతేదీన పోలీసులుహెచ్ ఫాస్ట్ బృందంతో కలిసి బాబుల్ రెడ్డి నగర్, లక్ష్మీగూడ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నిందితులు అరుణ్ కుమార్ ఫుడ్స్, అంజని ఫుడ్స్,జైన్ ఫుడ్స్ పేర్లతో మిక్చర్, నమ్‌కీన్, చిక్కీలు, ఉస్మానియా బిస్కెట్లను తయారు చేస్తూ, ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని తేలింది. హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తూ వాటిని స్థానిక మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ కేసులో నిందితులైన మున్నీర్ అరుణ్ కుమార్ (34), వి. మస్తాన్ రెడ్డి (46), విశాల్ జైన్ (41)లను పోలీసులు అరెస్టు చేశారు. రూ.3.35 లక్షలవిలువైన కల్తీ ఆహార పదార్థాలు, ముడిసరుకులు, రసాయనాలు, ఆహార రంగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ బేకరీ తయారీ కేంద్రం గుట్టు రట్టు

గోల్కొండ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం, గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి హైదరాబాద్‌లోని కేడీ కాలనీలో అక్రమంగా నడుస్తున్న ఒక బేకరీ తయారీ కేంద్రంపై దాడి చేసింది. సరైన లైసెన్సు లేకుండా, పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్నందుకు గాను కేడీ కాలనీ నివాసి, మహ్మద్ రజా కుమారుడైన అహ్మద్ రజా (46) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

కుళ్లిన చికెన్ స్వాధీనం

నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్‌ను స్థానిక విక్రేతలకు సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం అరెస్ట్ చేసింది. హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కె. నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్ నగర్, జింకలవాడ వద్ద ఉన్న 'మెసర్స్ ఎస్.పి.ఆర్ చికెన్' ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్‌ను గుర్తించారు. దీనిని స్థానిక హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది.

ముషీరాబాద్‌లో అక్రమ ఐస్‌క్రీం తయారీ కేంద్రంపై దాడి

కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు), జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారి సమన్వయంతో కలిసి ముషీరాబాద్‌లోని బాపూజీ నగర్‌లో బ్లూబెల్స్ ఐస్ క్రీం పేరుతోనడుస్తున్న ఒక ఐస్‌క్రీం తయారీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన లైసెన్స్ లేకుండా కేంద్రాన్ని నడుపుతున్నందుకు,కల్తీ, అపరిశుభ్రమైన, గడువు తీరిన ఐస్‌క్రీం ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నందుకు గాను పట్టాల అశోక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాటేదాన్‌లో కుళ్లిన గుడ్లు

హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాంతంలో "మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ" పేరుతో అక్రమంగా నడుస్తున్న ఒక ఆహార తయారీ యూనిట్‌పై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దాడి చేశారు. ఈ ఆపరేషన్ సందర్భంగా ఆ యూనిట్‌ను నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితులు అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో, కుళ్లిన గుడ్లు, సోడియం బెంజోయేట్, సార్బిక్ ఆమ్లం, ద్రవం వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి డోనట్ బన్స్ కేకులను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
జీడిపప్పులో పురుగులున్నాయని పోలీసు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.పురుగులున్న 210 కిలోల జీడిపప్పు ను స్వాధీనం చేసుకున్నారు.జీడిపప్పు నమూనాలను ప్రయోగశాల విశ్లేషణకు పంపారు.

మిఠాయిలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు

తెలంగాణ వ్యాప్తంగా మిఠాయి ఉత్పత్తుల తయారీదారులు/రిటైలర్లపై పెద్ద స్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.109 సంస్థలను (తయారీదారులు & రిటైల్ యూనిట్లతో సహా) తనిఖీ చేశారు.190 నమూనాలను సేకరించి ల్యాబ్ విశ్లేషణకు పంపారు.జిల్లాల్లో క్యాండీలు, ఎక్లేర్లు, చాక్లెట్లు, మ్యాంగో బైట్స్, నకిలీ చాక్లెట్లు, ఫ్లేవర్డ్ స్వీట్లతో సహా అనుమానిత/అసురక్షిత మిఠాయిలను స్వాధీనం చేసుకున్నారు.

అపరిశుభ్రంగా బాదంమిల్క్ తయారీ

మల్లాపూర్‌లో కుల్ఫీ, ఫలూదా,బాదం మిల్క్ తయారీ యూనిట్‌లో ఆహార భద్రతా శాఖకు చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించింది.ఈ బృందం తీవ్రమైన పరిశుభ్రత లోపాలను కనుగొంది.అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో బాదం మిల్క్ తయారుచేయడం,ఉత్పత్తులపై ఈగలు వాలడం గమనించింది.

మైలార్‌దేవ్‌‌పల్లిలో టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడులు

స్టార్ ట్రెడింగ్ కంపెనీ హోల్ సేల్ షాపులో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించింది. ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన బిస్కెట్లు, మిక్చర్ ప్యాకెట్లు విక్రయిస్తున్నారని వెల్లడైంది. తయారీ తేదీ, లేబుల్స్ లేని నాసిరకం తినుబండారాలను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భారీ మొత్తంలో నిల్వలను స్వాధీనం చేసుకున్న పోలీసులు స్టార్ ట్రెండింగ్ కంపెనీ నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ : సీఎం రేవంత్ రెడ్డి

ఆహార కల్తీ కేవలం నేరం కాదని, సమాజంపై సాగుతున్న ఘోరమైన దాడి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డ్రగ్స్, చెరువుల ఆక్రమణల నివారణకు ఈగల్, హైడ్రా లాగే ఆహార కల్తీని నియంత్రించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తామని సీఎం వెల్లడించారు.
దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు పకడ్బందీ వ్యవస్థను తీసుకు వస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆహారం మనిషి జీవనాధారం… కానీ అదే ఆహారం విషంగా మారితే సమాజం ఎంత ప్రమాదంలో పడుతుందో హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న ఘటనలు స్పష్టంగా చెబుతున్నాయి. కల్తీ రాయుళ్ల దందాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా, ఇది కేవలం చట్టపరమైన పోరాటంతో ముగిసే సమస్య కాదు.
ప్రతి వినియోగదారుడు అప్రమత్తంగా ఉండటం, అనుమానాస్పద ఉత్పత్తులను తిరస్కరించడం, వెంటనే ఫిర్యాదు చేయడం అవసరం. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం, నిబంధనలు అమలు చేయడం ఎంత ముఖ్యమో, సమాజం మొత్తం బాధ్యతగా వ్యవహరించడం అంతకంటే ముఖ్యం.లేకపోతే… మనం తినేది ఆహారం కాదు, నెమ్మదిగా ప్రాణాలను హరించే ప్రమాదమే అవుతుంది.
Read More
Next Story