బావా! సంక్రాంతి ముగ్గేస్తావా, చిందేస్తావా!
x

బావా! సంక్రాంతి ముగ్గేస్తావా, చిందేస్తావా!

సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ల సందడి. 10 రోజులముందే వచ్చే కూతుర్లు,కొత్త అల్లుళ్లతో ప్రతి ఇల్లు సందడిగా మారుతుంది. అత్తింటివారిచ్చే పండగ కానుకలు అదనపు ఆకర్షణ.


తెలుగువారి అచ్చతెలుగు పల్లె పండుగ సంక్రాంతి. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు. మామిడి తోరణాలు, కొత్త అల్లుళ్ల సందడి, బావా మరదళ్ల సరసాలు. హరిదాసుల సంకీర్తనలు, గాలిపటాలు, కోడిపందాలు, పంట చేతికొచ్చిన ఆనందంలో అన్నదాతలు. వీటికితోడు రకరకాల పిండివంటలు. తెలుగు లోగిళ్లు కళకళలాడే సంక్రాంతి పండుగ చాలా విశిష్టమైంది.

సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ల సందడి. పండగ వారం, 10 రోజులముందే వచ్చే కూతుర్లు, కొత్త అల్లుళ్లతో ప్రతి ఇల్లు సందడిగా మారుతుంది. బావామరదళ్ల సరసాలు, అత్తింటివారిచ్చే పండగ కానుకలు అదనపు ఆకర్షణ.

సంక్రాంతి అంటే కొత్త క్రాంతి....

సంక్రాంతి అంటే కొత్త క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన వేళ మనం సంక్రాంతి జరుపుకుంటాం. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటాం. మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ. కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. మొదటి రోజున తెల్లవారుజామునే లేచి బోగిమంటలు వేస్తారు. ఇంట్లో పాత సామాన్లను ఆ మంటల్లో వేస్తూ కుటుంబసబ్యులంతా ఆనందోత్సాహాల్లో తేలియాడుతారు.



పెద్ద పండుగ విశిష్టత ఏంటంటే...

రెండో రోజు పొంగలి, పిండివంటలు చేసి.. వాటిని పితృ దేవతలకు, దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ప్రత్యేక పూజలు చేస్తారు. మూడో రోజు కనుమ.. అన్నదాతలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. తమ పాడిపంటల్లో చేదోడువాదోడుగా నిలిచే గోవులు, బసవన్నలకు పూజలు చేస్తారు. ఈ రోజున మాంసప్రియులకు భలే పసందైన రోజు. ఘుమఘుమలాడే నాన్‌వెజ్‌ కూరలతో విందు ఆరగిస్తారు. నాలుగో రోజు వచ్చే పండుగ ముక్కనుమ. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు గౌరీదేవి వ్రతం చేసుకుంటారు. బొమ్మల కొలువు పెడతారు. గౌరీదేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది రకాల పిండివంటలను రోజూ నైవేద్యంగా పెడ్తారు.

మకర సంక్రమణం అంటే...

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. మకర సంక్రమణం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణం. శారీరక శ్రమ, పూజలకు అనువైన కాలం ఉత్తరాయణం.



ఉత్తర దక్షిణయానాల ప్రత్యేకత ఏమిటంటే...

సూర్యుడు.. కర్కాటక రాశిలోకి ప్రవేశించి.. ఆ తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను రాశులలో కొనసాగినంత కాలం దక్షిణాయనం. ఈ కాలం మానసికమైన అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైందని చెబుతారు. దేవతలకు.. పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనం ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణం ఒక పగలుగా చెబుతారు. దేవతలు మేలుకునే కాలమే ఉత్తరాయణ పుణ్య కాలం. అందుకే భీష్మపితామహుడు దక్షిణాయనంలో అంపశయ్య మీద పడినా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నిరీక్షించి ఆ తర్వాత తుదిశ్వాస విడిచారు. అందుకే ఈ సమయాన్ని పితృదేవతల ఆరాధనా పుణ్యకాలంగా భావిస్తారు. ఇలా సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన పుణ్యదినాన్నిమకర సంక్రమణ సంక్రాంతిగా ప్రాధాన్యత పొందింది.

Read More
Next Story