యూపీలో అలీఘర్ నుంచి సత్యపాల్ మాలిక్ ? అఖిలేష్ ప్లానేంటి?
యూపీలో అఖిలేష్ సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను బరిలో దింపుతున్నారు. అలీఘర్ నుంచి జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పోటీ చేయించాలని భావిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అత్యధిక సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇండియా కూటమి పార్టనర్ అయిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీతో సీట్లు సర్దుబాటుపై ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇప్పుడు గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభించాయి.
ఒకప్పటి జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను అలీఘర్ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని యోచిస్తున్నారు అఖిలేష్ యాదవ్. మాలిక్ 1989-91 మధ్యకాలంలో జనతాదళ్ పార్టీ నుంచి ఇక్కడి నుంచే పార్లమెంట్ కు ప్రాతినిథ్యం వహించారు. కానీ 1996లో సమాజ్ వాదీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి షీలా గౌతమ్ గెలుపొందారు.
జాట్ కమ్యూనిటీ ఓటర్ల కోసం...
అలీఘర్ నియోజకవర్గంతో పాటు మరో డజను నియోజకవర్గాల్లో జాట్ కమ్యూనిటీ ఎక్కువ. అందుకే ఇక్కడి నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను పోటీ చేయించాలనుకుంటున్నారు అఖిలేష్ యాదవ్. సత్యపాల్ మాలిక్, చరణ్ సింగ్ మనవడు జయంత్ .. ఇద్దరూ కూడా జాట్ కమ్యూనిటీ చెందిన వారే. ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 80 లోక్ సభ స్థానాలున్నాయి.
ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ..
ప్రసుత్తం లోక్ సభలో ఉత్తర ప్రదేశ్ నుంచి బీజేపీ తరుపున ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఈ సంఖ్యను ఇంకా పెంచుకునే దిశగా కమలనాథులు యోచిస్తున్నారు. అటు రాజ్యసభలోనూ, ఇటు లోక్ సభలోనూ వీలైనంత ఎక్కువమందిని గెలిపించుకోవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇటీవల భారత అత్యున్నత పురస్కారం భారత రత్నను జయంత్ తాత అయిన చౌదరీ చరణ్ సింగ్ కు ప్రదానం చేసింది బీజేపీ సర్కారు. చరణ్ సింగ్ ప్రధానిగా పనిచేశారు. జాట్ కమ్యూనిటీ నుంచి ఎన్నికయిన తొలి ప్రధాని. దీంతో రాజ్యసభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు, జయంత్ అటు సమాజ్ వాదీ పార్టీ, ఇటు భారత కూటమి నుంచి వైదొలిగి ఎన్డీఏలో చేరారు.
మాలిక్ కు ఆఫర్ ఇచ్చిన సమాజ్ వాదీ ..
అలీఘర్ నుంచి పోటీ చేయాలని కొన్ని నెలల క్రితం అఖిలేష్ యాదవ్ తరుపున ఉత్తర యూపీలోని ఓ ఎమ్మెల్యే ఒకరు మాలిక్ కు ఆఫర్ ఇచ్చారు. గతంలో ఇక్కడి నుంచే పార్లమెంటుకు రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన మాలిక్ సమాజ్ వాదీ ఆఫర్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
2022 వరకు మేఘాలయ గవర్నర్ గా ఉన్న మాలిక్.. బీజేపీకి ఓడించేందుకు సమాజ్ వాదీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తానని గత కొన్నేళ్లుగా చెబుతున్నారు. గతంలో మాలిక్ కు చెందిన ఇళ్లపై సీబీఐ దాడి చేసింది. దీన్ని తప్పుబడుతూ మాలిక్ సోషల్ మీడియా వేదికగా బీజేపీపై విరుచుకుపడ్డారు. తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా బీజేపీపై దుమ్మెత్తి పోశారు.
అఖిలేష్ యాదవ్ ఆఫర్ ను మాలిక్ వదులుకోరు అని పార్టీలో కొందరంటున్నారు. సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే 27 మంది పేర్లను ప్రకటించింది. అయితే అలీఘర్ నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావించి, ఆ స్థానానికి ఇంకా ఎవరి పేరు ప్రకటించలేదు. పొత్తులో భాగంగా మరో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
గతంలో పోటీ చేసిన స్థానం నుంచే మాలిక్ ను తిరిగి ఆయనను పోటీ చేయించాలని చూస్తోంది సమాజ్ వాదీ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోటీ చేయడం లేదు. కాగా గెలుపు అవకాశాలపై మాలిక్ లెక్కలేసుకుంటున్నారు. అలీఘర్ నియోజకవర్గంలో సుమారు 2 లక్షల దళితుల ఓట్లు కూడా ఉన్నాయి. వారంతా బీఎస్పీ మద్దతుదారులు.
మరో అభ్యర్థి చంద్రశేఖర్ ఆజాద్ రావన్..
దళితుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో సమాజ్ వాదీ, కాంగ్రెస్ కలిసి దళిత నాయకుడు చంద్రశేఖర్ అజాద్ రావన్ ను అలీఘర్ నుంచి రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నాయి. అయితే ఇతను అజాద్ సమాజ్ పార్టీ తరుపున పోటీ చేసే అవకాశం ఉంది. దళితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూటమి తరుపున పోటీ చేసే అభ్యర్థుల కోసం ప్రచారంలో కూడా పాల్గొంటానని ఈయన చెబుతున్నారు.
ప్రస్తుతం మాలిక్ , ఆజాద్ ఈ ఇద్దరే ప్రతిభావంతమైన క్యాంపెయినర్లు. వీరి ఉంటున్న ఏరియాలో వీరి సామాజిక వర్గం నుంచి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. భారత కూటమి తరుపున ఈ ఇద్దరూ కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే వయసు కారణంగా మాలిక్ పోటీ చేయకపోతే.. ఆజాద్ ను బరిలో దింపే ఆలోచనలో ఉన్నారు.
మరో ఆప్షన్...
67 ఏళ్ల బిజేందర్ సింగ్ మాజీ ఎంపీ. 2004 లో కాంగ్రెస్ తరుపున అలీఘర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అలీఘర్ కు దగ్గరలోని ఇగ్లాస్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఇతను కూడా మాలిక్ లాగే జాట్ కమ్యూనిటీ చెందిన వ్యక్తి. సింగ్ కూడా బలమున్న నాయకుడేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జాట్లు, రైతులు, మధ్యతరగతి ఓటర్లను దష్టిలో ఉంచుకుని పార్టీ మాలిక్ ను పోటీ చేయించేందుకు ఎక్కువగా ఇష్టపడుతోంది.
కారణాలు అవే..
మాలిక్ మోదీ ప్రభుత్వాన్ని గతంలో చాలాసార్లు విమర్శించారు. యువత, రైతుల సమస్యలపై, జమ్ము కాశ్మీర్ లో భద్రతపై బహిరంగంగా ఆ పార్టీని విమర్శించారు. 40 మంది జవాన్ల ప్రాణాలు కోల్లోయిన 2019 జరిగిన పుల్వామా ఘటనపై బీజేపీని తప్పుబట్టారు. అవి అప్పట్లో వైరల్ అయ్యాయి.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు మాలిక్ మద్దతు కూడా తెలిపారు. యాత్రలో భాగంగా అలీఘర్ మీదుగా ఆగ్రాకు వెళ్తున్న రాహుల్ కు ఇక్కడి నుంచి భారీ స్పందన లభించింది. మాలిక్ ను గతంలో రాహుల్ ఢిల్లీకి ఆహ్వనించి రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు కూడా.