‘తెలంగాణ పౌల్ట్రీ పై సౌదీ నిషేధ ప్రభావం ఉండదు’
x

‘తెలంగాణ పౌల్ట్రీ పై సౌదీ నిషేధ ప్రభావం ఉండదు’

ఎండా కాలంలో పౌల్ట్రీ రైతులు ఉత్పత్తి తగ్గిస్తారు కాబట్టి ఎగుమతులు ఆగినా ధరలు పడిపోవు


సౌదీ అరేబియా ఇండియా తో పాటు మరో 40 దేశాల నుండి పౌల్ట్రీ దిగుమతులపై విధించిన నిషేధ ప్రభావం తెలంగాణ పై పెద్దగా ఉండదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. నిషేధం విధిస్తూ సౌదీ అరేబియా సౌదీ అరేబియా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ తన వెబ్సైట్ లో ఇది తాత్కాలిత చర్య మాత్రమే అని స్పష్టం చేసింది.

పౌల్ట్రీ ఉత్పత్తులలో తెలంగాణా దేశంలో మూడవ స్థానంలో ఉంది. ఏవీఎన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ ఇటీవల కోళ్ళు, ఆడవుల్లోని పక్షులు, పాడి పశువులపై ప్రభావం చూపిన నేపధ్యంలోనే సౌదీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

దేశంలో పౌల్ట్రీ ఉత్పత్తులలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలు రెండు మూడవ స్థానాల్లో ఉన్నాయి. వీటి ఎగుమతుల్లో తమిళనాడు లోని నమక్కల్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. దాదాపు 95 శాతం ఎగుమతులు అక్కడి నుంచే జరుగుతున్నాయి. తమిళనాడు లో ఉత్పత్తి అయ్యే ఎనిమిది కోట్ల కోళ్లలో ఏడు కోట్లు ఒక్క నమక్కల్ లోనే జరుగుతాయని తెలంగాణా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైర్ అయిన డా. ఐ. బాలసుందరం చెప్పారు. ఆయన ఇప్పుడు స్వయంగా పౌల్ట్రీ ఫారం నడుపుతున్నారు.

మన దేశం మీద విధించిన నిషేధాన్ని ఇక్కడ అధికారులు జబ్బు లేదని సర్టిఫికేట్ ఇచ్చి తిరిగి ఎగుమతులు చేయవచ్చని అయితే ఈ ప్రక్రియ రెండు నుంచి మూడు వారాలు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గుడ్లు పాడయ్యే వస్తువు కాబట్టి వాటిని నిల్వఉంచలేరని అన్నారు. కోల్డ్ స్టోరేజీ లలో గుడ్లను 30 నుండి 45 రోజులు నిల్వ ఉంచచ్చు కానీ అందుకు వసతులు అందుబాటులో లేవని బాలసుందరం చెప్పారు.

పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్ సింగ్ బయాస్ తెలంగాణ రాష్ట్రం నుంచి గుడ్లు సౌదీ అరేబియాకు ఎగుమతులు చేయటంలేదని చెప్పారు. “మన దేశ గుడ్లు ఇతర దేశాలతో పోలిస్తే ధర తక్కువ నాణ్యత ఎక్కువ. ఇక్కడ గుడ్డు సరసమైన ధర రు. 6 రూపాయలలో ఉంటే, బంగ్లాదేశ్, నేపాల్ లలో రు. 14 వరకు ఉంది. మన దేశంలో సరాసరి ఏడాదికి 104 గుడ్లు, ఐదు కేజీల చికెన్ తింటున్నాం. పరిశ్రమ 8 నుంచి 9 శాతం పెరుగుతోంది. తల్లి పాల తరువాత మాంసకృతులు అత్యంత తక్కువ ధరల్లో దొరికే ఆహారం. ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే పరిశ్రమ మరింత పెరుగుతుంది. వీటి ఉత్పత్తి పెరిగితే దేశం లో పౌష్టిక ఆహార కొరత తీరుతుంది,” అన్నారు.

ఏవీఎన్ ఫ్లూ వ్యాప్తి పెరిగిన ప్రతిసారీ ఇలా నిషేధం విధించటం పరిపాటే అని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా. ఎస్. రవీందర్ రెడ్డి చెప్పారు. “మొక్క జొన్న లాంటి ముడి సరుకు ధరలు పెరగటంతో రైతులు ఇలాంటి సమయంలో గుడ్ల ఉత్పత్తి పెంచే అవకాశం లేదు. వేడి పెరుగుతున్న సమయంలో ఉత్పత్తి సాధారణంగా తగ్గిస్తారు. కోడి ధర రైతు దగ్గర కేజి ధర రు. 110 దాకా ఉంది. బ్యాన్ వలన కేవలం 2 నుంచి మూడు శాతం మాత్రమే ప్రభావం ఉంటుంది,” అని ఆయన అన్నారు.

Read More
Next Story