రామోజీ కేసు మళ్లీ తెలంగాణ హైకోర్టుకే!
మార్గదర్శి కేసు కీలక మలుపు తిరిగింది.కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఉండవల్లి అరుణ్‌కు కీలక సూచనలు చేసింది.
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తేల్చి చెప్పింది. తాము ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లలేదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్‌ల ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణలో తాము కేవలం సాంకేతిక అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నామని తెలిపారు. ఈ కేసు విచారణలో ఉండవల్లి అరుణ్ కుమార్.. హైకోర్టుకు అన్ని విధాలా సహకరించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణ జరుగుతున్నంత కాలం ఆయన మీడియా ముందుకు వెళ్లకూడదని, అదే మంచిదని ధర్మాసనం సూచించింది. ఈ కేసులో ఆర్‌బీఐ, ఏపీ సర్కార్, ఉండవల్లి తమ వాదనలను వినిపించాల్సి ఉంటుందని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు విచారణకు డెడ్‌లైన్
మార్గదర్శి చిట్ ఫండ్ కేసు విచారణకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ పెట్టింది. ఈ విచారణను ఆరు నెలల్లో ముగించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా మార్గదర్శి సంస్థ తమ డిపాజిటర్లకు ఇంకా డబ్బులు చెల్లించవలసి ఉందా? అనే అంశంలో నిజానిజాలు తేల్చాడానికి ఓ మాజీ న్యాయమూర్తిని నియమించాలని, ఆయన నేతృత్వంలో ఈ వివరాలను పరిశీలించాలని న్యాయస్థానం వివరించింది. ‘‘ఏపీలో కూడా మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతించాం. అందుకే ఈ విషయంలో మెరిట్స్‌లోకి వెళ్లకుండా హైకోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు రోజుల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన పూర్తి చేయాలి. ఆరు నెలల్లో కేసు విచారణను పూర్తి చేయాలి’’అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసుపై ఎవరు ఏం చెప్పారంటే!
ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన గత విచారణ సమయంలో దీనిపై ఆర్‌బీఐ తొలిసారి స్పందించింది. మార్గదర్శి సంస్థ చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని న్యాయస్థానానికి ఆర్‌బీఐ వివరించింది. ‘‘సెక్షన్ 45Aకు వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధం. అయినా మార్గదర్శి సంస్థ డిపాజిట్లు సేకరించింది. కోర్టులో ఈ కేసు నడుస్తుండగానే అదనంగా మరో రూ.2వేల కోట్లు వసూలు చేసిందీ సంస్థ. మొత్తంగా రూ.4,600 కోట్ల డిపాజిట్లు సేకరించింది’’అని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు. అదే విధంగా ఈ కేసుపై స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా..? లేదా..? అనేది ముఖ్యం కాదు. చట్ట విరుద్దంగా డిపాజిట్లు సేకరించారా..? లేదా..? అనేదే కీలకం’’అని ఆయన బెంచ్ వద్ద వివరించారు.
Next Story