తెలంగాణలో మండిపోతున్న ఎండలు
x
Scorching heat in Telangana

తెలంగాణలో మండిపోతున్న ఎండలు

ఉదయం 10 గంటల నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.


ఫిబ్రవరి రెండోవారం దాటగానే తెలంగాణలో ఎండలు ముదిరిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు రికార్డవుతున్నాయి. నాలుగు రోజుల క్రితంవరకు తెలంగాణ వ్యాప్తంగా చలివాతావరణమే ఉండేది. అలాంటిది ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనబడుతోంది. రెండోవారం నుండే వాతావరణంలో మార్పుమొదలై మూడోవారంతో మరింతగా పెరిగిపోతోంది. రాత్రుళ్ళు చలి తగ్గిపోయినా తెల్లవారుజామున ఇప్పటికీ కాస్త చలిగానే ఉంటోంది. ఉదయం 10 గంటల నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

గాలిలో తేమకూడా 26 నుండి 34 శాతం మాత్రమే నమోదవుతోంది. అందుకనే రాత్రిళ్ళు చలి తగ్గిపోవటమే కాకుండా పగటిపూట ఉక్కపోస్తోంది. ఎండలు ముదిరిపోతున్నాయి అనేకన్నా ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది అనటమే కరెక్టేమో. అయితే మూడోవారం మొదట్లో లేకపోతే నాలుగోవారంలో అకాల వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.

మార్చి మొదటివారం లో ఉక్కపోత మరింతగా పెరిగిపోవటం ఖాయమని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి వేసవిపై ఎల్ నినో ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనివల్ల మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉష్ణోగ్రత ఒకమాదిరిగా ఉన్నా, జూన్, జూలై మాసాల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని వాతావరణ శాఖ అంటోంది. అయితే ఇదే సమయంలో అప్పుడప్పుడు వర్షాలు కురిసే అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా మే, జూన్ నెలల్లో ఎండలు మండిపోయి వాతావరణం అత్యంత వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More
Next Story