సికిందరాబాద్ కార్పొరేషన్ డిమాండ్ మీద 11 న మీటింగ్...
x
సికింద్రాబాద్ క్లాక్ టవర్

సికిందరాబాద్ కార్పొరేషన్ డిమాండ్ మీద 11 న మీటింగ్...

జనవరి 17న ర్యాలీ, ఆపైన ఆందోళన ఉధృతం


సికింద్రాబాద్ ను కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటూ ఉంది. ఈ నెల 11 వ తేదీన బాలం రాయ్ లోని లీ ప్యాలెస్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ వాణిజ్య, వ్యాపార కార్మిక సంఘాలు, పలు కాలనీలు, బస్తీల కమిటీల ప్రతినిధులు సమావేశం అవుతున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, బిఆర్ ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు.

ఈ నెల 17 వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి MG రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీ జరుగుతుందని చెబుతూ ఈ ర్యాలీ గురించి, సికింద్రాబాద్ ప్రత్యేక కార్పరేషన్ డిమాండ్ భవిష్యత్ కార్యాచరణ పై చర్చించడం జరుగుతుందని ఆయన చెప్పారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే జంట నగరాలుగా ఎంతో ప్రసిద్ధి అని 1806 సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రాంతం ఏర్పాటు అయిందని చెబుతూ సికింద్రాబాద్ పేరును, ఈ ప్రాంతానికి ఉన్న చరిత్రను తుడిపి వేయాలనే కుట్రలను ప్రభుత్వం చేస్తున్నదని ఆయన విమర్శించారు.

"1897 లో 120 అడుగుల ఎత్తుతో నిజాం కాలంలో నిర్మించిన క్లాక్ టవర్ చరిత్రకు సజీవ సాక్ష్యం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పేర్లతో మూడు కార్పొరేషన్ లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అది జరిగే వరకు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకో లు వంటి ఆందోళన కార్యక్రమాలు దశలవారీగా చేపడతాం. ఇది ఒక పార్టీకి సంబంధించిన పోరాటం కాదని, ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటంగా ఆయన పేర్కొన్నారు," అని తలసాని అన్నారు.

తమ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ఉద్యమ సంఘాలు, అన్ని వర్గాలను ఆహ్వానిస్తామని ఇది రాచరిక పాలన కాదనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి అన్నారు.

ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా, ఈ ప్రాంత చరిత్రను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More
Next Story