సఖి నివాస్ ప్రారంభించిన సీతక్క.. మహిళలకు భారీ చేయూత
x

సఖి నివాస్ ప్రారంభించిన సీతక్క.. మహిళలకు భారీ చేయూత

హైదరాబాద్‌లో ‘సఖి నివాస్’ ప్రారంభించిన మంత్రి సీతక్క.. మహిళల సాధికారత, ఉపాధి, వడ్డీలేని రుణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది.


మహిళాభ్యున్నతికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో పెద్ద పీట వేస్తుంది. పార్లమెంటులో మహిళాబిల్లుని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని బీజె పి చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విరుగుడు చర్యలకు ఉపక్రమించింది. బీజేపీ కి గట్టి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ "సఖి నివాస్"వన్ స్టాప్ సెంటర్ ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చే మహిళలకు సురక్షితమైన వసతి కల్పించేందుకు ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.మహిళల అభ్యున్నతిని జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలకు మహిళలే స్వయంగా గుణపాఠం నేర్పుతారని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచిందని మంత్రి తెలియజేశారు. రైస్ మిల్లులు, పెట్రోల్ బంకర్లు, మహిళా సూపర్ మార్కెట్లు వంటి ఉపాధి అవకాశాలను మహిళా సంఘాలకు కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఒకప్పుడు ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నుండి, ఇంటి ఖర్చులను భరించడం, పిల్లల విద్యకు బాధ్యత వహించడం , నలుగురికి ఉపాధి కల్పించడం వంటి స్థాయికి వారిని పెంచుతున్నామని ఆమె పేర్కొన్నారు.

సంపద సృష్టికి మహిళలకు సాధికారత కల్పించడం ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబం బలపడుతుందని, రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో మహిళ ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. మహిళా సంఘాల నేతృత్వంలో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్లను బుధవారం ప్రారంభిస్తామని, ఖమ్మం జిల్లా మధిరా నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులతో వీటిని ప్రారంభిస్తామని సీతక్క వెల్లడించారు. జూన్ 5న రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్టీసీ బస్సులు అందిస్తారన్నారు. గ్రామం వారీగా మహిళలు సాధిస్తున్న విజయాలను సమాజానికి చాటిచెప్పాలని, తెలంగాణ పురోగతి మహిళల అభ్యున్నతిలోనే ఉందని ఆమె పేర్కొన్నారు.

మహిళలు ఇక కోటీశ్వరులు

ఇదిలాఉండగా 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మహిళా సాధికారత పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. సచివాలయంలో రాష్ట్రవ్యాప్తంగా 8,000 "ఇందిరా గాంధీ స్త్రీ శక్తి (ఐజీఎస్ఎస్) భవనాలు" కు శంకుస్థాపన చేసి, కోటి మంది మహిళల కోసం కొత్త చీరల డిజైన్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోని 553 బస్సులను జూన్ 5న పరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఊపి ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. మహిళా శక్తిని యావత్ దేశానికి ఆదర్శప్రాయమైన నమూనాగా పెంచాలనే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించే బ్యాంకు అనుసంధాన రుణాల పరిమితిని రూ .5 లక్షల నుండి రూ .10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలను ప్రభుత్వం కల్పించిందని, వడ్డీలేని రుణ పథకాల కోసం ఇప్పటికే రూ.1,390 కోట్లు పంపిణీ చేసిందని ఆయన పేర్కొన్నారు.మహిళలు ఇక కోటీశ్వరులు అవుతారని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.

మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని జరగుతున్న ప్రచారాన్ని ఫుల్ స్టాప్ పెట్టక పొతే మరో రెండేళ్ల తర్వాత తెలంగాణలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధ్యం కాదు అన్న భావనతో రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను ప్రోత్సహించడానికి అనేక సంక్షేమ , అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడానికి సిద్ధమైంది. తెలంగాణా అవతరణ దినోత్సవం రోజు అయిన జూన్ రెండునాడు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించనున్నారు స్వంత ఇల్లు ప్రతీ వ్యక్తి చిరకాల కోరిక. ముఖ్యంగా మహిళలు స్వంత ఇల్లు నెరవేర్చుకోవడానికి జీవిత కాలం ఎదురు చూస్తారు. జూన్ రెండున ఇందిరమ్మ ఇల్లు రెండో దశను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.దీంతో తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల జాతర ప్రారంభమవుతుందని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ నేత పొన్నాడ సుబ్రహ్మణ్యం "ఫెడరల్ తెలంగాణ " తో అన్నారు . ఈ దశలో నిమ్న జాతులకు 5 లక్షల ఆర్టిసాయం అందుతుందని ఆయన చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల జాతర వల్ల ప్రతి పక్ష పార్టీలు ఆయన బీజేపీ ,బిఆర్ఎస్ నేతల నోళ్లు మూతపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read More
Next Story