సింగరేణి రికార్డులన్నీ తక్షణమే సీజ్ చేయండి: బండి సంజయ్
x

సింగరేణి రికార్డులన్నీ తక్షణమే సీజ్ చేయండి: బండి సంజయ్

రూ.42 వేల కోట్ల సింగరేణి సొమ్మును దారి మళ్లించి సంస్థను నష్టాల్లోకి నెట్టి జీతాల కోసం బ్యాంకుల వద్ద ఓడీ తెచ్చుకుంటున్నారు


నైనీ బొగ్గు గనుల టెండర్ ప్రక్రియ సహా 2014 నుండి నేటి వరకు సింగరేణి రికార్డులన్నీ తక్షణమే సీజ్ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణ వచ్చాక సింగరేణి ఎక్కువ దోపిడీకి గురైందని, గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే సింగరేణిని దోచుకు తింటే, నేడు కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు విచ్చలవిడిగా దోచుకు తింటున్నారని అన్నారు.

కోర్టు కేసుల విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు.

“ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2014 నుండి ఇప్పటి వరకు సింగరేణిలో గనుల కేటాయింపు, జరిగిన దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కేసీఆర్ పాలనలో సింగరేణిలో దోచుకున్న సొమ్ముతోనే బీఆర్ఎస్ పార్టీని ఇన్నాళ్లు నడిపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల పుణ్యమా? అని రూ.42 వేల కోట్ల సింగరేణి సొమ్మును దారి మళ్లించి ఆ సంస్థను నష్టాల్లోకి నెట్టారు. జీతాల కోసం బ్యాంకుల వద్ద ఓడీ తెచ్చుకునే దుస్థితి కల్పించారు. ఎన్నికలకు ముందు సింగరేణిని లాభాల్లోకి తెస్తామంటారు అధికారంలోకి వచ్చాక ఆ సొమ్మునంతా దారి మళ్లించడం ఈ రెండు పార్టీలకు పరిపాటైంది. సింగరేణి ప్రజలు, కార్మికులు రెండు పార్టీల తీరును చూసి అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలే,’’ అని దుయ్యబట్టారు.

‘‘ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను సాక్షిగా పిలిచామని మంత్రులు చెబుతుంటే విచారణకు పిలిచామని సజ్జనార్ చెబుతున్నారు. ఏది నిజం? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కేసీఆర్ లకు కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తోందా? కేటీఆర్, హరీష్ సహా అందరినీ సాక్షిగా పిలిస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ దోషులెవరు? ఫోన్ ట్యాపింగ్ దొంగలను సాక్షులుగా పిలవడమేంటి?’’అని ప్రశ్నించారు. సిట్ విచారణను ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రులు ప్రభావితం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సిట్ అధికారులకు నిజాయితీ, నిబద్దతతో విచారణ జరిపే స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగి విచారణ చేస్తే సిట్ అధికారులకు ఉన్న క్రెడిబిలిటీ పోతుందని చెప్పారు. అధికారంలో ఉన్నంత కాలం ప్రజల సొమ్మును దోచుకుని అరాచకాలకు పాల్పడ్డ కేసీఆర్ కుటుంబానికి అన్నీ లొట్టపీసు కేసుల్లాగే కన్పిస్తాయని ఎద్దేవా చేశారు. ఎన్ని అరాచకాలు, అవినీతి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదనే ధీమా కేసీఆర్ కుటుంబంలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు.

తాను ఫోన్ ట్యాపింగ్ చేయలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా ‘‘ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన దేవుడి ముందు కేసీఆర్, కేటీఆర్ ప్రమాణం చేసేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు. ‘‘మావోయిస్టుల జాబితాలో హీరోయిన్లు, వ్యాపారులతోపాటు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లను చేర్చింది నిజం కాదా? ఆఖరికి కేసీఆర్ బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ఆ జాబితాలో చేర్చి ఫోన్ ట్యాపింగ్ చేయించలేదా? ఇంకా సిగ్గులేకుండా దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేశామని చెబుతారా?’’అని ప్రశ్నించారు. తాను గతంలో కేటీఆర్ పై సవాల్ విసిరితే లీగల్ నోటీసులంటూ డ్రామాలాడారని, పోనీ ఆ లీగల్ నోటీసులకైనా కట్టుబడి ముందుకు సాగుతారా? అంటే మధ్యలోనే పారిపోయే పరికిపంద అని ఎద్దేవా చేశారు.

Read More
Next Story