
శామీర్‌పేట్ ప్రమాదం వెలుగులో డ్రగ్స్ నెట్‌వర్క్
శామీర్‌పేట్ ప్రమాదం తర్వాత విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగంపై విచారణ విస్తరించింది. పలువురు అనుమానితులపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఒక రోడ్డు ప్రమాదం భారీ డ్రగ్స్ నెట్వర్క్‌ను పట్టించింది. రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అప్పుడే తీగ లాగితో డొంక కదిలింది అన్న విధంగా ఒక చిన్న యాక్సిడెంట్ కాస్తా భారీ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ విద్యాసంస్థకు చెందిన కనీసం 20 మంది విద్యార్థులు పోలీసుల నిఘాలో ఉన్నారు. ఫిబ్రవరిలో ఐదుగురు విద్యార్థులు రెండు బైక్‌లపై ఫుడ్ కోర్ట్ నుంచి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో ఒక బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తుండగా, అది ఒక ట్రాన్స్‌పోర్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
విద్యార్థి మృతితో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అసలు ప్రమాదానికి కారణం ఏంటి? అన్న కోణంలో దర్యాప్తును కొనసాగించారు. అప్పుడే ఆ ఐదుగురు విద్యార్థులు కూడా డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు తేలింది. మృతి చెందిన విద్యార్థి వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించగా, ప్రమాదం తర్వాత అది కనిపించలేదని అధికారులు తెలిపారు. ఒక కాలేజీ అంతర్గత వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించారు.
అందులో ఒకరు గంజాయి వాడినట్లు తేలింది. కౌన్సెలింగ్ సమయంలో, క్యాంపస్‌లోని మరో విద్యార్థి ద్వారా డ్రగ్స్ అందుతున్నాయని తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పోలీసులు నిశ్శబ్దంగా విచారణను విస్తరించారు. క్యాంపస్ పరిసరాల్లో గంజాయి వినియోగం విస్తృతంగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మరో ముగ్గురు విద్యార్థులను విచారణకు పిలిచినా, వారికి నెగటివ్ రిపోర్ట్ వచ్చింది.
ఇప్పటివరకు కనీసం 14 మంది విద్యార్థులు కనిపించకపోవడంతో, వారిలో బంగ్లాదేశ్ మరియు నేపాల్‌కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక కాలేజీల్లోని యాంటీ-డ్రగ్ కమిటీలపై కూడా పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిష్ఠ దెబ్బతింటుందనే భయంతో సమాచారం ఇవ్వడంలేదని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని హెచ్చరించారు.
అంతేకాదు, 2025 అక్టోబర్‌లో అదే క్యాంపస్‌లో జరిగిన మరో విద్యార్థి మరణంపై కూడా పోలీసులు మళ్లీ దృష్టి సారించారు. అప్పట్లో ఆహారం తగిలి చనిపోయాడని కాలేజీ చెప్పినా, ఇప్పుడు డ్రగ్స్ కోణంలో కూడా పరిశీలన కొనసాగుతోంది. ఈ ఘటనతో విద్యాసంస్థల్లో డ్రగ్స్ నియంత్రణపై మరింత కట్టుదిట్టమైన చర్యలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

