లోక్‌సభ ఎన్నికల్లో శోభనా వర్సెస్ థరూర్?
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున తిరువనంతపురం నుంచి ప్రముఖ నటి శోభన పోటీ చేస్తారా? కొన్ని రోజులుగా వస్తున్న ఈ ఊహాగానాలపై థరూర్ ఏమన్నారు...
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున తిరువనంతపురం నుంచి ప్రముఖ నటి శోభన పోటీ చేస్తారా? కొన్ని రోజులుగా వస్తున్న ఈ ఊహాగానాలకు సమాధానం వచ్చింది. అది శోభన నుంచి కాదు. బీజేపీ నుంచి కూడా కాదు. తిరువనంతపురంలోని సిట్టింగ్ ఎంపీ థరూర్ నుంచే. శోభన తన స్నేహితురాలు అని, తాను ఆ స్థానంలో పోటీ చేయడం లేదని తనకు ఫోన్‌లో చెప్పిందని ఆయన పేర్కొన్నారు.
పుకారు ఎలా మొదలైంది ?
రాజకీయాలకు దూరంగా ఉండే శోభన, జనవరి మొదట్లో త్రిస్సూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో కనిపించారు. దాంతో ఆమె బిజెపిలో చేరడంపై ఊహాగానాలు మొదలయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు మోదీ ప్రభుత్వాన్ని ఆమె ప్రశంసించారు కూడా.
మరోవైపు థరూర్ తిరువనంతపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. నాలుగోసారి కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. కేరళలో పట్టు సాధించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
సురేష్ గోపీ ఏమన్నాడు..
శోభనను మినహాయిస్తే, రేసులో ఉన్న మరికొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. నిర్మాత జి సురేష్ కుమార్, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ జాబితాలో ఉన్నారు.
అయితే త్రిస్సూర్ నుంచి బిజెపి అభ్యర్థిగా మారిన నటుడు సురేష్ గోపి శోభన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పడంతో ఆమె చుట్టూ ఉన్న పుకార్లు మరింత బలపడ్డాయి. శోభన తిరువనంతపురం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేయడంపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయని గోపీ పేర్కొన్నారు.
అయితే ఏం జరుగుతోందని థరూర్ నేరుగా శోభనను అడగడంతో ఊహాగానాలకు తెరపడినట్లు తెలుస్తోంది. బిజెపి అభ్యర్థులుగా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయని, వారిని తాను తక్కువ అంచనా వేయనని చెప్పుకొచ్చారు. బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలు కేరళలో పనిచేయవని థరూర్ తేల్చి చెప్పారు.