పబ్లిక్ ప్లేసుల్లో పోకిరీలకు షాక్:షీ టీమ్స్ ఉక్కుపాదం!
x
ఈవ్ టీజర్లకు షీ టీమ్ హెచ్చరిక (ఫొటో కర్టసీ : షీ టీమ్స్ )

పబ్లిక్ ప్లేసుల్లో పోకిరీలకు షాక్:షీ టీమ్స్ ఉక్కుపాదం!

డెకాయ్ ఆపరేషన్లు, వీడియో ఆధారాలు, పోకిరీలకు చెక్


హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో షాపింగ్‌కు వచ్చిన యువతులను వేధిస్తున్న పోకిరీలపై షీ టీమ్స్ మఫ్టీలో ఆపరేషన్ నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. వీడియో ఆధారాలతో కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకున్నాయి. ఇది ఒక్క ఘటన మాత్రమే కాదు… 2014లో ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈవ్‌టీజింగ్, స్టాకింగ్, ఆన్‌లైన్ హరాస్మెంట్‌లపై ఉక్కుపాదం మోపుతూ మహిళలకు భరోసా కల్పిస్తున్న షీ టీమ్స్ 12 ఏళ్ల విజయగాథలో మరో అధ్యాయం.12 ఏళ్లుగా సాగుతున్న మహిళా భద్రత పోరాట గాథ. షీ టీమ్స్ విజయాలు, నమోదు చేసిన కేసులు, మారుతున్న పోలీసింగ్ విధానంపై ఈ ప్రత్యేక కథనం.

-నాంపల్లి ఎగ్జిబిషన్‌లో నిరంతర నిఘా, డెకాయ్ ఆపరేషన్ల ద్వారా, 264 మంది నేరస్థులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు, వారిలో 242 మంది మేజర్లు మరియు 22 మంది మైనర్లు. 188 మంది రెడ్ హ్యాండెడ్ నేరస్థులను హెచ్చరించి, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సరైన కౌన్సెలింగ్ తర్వాత వదిలిపెట్టారు. తీవ్రమైన దుష్ప్రవర్తనకు సంబంధించి 56 కేసులను చిన్న కేసులుగా నమోదు చేశారు.

షీ టీం ఆవిర్భావం 2014లో

తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం 2014వ సంవత్సరంలో షీ టీం ఏర్పాటైంది. నాటి నుంచి హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని 341 షీటీమ్ లు పనిచేస్తున్నాయి. గడచిన 12 ఏళ్ల కాలంలో షీ టీమ్స్ పలు విజయాలు సాధించాయి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పరిధిలో షీ టీం పలు కేసులు పెట్టి ఈవ్ టీజర్లకు కౌన్సెలింగ్ చేసింది. రాష్ట్రంలో పదివేల అత్యాచారం కేసులు నమోదు చేయడంతో పాటు 71వేలమంది పోకిరీలకు షీటీమ్స్ కౌన్సెలింగ్ చేసింది. గడచిన 12 ఏళ్లలో షీ టీమ్స్ తెలంగాణలో మహిళా భద్రతకు కొత్త దిశ చూపించాయి. అరెస్టులు, కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలతో పాటు సాంకేతిక ఆధారాలతో నేరాలను అరికట్టడంలో ముందంజలో ఉన్నాయి.హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో వేలాది కేసులు నమోదు చేసి మహిళలకు రక్షణ కవచంగా నిలిచాయి.తెలంగాణలో ఈవ్‌టీజింగ్‌పై ఉక్కుపాదం మోపుతూ షీ టీమ్స్ కఠిన చర్యలు తీసుకుంది.పబ్లిక్ ప్లేసుల్లో పోకిరీలకు చెక్ పెడుతోంది.

12 ఏళ్లలో షీ టీమ్స్ ప్రొగ్రెస్

రాష్ట్రంలో 10,000కు పైగా అత్యాచార కేసులను షీ టీమ్స్ నమోదు చేశాయి.71,000 మందికి పైగా ఈవ్‌టీజర్లకు కౌన్సెలింగ్ చేసింది.వేలాది పోకిరీలను స్టాకింగ్, సోషల్ మీడియా హరాస్మెంట్ కేసుల్లో అరెస్టులు కూడా చేసింది. ఈ పోలీసు బృందాలు మహిళలు, బాలికల భద్రత లక్ష్యంగా స్కూళ్లు, కాలేజీలు, ఐటీ కంపెనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.24×7 హెల్ప్‌లైన్, వాట్సాప్ ఫిర్యాదు వ్యవస్థలతో షీటీమ్స్ మహిళలకు భరోసా అందిస్తున్నాయి.షీ టీం మఫ్టీలో పర్యవేక్షించడంతోపాటు వీడియో ఆధారాలను సేకరిస్తోంది.

హైదరాబాద్ నగరంలో కేసులు అధికం
హైదరాబాద్ నగర కేంద్ర ప్రాంతాల్లో అత్యధిక ఫిర్యాదులు షీటీమ్స్ కు వచ్చాయి.నాంపల్లి, చార్మినార్, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు పోకిరీలకు హాట్‌స్పాట్స్ గా మారాయి.సోషల్ మీడియా ద్వారా ఫొటోల మార్ఫింగ్, బ్లాక్‌మెయిల్ కేసులు అధికం అయ్యాయి.ఐటీ కారిడార్‌లో ఆన్‌లైన్ హరాస్మెంట్, స్టాకింగ్ కేసులు పెరిగాయి. పబ్లిక్ ప్లేసుల్లో వేధింపులు,సోషల్ మీడియా స్టాకింగ్,ఫేక్ ఐడీలు సృష్టించి బ్లాక్‌మెయిల్,మొబైల్ ద్వారా అసభ్య సందేశాలు పంపించడంతో షీటీమ్స్ నిందితులపై చర్యలు తీసుకుంటోంది.

డెకాయ్ ఆపరేషన్లు

బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, కూరగాయల మార్కెట్లు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో షీ టీమ్స్ సాధారణ దుస్తులలో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. మహిళలను వేధించే లేదా వేధించే వ్యక్తులను సరైన ఆధారాలతో పట్టుకుని, కోర్టుల ముందు హాజరుపరుస్తారు మరియు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ అందిస్తున్నారు.మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లోని మహిళా భద్రత డీసీపీ పర్యవేక్షణలో, ఎల్‌బీ నగర్‌లోని సీపీ క్యాంప్ ఆఫీస్‌లో ఈవ్-టీజర్లకు కౌన్సెలింగ్ సెషన్‌లు నిర్వహించారు. 01.02.2026 నుండి 15.02.2026 వరకు మహిళలు,బాలికలను వేధించిన మొత్తం 130 మంది నేరస్థులను (102 మంది మేజర్లు మరియు 28 మంది మైనర్లు) షీ టీమ్స్ అరెస్టు చేశాయి.

ఆకతాయిలకు 'షీ టీమ్స్' సింహస్వప్నం

- నమ్మి స్నేహం చేశారు. ఆ చనువుతో కొన్ని వ్యక్తిగత ఫొటోలు పంచుకున్నారు. అదే ఇప్పుడు ఆమె మెడకు ఉచ్చులా మారింది. 'డబ్బులిస్తావా.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టమంటావా?' అంటూ నిత్యం వేధింపులు. చావలేక.. బతకలేక నరకయాతన అనుభవించిన ఆ యువతి చివరకు 'షీ టీమ్స్'ను ఆశ్రయించి విముక్తి పొందారు.
- మరొకరు.. రోజూ ఆఫీస్‌కు వెళుతుంటే చాలు, నీడలా వెంటపడటం.. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులు. ఫోన్ బ్లాక్ చేసినా కొత్త నంబర్లతో బూతులు తిడుతూ పైశాచిక ఆనందం. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ మహిళకు 'షీ టీమ్స్' అండగా నిలిచింది.
ఇవీ కేవలం ఉదాహరణలు మాత్రమే కాదు.. హైదరాబాద్ నగరంలో ఎంతోమంది మహిళలు అనుభవించిన మూగవేదనకు ప్రతిరూపాలు. నగరంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ, వేధింపులకు పాల్పడే ఆకతాయిల ఆటకట్టించడంలో హైదరాబాద్ షీ టీమ్స్ మరోసారి తమ సమర్థతను చాటుకున్నాయి. ఏడాదిలో మొత్తం 1149 ఫిర్యాదులు అందగా, వాటన్నింటినీ షీటీమ్స్ అత్యంత బాధ్యతాయుతంగా పరిష్కరించాయి.

బ్లాక్‌మెయిలింగ్ భూతం.. 366 మందికి విముక్తి

ఈ ఏడాది నమోదైన కేసులను విశ్లేషిస్తే.. అత్యధికంగా 366 మంది బాధితులు 'బ్లాక్‌మెయిలింగ్' సమస్యతోనే షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమై, తీయని మాటలతో నమ్మించి చనువు పెంచుకోవడం.. ఆపై వీడియో కాల్స్, వ్యక్తిగత ఫోటోల ద్వారా ఉచ్చు బిగించడం పరిపాటిగా మారింది. వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేయడం, పంపిన ఫోటోలను సేవ్ చేసుకుని డబ్బుల కోసం వేధిస్తున్నారు. మరికొన్ని కేసుల్లో.. ప్రేమ విఫలమైన తర్వాత, పాత ఫోటోలను అడ్డం పెట్టుకుని మాజీ ప్రేమికులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. "నాతో మాట్లాడకపోతే, వేరే పెళ్లి చేసుకుంటే.. మన పాత ఫోటోలు నీ కాబోయే భర్తకు పంపిస్తా" అంటూ వేధిస్తున్న 366 కేసుల్లో షీ టీమ్స్ బాధితులకు అండగా నిలిచింది.

ప్రేమ పేరుతో వల.. పెళ్లి అనగానే జలక్

ఈ ఏడాది అత్యంత ఆందోళన కలిగించే విషయం.. ప్రేమ, పెళ్లి పేరుతో జరిగిన మోసాలు. "నిన్ను పెళ్లి చేసుకుంటా" అని నమ్మించి శారీరకంగా లోబరుచుకోవడం, ఆర్థికంగా వాడుకోవడం, తీరా పెళ్లి ప్రస్తావన రాగానే ముఖం చాటేయడం వంటి 98 ఫిర్యాదులు అందాయి.

మఫ్టీలో నిఘా.. 3,826 మందికి కౌన్సెలింగ్

కేవలం ఫిర్యాదులే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ షీ టీమ్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. నగరవ్యాప్తంగా 15 బృందాలు బస్టాండ్లు, కాలేజీలు, రద్దీ ప్రదేశాల్లో మఫ్టీలో నిఘా వేసి, 2025లో ఏకంగా 3,826 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో మెజారిటీ ఆకతాయిలకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వగా, తీవ్రత ఎక్కువగా ఉన్న ఘటనల్లో ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి జైలుకు పంపారు.

కఠిన చర్యలు తప్పవు: వీసీ సజ్జనార్

‘‘మహిళల జోలికొస్తే.. ఇక మీ ఆటలు సాగవు. ముఖ్యంగా బ్లాక్‌మెయిలింగ్ పేరుతో ఆడబిడ్డలను భయపెట్టాలని చూస్తే, మీ భవిష్యత్తు జైలు గోడల మధ్యే అంతమవుతుంది. సోదరీమణులారా.. మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. మీకు రక్షణ కవచంలా నిలబడటానికి 'షీ టీమ్స్' ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి’’అని సీపీ సజ్జనార్ చెప్పారు.

మహిళలపై వేధింపులు ఎక్కడ జరిగినా సహించబోమనే సందేశాన్ని షీ టీమ్స్ మరోసారి స్పష్టంగా చాటాయి. పబ్లిక్ ప్లేసుల్లో నిఘా, డెకాయ్ ఆపరేషన్లు, సాంకేతిక ఆధారాలతో నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటూ ఆకతాయిలకు హెచ్చరికగా నిలుస్తున్నాయి. మహిళా భద్రతే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరాటం మరింత దృఢంగా కొనసాగనుంది.


Read More
Next Story