రేవంత్ ప్రభుత్వానికి మద్యం వ్యాపారుల షాక్ ?
x
Telangana Liquor associations ultimatum

రేవంత్ ప్రభుత్వానికి మద్యం వ్యాపారుల షాక్ ?

రేవంత్ ప్రభుత్వం మద్యం వ్యాపారులకు(Liquor business) సుమారు రు. 4 వేల కోట్లు బకాయిలు పడింది


మద్యం వ్యాపారుల సంఘాల నుండి ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తొందరలో షాక్ తప్పేట్లులేదు. మద్యం వ్యాపారుల సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య బకాయిల వివాదం పెరిగిపోతోంది. (Revanth)రేవంత్ ప్రభుత్వం మద్యం వ్యాపారులకు(Liquor business) సుమారు రు. 4 వేల కోట్లు బకాయిలు పడింది. ఈ బకాయిలు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలైన బకాయిలు కాదు. అంతకుముందు (KCR)కేసీఆర్ ప్రభుత్వం నుండే బకాయిలు మొదలయ్యాయి. అయితే మద్యం వ్యాపారులకు ఏ పార్టీ ప్రభుత్వం ఉంది అన్నదానితో సంబంధంలేదుకదా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని బకాయిల కోసం డిమాండ్ చేస్తారు. ఇపుడు జరుగుతున్నది ఇదే.

ఏళ్ళ తరబడి పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోతే తొందరలోనే ఉత్పత్తి నిలిపేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశాయి. అందులో బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉంది. ఏ సంఘం అయినా, ఎవరైనా ముందు విజ్ఞప్తులతోనే కదా మొదలుపెడతారు. ఇపుడు విజ్ఞప్తులన్నారు తొందరలోనే డిమాండ్ అంటారు వెంటనే హెచ్చరికల్లోకి దిగుతారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మద్యం బకాయిలు రు. 4 వేల కోట్లు చెల్లించటం ప్రభుత్వానికి పెద్ద కష్టంకాదు. ఎందుకంటే ఏడాదికి మద్యం ఆదాయమే ప్రభుత్వానికి సుమారు రు. 40 వేల కోట్లు అందుతోంది. ఇన్ని వేల కోట్ల ఆదాయం వస్తున్నపుడు నెలకు ఎంతో కొంత ప్రత్యేకంగా నిధి ఏర్పాటుచేసి బకాయిలను తీర్చేసుండచ్చు. అయితే ఆ పనిని రేవంత్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోందంటే వచ్చే ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, వివిధ సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది కాబట్టే. మద్యం వ్యాపారులకు బకాయిలు తీర్చాలంటే ప్రభుత్వం దగ్గర నిధులు ఉండటంలేదు. అందుకనే ఏదో ఒకటిచెప్పి బకాయిలు చెల్లించకుండా నెట్టుకొస్తోంది ప్రభుత్వం.

నిజానికి ప్రభుత్వానికి మద్యాన్ని సరఫరా చేసిన 45 రోజుల్లోపు బిల్లులు చెల్లించాలనే అగ్రిమెంట్ ఉంది. అయితే ఎప్పటి బిల్లులను అప్పుడే చెల్లించేంత సీన్ ప్రభుత్వానికి లేకపోవటంతోనే బకాయిలు పెరిగిపోతున్నాయి. గడచిన పదేళ్ళల్లో మద్యం ఆదాయం బాగా పెరిగింది. 2014లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికి రు. 9 వేల కోట్లు వచ్చింది. 2024లో మద్యం ఆదాయం రు. 39 వేల కోట్లకు పెరిగింది. పోయిన ఏడాది మద్యం షాపుల వేలంపాటల దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రు. 3 వేల కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. మద్యంపై ప్రభుత్వానికి సగటున ప్రతినెలా రు. 2500 కోట్లు అందుతోంది. ఈ విషయాలన్నీ మద్యం వ్యాపారులకు బాగా తెలుసు కాబట్టే తమ బకాయిలను వెంటనే తీర్చాలని గోలచేస్తున్నది. ఆమధ్య బకాయిలను తీర్చకపోతే మద్యం ఉత్పత్తిని నిలిపేస్తామని వ్యాపారులు వార్నింగ్ ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ప్రభుత్వం వ్యాపారులను ఏదో బతిమలాడుకుని ఉత్పత్తి నిలిపేయకుండా మ్యానెజ్ చేసింది. మరి ఈసారి ఏమి చేస్తుందో చూడాల్సిందే.

Read More
Next Story