విజయశాంతి రెడ్డి ఆత్మహత్యలో అనూహ్య మలుపు
x

విజయశాంతి రెడ్డి ఆత్మహత్యలో అనూహ్య మలుపు

విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి, భార్య తల్లి, తమ్ముడి మధ్య వివాదాలు రేగి ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవటంతో పోలీసులు ఆత్మహత్య కేసును తిరిగి రీఓపెన్ చేశారు


ఈఏడాది జనవరి 30వ తేదీన చర్లపల్లి రైల్వేస్టేషన్లో ఇద్దరు పిల్లలతో విజయశాంతిరెడ్డి గూడ్స్‌రైల్ కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరికీ గుర్తుండేఉంటుంది. తల్లి, పిల్లల ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి అనుమానాలు, వివాదాలు పోలీసులకు కనబడలేదు. దాంతో పోలీసులు కేసును క్లోజ్ చేసేశారు. అలాంటిది ఇపుడు సడెన్ గా కుటుంబంలోని గొడవలు బయటపడ్డాయి. విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి, భార్య తల్లి, తమ్ముడి మధ్య వివాదాలు రేగి ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవటంతో పోలీసులు ఆత్మహత్య కేసును తిరిగి రీఓపెన్ చేశారు. ఆరోపణలు, ప్రత్యారోపణలను చూసిన పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే భార్యచనిపోయిన మూడునెలల తర్వాత భర్త సురేందర్ రెడ్డి అత్తగారు పుష్పవతి, బావమరిది చిరంజీవితో పాటు బావమరిది భార్య లక్ష్మిపైన పోలీసులకు ఫిర్యాదుచేశాడు. భార్య చనిపోయినపుడు ఇంట్లో ఉండాల్సిన రు. 1.5 కోటితో పాటు కిలోన్నర బంగారం కనబడలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అత్తగారు, బావమరిది, బావమరిది భార్యే డబ్బు, బంగారాన్ని ఎత్తుకెళ్ళారని ఫిర్యాదులో ఆరోపించాడు. అంతేకాకుండా తన భార్య, ఇద్దరు పిల్లల ఆత్మహత్యకు పైన చెప్పిన ముగ్గురే కారణమని కూడా ఫిర్యాదులో స్పష్టంగా చెప్పాడు. తన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి అందరికీ శిక్షలు పడేలా చూడాలని సురేందర్ రెడ్డి పోలీసులను కోరాడు.

ఇదేవిషయమై మీడియాతో భర్త మాట్లాడినపుడు తనింట్లోని కోటిన్నర రూపాయలు, కిలోన్నర బంగారం మాయమైపోయిందన్నాడు. అలాగే భార్య చనిపోయిన 25 రోజుల నుండి పైన చెప్పిన ముగ్గురు తన ఆస్తుల కోసం బాగా వేధిస్తున్నారంటు తీవ్రంగా మండిపోయాడు. పైముగ్గురి నుండి తనకు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి తనకు రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పాడు. తాను దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నపుడు ఆరునెలలకు ఒకసారి వచ్చేవాడిని అని అన్నాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్దస్ధాయిలో పనిచేస్తున్న తన భార్య, సోదరుడు చిరంజీవితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు చెప్పాడు. తన భార్య డబ్బుతోనే బావమరిది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు వివరించాడు.

వ్యాపారంలో భాగంగా ఆర్ధికలావాదేవీలతో ఇద్దరిమధ్య సమస్యలు మొదలవ్వటంతోనే పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు సురేందరరెడ్డి ఇపుడు చెప్పాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో తనభార్యను మోసంచేసి ఆత్మహత్యకు కారణం అవటమే కాకుండా ఇపుడు తన ఆస్తుల మీద కూడా బావమరిది కుటుంబం కన్నేసినట్లు సురేందర్ ఆరోపించాడు. డబ్బు, బంగారంతో పాటు ఆస్తిపత్రాలను కూడా బావమరిది కుటుంబమే ఎత్తుకెళ్ళిందన్నాడు.

ఇదే విషయమై విజయశాంతిరెడ్డి తమ్ముడు చిరంజీవి మీడియాతో మాట్లాడుతు తనతో పాటు తన కుటుంబంపై సురేందర్ చేస్తున్న ఆరోపణలు నిజంకాదన్నాడు. వివాహం సమయంలోనే మోసంచేసి సురేందర్ తన అక్కను వివాహం చేసుకున్నట్లు ఆరోపించాడు. తనకు బాగా ఆస్తులున్నాయని సురేందర్ చెప్పటం అబద్ధమని తేల్చేశాడు. సురేందర్ కాల్ డేటాను పరిశీలిస్తే అసలు విషయం బయటకు వస్తుందని చిరంజీవి చెప్పాడు.

జనవరి 30వ తేదీన ఇద్దరి పిల్లలతో కలిసి తల్లి విజయశాంతిరెడ్డి చర్లపల్లిలో గూడ్సరైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది. పోలీసులు ఎన్నికోణాల్లో దర్యాప్తుచేసినా ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. ఎందుకంటే పిల్లలు విశాల్ రెడ్డి, చైతన్యరెడ్డి పెద్ద కార్పొరేట్ కాలేజీలో ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారు. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో, ఐదంకెల జీతంతో విజయశాంతి పెద్ద హోదాలో పనిచేస్తుండేది. భర్త సురేందర్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్ధికంగా, కుటుంబపరంగా, ఉద్యోగంలో ఎలాంటి సమస్యలు లేనపుడు తల్లి, పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో ఎవరికీ అర్ధంకాలేదు. ఎవరిమీదా అనుమానం లేదని అప్పట్లో సురేందర్ చెప్పటంతో ఏమీచేయలేక పోలీసులు కేసును మూసేశారు. అలాంటి ఇపుడు సడెన్ గా మూడునెలల తర్వాత భర్త, అత్తగారు, బావమరిదులు ఒకరిపై ఆర్ధిక, ఆస్తుల వ్యవహారంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవటంతో మూసేసిన కేసును పోలీసులు తిరిగి ఓపెన్ చేసి దర్యాప్తు మొదలుపెట్టడం సంచలనంగ మారింది.

Read More
Next Story